– తమిళ సీఎం విజయ్ సంచలన నిర్ణయం
– రెండు వారాల్లోగా మూసేయాలంటూ ఆదేశాలు
– విజయ్ సోషల్ మీడియాకు పెరుగుతున్న ఆదరణ
చెన్నై, మే 12: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యా సంస్థలు, దేవాలయాలు, బస్తాండులకు 500 మీటర్ల దూరంలో ఉన్న 717 వైన్ షాపులన్నింటినీ మూసివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. తమిళనాడు రాష్ట్ర మార్కెటింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ దుకాణాలను రెండు వారాల్లోగా మూసివేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత విజయ్ జారీ చేసిన తొలి ఉత్తర్వు ఇది. ప్రస్తుతం రాష్ట్రంలో టాస్మాక్ 4,765 మద్యం దుకాణాలను నిర్వహిస్తోంది. వీటిలో 276 మద్యం దుకాణాలు ప్రార్థనా స్థలాలు, 186 విద్యా సంస్థలు 255 బస్టాండుల సమీపంలో ఉన్నాయి. వీటిని వెంటనే తొలగించాలని సీఎం ఆదేశించారు. కాగా, మద్యం అమ్మకాల ద్వారానే రాష్ట్రానికి భారీగా ఆదాయం సమకూరుతోంది. అయినప్పటికీ ప్రజా సంక్షేమం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. 2025లో మద్యం అమ్మకాల ద్వారా రాష్ట్రానికి రూ.48,000 కోట్ల ఆదాయం వచ్చినట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. ఇక తమిళనాట దళపతి విజయ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వయసుతో సంబంధం లేకుండా అన్ని వర్గాల్లో ఆయనను అభిమానించే వారు ఉన్నారు. తొలిసారి ముఖ్యమంత్రి హోదాలో అసెంబ్లీకి వెళ్లి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే తమిళనాడు సీఎంవో ఆఫీస్ సోషల్ మీడియా ఖాతాల డీపీలు మారాయి. ముఖ్యమంత్రి విజయ్ ఫొటోలను డీపీలుగా పెట్టారు. తర్వాత గంటల్లోనే మ్యాజిక్ జరిగింది. సోషల్ మీడియా ఖాతాలకు ఫాలోవర్స్ క్యూ కట్టారు. తమిళనాడు సీఎంవో ఇన్‌స్టాగ్రామ్ ఖాతాకు మొదట నాలుగు లక్షల ఫాలోవర్స్ ఉండేవారు. విజయ్ ఫొటో పెట్టిన తర్వాత ఆ సంఖ్య 16 లక్షలకు పెరిగింది. ఇక ‘ఎక్స’ ఖాతాకు కూడా నాలుగు లక్షల మంది ఫాలోవర్స్ ఉండేవారు. ఇప్పుడు 22 లక్షల మంది అయ్యారు.
సీఎంకు నటుడు విశాల్ అభినందన
ముఖ్యమంత్రి విజయ్ తీసుకున్న సాహసోపేత నిర్ణయంపై సినీ నటుడు విశాల్ ప్రశంసల వర్షం కురిపించారు. ప్రార్థనా మందిరాలు, విద్యాసంస్థలు, ముఖ్యంగా పాఠశాలల సమీపంలో ఉన్న 717 మద్యం దుకాణాలను మూసివేస్తున్నట్లు సీఎం విజయ్ ప్రకటించడంపై నటుడు విశాల్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఈ నిర్ణయం ఎంతోమంది విద్యార్థినులకు, సామాన్య ప్రజలకు పెద్ద ఊరటనిస్తుందని కొనియాడారు. అలాగే ఒక ఘటనను ప్రస్తావిస్తూ ‘ఆర్.కె.నగర్‌లో నేను కలిసిన ఒక విద్యార్థిని ప్రతిరోజూ స్కూల్ నుంచి ఇంటికి వెళ్లేటప్పుడు మద్యం షాపుల దగ్గర ఎదురయ్యే వేధింపుల గురించి, ఆ ఒత్తిడి గురించి ఫిర్యాదు చేసింది. ఆ అమ్మాయి లాంటి ఎంతోమంది విద్యార్థినులు, సామాన్యులు నేడు సీఎం నిర్ణయంతో ఎంతో సంతోషంగా ఉన్నారు. వారి ముఖాల్లో మీరు చిరునవ్వు నింపారు’ అని విశాల్ పేర్కొన్నారు. పాఠశాలల సమీపంలో మద్యం షాపులను తొలగించడం వల్ల సమాజంలో ఒక పెద్ద సమస్య తొలగిపోతుందని, సీఎం విజయ్, ఆయన ప్రభుత్వాన్ని తాను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని అన్నారు..
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





