– భూసేకరణ చేసి 26 లక్షల ఎకరాలకు నీరందిస్తాం
– చర్చల ద్వారానే కృష్ణా జలాల సమస్యలు పరిష్కరిస్తాం
– కేంద్రం, ప్రతిపక్షాల వైఫల్యాలపై ముఖ్యమంత్రి ధ్వజం
– గత పాలకుల వైఫల్యాల వల్ల రూ. 52,121 కోట్ల ఆర్థిక భారం. సీఎం ఆవేదన
– భీమా నికర జలాల్లో కోత
– కొడంగల్‌కు తరలింపుపై నీలినీడలు
– మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి
మహబూబ్‌నగర్ ప్రజాతంత్ర, జూన్ 5.పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ఎన్ని సమస్య లు అడ్డువొచ్చిన ఏడాదిలో పూర్తి చేస్తాం.. 26 లక్షల ఎకరాలకు సాగు నీరు అందిస్తాం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రాజెక్ట్ ల పై ప్రత్యేక దృష్టి సారించి రెండు రోజుల పర్యటన లో భాగంగా శుక్రవారం కర్వేనా రిజర్వాయర్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఎం మాట్లాడారు. గత 10 ఏళ్లలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలతో సహా కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ ప్రాజెక్టులను అసంపూర్ణంగా వదిలేసిందని సీఎం మండిపడ్డారు. ప్రాజెక్టులకు ప్రధానమైన భూసేకరణను (ఇంకా 4,000 ఎకరాలు పెండింగ్) పూర్తి చేయకుండా కేవలం పంపులు, లిఫ్టులకే రూ. 27,000 కోట్లు ఖర్చు చేసి ప్రజాధనాన్ని వృధా చేశారని ఆరోపించారు. గత ప్రభుత్వం చేసిన అనాలోచిత సాగునీటి అప్పుల కారణంగా ప్రస్తుత ప్రభుత్వంపై తీవ్ర ఆర్థిక భారం పడిందని సీఎం పేర్కొన్నారు. పాత అప్పుల కోసం ప్రస్తుత ప్రభుత్వం ఏకంగా రూ.52,121 కోట్ల అసలు, వడ్డీలు చెల్లించాల్సి వస్తోందని, దీనివల్ల కొత్తగా ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయడానికి నిధుల ఇబ్బందులు ఎదురవుతున్నాయని వెల్లడించారు. అయినప్పటికీ రాబోయే రెండేళ్లలో యుద్ధప్రాతిపదికన భూసేకరణ పూర్తి చేసి జిల్లాలోని 26 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని సీఎం స్పష్టం చేశారు. కృష్ణా, భీమా నదులపై కర్ణాటక తరహాలోనే మన సరిహద్దుల్లో కూడా బ్రిడ్జ్ కం బ్యారేజీలు నిర్మించి నీటిని గరిష్టంగా నిల్వ చేసుకునే యోచనలో ప్రభుత్వం ఉంది. దీనిపై త్వరలోనే సాంకేతిక నిపుణులతో ఉన్నత స్థాయి చర్చలు జరుపుతామని ముఖ్యమంత్రి వెల్లడించారు. పక్క రాష్ట్రంతో సత్సంబంధాలు, సానుకూల చర్చల ద్వారానే కృష్ణా నది నీటి వివాదాలను పరిష్కరించి, పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించిన కీలక పనులను ఏడాది కాలంలోనే పూర్తి చేసి తీరుతామని ఆయన గట్టి నమ్మకాన్ని వ్యక్తం చేశారు. గత పాలకుల లాగా చిల్లర రాజకీయాలు, జబ్బలు చరుచుకునే సంస్కృతి తమది కాదని, కేవలం ప్రజల ప్రయోజనాల కోసమే తమ ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందని తెలిపారు.
ఉమ్మడి రాష్ట్రంలోనే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుతోపాటు దిండి ప్రాజెక్టుకు కూడా జీవోలు మంజూరయ్యాయని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు 90 టీఎంసీలు, దిండి ప్రాజెక్టుకు 20 టీఎంసీల నీటి కేటాయింపులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో నిరంతరం చర్చిస్తున్నట్లు తెలిపారు. ఈ చర్చలు అత్యంత సానుకూల దిశగా సాగుతున్నాయని, త్వరలోనే తెలంగాణ ప్రజలకు ఒక మంచి శుభవార్త అందిస్తామని ఆయన ప్రకటించారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు దక్కాల్సిన ప్రతి బొట్టునూ వ్యూహాత్మకంగా రాబట్టుకుంటామని, ఎవరికీ నష్టం జరగనప్పుడు కొందరు కావాలనే అపోహలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. గతంలో కాంగ్రెస్ హయాంలోనే పాలమూరు జిల్లాలో 10 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరిచ్చామని, ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసుకుంటే మరో 16 లక్షల ఎకరాలకు నీరందుతుందని సీఎం వివరించారు. మొత్తంగా 26 లక్షల ఎకరాలకు సాగునీరు అందించి, గోదావరి జిల్లాల ప్రజలు అసూయపడేలా పాలమూరును పచ్చటి కోనగా మారుస్తామన్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు పనులు 50 నుండి 52 శాతం వరకు పూర్తయ్యాయి. రాబోయే ఏడాది కాలంలో హెడ్ వర్క్స్ నుండి ఉద్దండాపూర్ వరకు ఉన్న పంపులు, లిఫ్టులు, రిజర్వాయర్లు, ట్విన్ టన్నెల్స్ పనులన్నింటినీ వంద శాతం పూర్తి చేస్తామన్నారు. ప్రాజెక్టులపై చర్చ కేవలం కమిషన్లు, కాంట్రాక్టుల కోసం కాదని, గత 20 ఏళ్లుగా ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకుండా ప్రజాక్షేత్రంలో పనిచేసిన చరిత్ర తనదని ఆయన స్పష్టం చేశారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు తెలంగాణ ఎన్‌ఓసీ ఇస్తేనే బంకచల్ల నల్లమల్ల సాగర్ అంశంపై చర్చిస్తామని కేంద్ర ఇరిగేషన్ సెక్రెటరీ అన్నారంటే, అది తమ ప్రభుత్వం చేసిన నిరంతర కృషి, వ్యూహాత్మక ఒత్తిడి వల్లే సాధ్యమైందని సీఎం స్పష్టం చేశారు. ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి తాము చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయని, రాబోయే ఆరు నెలల కాలంలో కృష్ణా నదిపై ఉన్న మెజారిటీ సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించి తీరుతామని ముఖ్యమంత్రి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సమావేశంలో ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్, అబ్కారి శాఖ మంత్రి జూపల్లి, క్రీడలు, యవజనుల శాఖ మంత్రి శ్రీహరి, ప్లానింగ్ వైస్ చైర్మన్ చిన్న రెడ్డి, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
వట్టెం పంప్‌హౌస్ మూడో లిఫ్ట్‌ను సందర్శించిన సీఎం 
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులను రెండు రోజులపాటు పరిశీలించేందుకు వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామం వద్ద ఉన్న వట్టెం పంపుహౌస్ మూడో లిఫ్టును శుక్రవారం సందర్శించారు. ఎస్‌జెఆర్ పిఆరఎలఐఎస్( పాలమూ రు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్)లో భాగంగా చేపట్టిన ఈ లిఫ్ట్ పనుల పురోగతిని పరిశీలించారు. సంబంధిత అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. 2020- 2023 సంవత్సరం నాటికి రూ.3300 కోట్లు ప్రాజెక్టుకు ఖర్చు చేయగా 2023 నుంచి ఇప్పటివరకు రూ.800 కోట్లను ఖర్చు చేసి ప్రాజెక్టు పనులను కొనసాగించినట్లు తెలిపారు. పెండింగ్‌లో ఉన్న మిగతా సివిల్ పనులను రూ.90 కోట్లతో వచ్చే మూడు నెలల్లో పూర్తి చేయనున్నట్లు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ఇక్కడ మొత్తం పది పంపులు ఉండగా ఐదింటిని ఏర్పాటు చేసి¾ ట్రయల్ రన్‌ను విజయవంతంగా నిర్వహించామన్నారు. వర్షాకాలంలో నీళ్లు రాగానే వెంకటాద్రి రిజర్వాయర్‌కు ఎత్తిపోతల ద్వారా నీటిని తరలిస్తామన్నారు. ఈ రిజర్వాయర్ సామర్థ్యం మొత్తం 16.74 టీఎంసీలు కాగా స్టాండర్డ్ ఆపరేషన్ సిస్టం ద్వారా విడతల వారీగా రిజర్వాయర్‌ను నింపుతారన్నారు. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా మొత్తం 12 లక్షల 30 వేల ఎకరాల ఆయకట్టుకు నీటిని అందించే ప్రతిపాదనలు ఉన్నాయన్నారు. అలాగే మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల ప్రజలకు తాగునీటికి, పరిశ్రమలకు కూడా నీళ్లు అందుతాయని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
వలసల కష్టాలు, ఆత్మహత్యల నష్టాలు మనకు తెలుసు 
– జడ్చర్ల బహిరంగ సభలో సీఎం రేవంత్
జడ్చర్ల : మీ పాలమూరు బిడ్డగా రెండు రోజులుగా జిల్లా రైతుల కోసం సాగునీsటి ప్రాజెక్టులను పరిశీలించానని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. జడ్చర్లలో శుక్రవారం సాయంత్రం జరిగిన ప్రజాపాలన-ప్రగతి బాట బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. పాలమూరులో ఊరు లేకపోయినా, పార్లమెంటులో నోరు లేకపోయినా ఇక్కడికి రాజకీయంగా వలస వచ్చిన కేసీఆర్‌ను ఇక్కడి ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారన్నారు. ఒక తల్లిగా ఇక ఏ తల్లికీ గుండె కోత ఉండొద్దని సోనియమ్మ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని, కేసీఆర్ మేకవన్నె పులి అని గుర్తించక ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణకు రెండుసార్లు ముఖ్యమంత్రిని చేస్తే పదేళ్లలో పాలమూరు జిల్లాలోని ఏ ఒక్క ప్రాజెక్టునూ ఆయన పూర్తి చేయలేదని విమర్శించారు. మన భూములకు సాగునీరు రాలేదు.. మన కష్టాలు తీరలేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. దొంగలకు సద్దులు మోసెటోళ్లు నిన్నమొన్న పాదయాత్ర చేస్తామని మాట్లాడుతున్నారని విమర్శించారు. పాదయాత్ర కాదు.. కాశీదాక పొర్లు దండాలు పెట్టినా మీరు చేసిన పాపాలు తొలగిపోవని ఎద్దేవా చేశారు. జడ్పీటీసీగా మీరు నాటిన ఈ మొక్క ముఖ్యమంత్రిగా వృక్షమై తిరిగి మీ ముందుకు వచ్చాడు.. పాలమూరులో గెలిపిస్తే పారిపోయి గజ్వేల్‌లో పోటీ చేసిన కేసీఆర్ పాలమూరు ద్రోహినా.. నేను పాలమూరు ద్రోహినా.. అని ప్రజలను అడిగారు. పాలమూరు జిల్లాలో 26 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు అందించాలనే సంకల్పంతో తాము పనిచేస్తుంటే మేం వస్తాం.. మేం నడుస్తామని కొందరు వస్తున్నారు.. పంచ కట్టుకుని ఊర్లకు వస్తే ఇక్కడి ప్రజలు ఉరికించి కొడతారు అని సీఎం అన్నారు. పదేళ్లలో కాళేశ్వరం కోసం లక్ష కోట్లు ఖర్చు చేసిన కేసీఆర్ ఉద్దండపూర్ మునిగితే రూ.800 కోట్లు ఇవ్వలేదని విమర్శించారు. ఇవ్వకపోగా నిర్వాసితులను జైల్లో పెట్టి కొట్టించాడు.. అందుకే మట్టికి పోయినా మనోడే పోవాలని పెద్దలు చెప్పారు.. మీ పాలమూరు బిడ్డగా జిల్లాలో ప్రాజెక్టుల కోసం ఈ 30 నెలల్లో రూ.8 వేల కోట్లు ఖర్చు చేశానని చెప్పారు. జైళ్లు కట్టాలని వాళ్లు అనుకుంటే స్కూళ్లు కట్టాలని మనం అనుకున్నాం.. ఏం చదవాలన్నా పాలమూరు జిల్లాకు వచ్చేలా కొడంగల్‌లో ఎడ్యుకేషన్ హబ్ నిర్మిస్తున్నామంటూ చదువొక్కటే మీ జీవితాల్లో వెలుగు నింపుతుంది అని చెప్పారు. పిల్లల్ని చదివించండి.. చదువుకుంటేనే బతుకులు బాగుపడతాయి అని ప్రజలకు సూచించారు. జిల్లాల్లో వలసలు ఆగాలన్నా, రైతులు సంతోషంగా ఉండాలన్నా పాలమూరు జిల్లా ప్రాజెక్టులు పూర్తి కావాలి అని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. హనుమాండ్ల గుడి లేని తండా, గూడెం లేదేమో కానీ ఇందిరమ్మ ఇల్లు లేని గూడేలు లేవని చెప్పారు. పాలమూరు ప్రజలు మట్టి తీసుడే కాదు.. మట్టితో కప్పడం కూడా తెలుసు.. కేసీఆర్ రాసిపెట్టుకో.. పాలమూరు జిల్లాల్లో మీ పార్టీని బొంద పెడతాం.. జిల్లాలో మీ పార్టీకి చెందిన వారిని ఒక్కరిని కూడా ఎమ్మెల్యేగా గెలవనీయం అని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి ఏం చేసిండని కొందరు అవాకులు చవాకులు పేలుతున్నారు.. 15 లక్షల రేషన్ కార్డులు అందించాం.. 4.50 లక్షల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశాం.. 50 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించాం.. రూ.10 వేల కోట్లు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి ఖర్చు చేశాం.. ఇలా మేం చేసింది చెప్పాలంటే రాస్తే రామాయణం.. చెబితే భారతం అవుతందని అన్నారు. మీ పదేళ్ల పాలనపై, మా రెండున్నరేళ్ల పాలనపై చర్చిద్దాం.. నీ పేరు కేసీఆర్ అయితే చర్చించేందుకు అసెంబ్లీకి రా.. మాది తప్పైతే నేను క్షమాపణ చెబుతా అని సీఎం రేవంత్ సవాల్ విసిరారు. గోదావరి జలాలపై చర్చిద్దామంటే మహారాష్ట్ర ముఖ్యమంత్రి దాగుడుమూతలాడుతున్నారని, బీజేపీ నాయకులు తప్పించుకు తిరుగుతున్నారరని విమర్శించారు. ఎన్నాళ్లు తప్పించుకు తిరుగుతారు.. ఎవరు దాగుడుమూతలాడినా, తప్పించుకు తిరిగినా.. అడుగుతాం.. కడుగుతాం.. తుమ్మిడిహెట్టి కట్టి తీరుతాం అని స్పష్టం చేశారు. మీరు బురద చల్లినా, తలకిందులుగా తపస్సు చేసినా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు 90 టీఎంసీలకు ఒప్పించే బాధ్యత నాది.. పాలమూరు జిల్లా ప్రాజెక్టులకు గ్రీన్ ఛానల్ ద్వారా నిధులు మంజూరు చేసే బాధ్యత నాది అని హామీ ఇచ్చారు. 2034 వరకు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీదే అధికారం.. 2029లో కాంగ్రెస్‌ను మళ్లీ అధికారంలోకి తీసుకొస్తాం అని రేవంత్ చెప్పారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





