భవిష్యత్ పాలనలో ఏఐ విప్లవం

– ప్రభుత్వ అధికారులకు ప్రత్యేక శిక్షణ
– డిజిటల్ గవర్నెన్స్‌లో ఆదర్శంగా నిల‌వ‌నున్న‌ తెలంగాణ

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 12 : మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతికతను అందిపుచ్చుకుంటూ భవిష్యత్ సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. పాలనా సంస్కరణల్లో భాగంగా ప్రభుత్వ సేవలను మరింత వేగవంతంగా, పారదర్శకంగా ప్రజలకు చేరవేసే లక్ష్యంతో అత్యాధునిక కృత్రిమ మేధస్సు(ఏఐ) సాంకేతికతను ప్రభుత్వ యంత్రాంగంలోకి ప్రవేశపెట్టేందుకు శ్రీకారం చుట్టింది. రేపటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని నేడే బలమైన పునాదులు వేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క దూరదృష్టితో, ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో ‘టీజీ మ్యాథ్‌’ భాగస్వామ్యంతో ప్రభుత్వ శాఖల అధికారులు, ఉద్యోగులకు ‘ఏఐ అప్‌స్కిల్లింగ’ ‘కెపాసిటీ బిల్డింగ్‌’ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ శిక్షణ కార్యక్రమాల ద్వారా అధికారులకు ప్రాక్టికల్ ఏఐ, జనరేటివ్ ఏఐ అంశాలపై ప్రత్యక్ష శిక్షణతోపాటు సమగ్ర అవగాహన కల్పించనున్నారు. తద్వారా ప్రభుత్వ సేవలను డిజిటల్ గవర్నెన్స్ ద్వారా మరింత మెరుగ్గా ప్రజలకు అందించడమేకాక పరిపాలనలో ఏఐని గేమ్ ఛేంజర్‌గా మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది. భారత ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం, తెలంగాణ ప్రభుత్వం సంయుక్తంగా ఏర్పాటు చేసిన ప్రతిష్ఠాత్మక సంస్థే ఈ ‘టీజీ మ్యాథ’. ఇది దేశంలోని ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా గుర్తింపు పొందింది. ప్రణాళిక శాఖతో కలిసి పనిచేస్తున్న ఈ సంస్థ రాష్ట్రంలో ఏఐ ఆవిష్కరణలను ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఇప్పటికే 180కిపైగా ఏఐ స్టార్టప్‌లకు అండగా నిలుస్తూ వినూత్న ఆలోచనలను ఆర్థిక వ్యవస్థకు, సామాజిక ప్రయోజనాలకు ఉపయోగపడేలా తీర్చిదిద్దుతోంది. పరిశ్రమలతో భాగస్వామ్యాన్ని విస్తరించడం, బాధ్యతాయుతమైన ఏఐ వినియోగాన్ని ప్రోత్సహించడం ‘టీజీ మ్యాథ’ ప్రధాన లక్ష్యాలు. ఏఐ రంగంలో తెలంగాణను దేశంలోనే ముందంజలో ఉంచడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ శిక్షణ కార్యక్రమం కేవలం నైపుణ్యాల పెంపుకే పరిమితం కాకుండా డిజిటల్ గవర్నెన్స్‌లో దేశానికే తెలంగాణను ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దే దిశగా మరో కీలక అడుగుగా నిలుస్తుందని ప్రభుత్వం విశ్వసిస్తోంది. ఈ ప్రయత్నాలు భవిష్యత్ పాలనలో ఏఐ వినియోగాన్ని మరింత విస్తరించి ప్రజలకు మెరుగైన ఫలితాలను అందిస్తాయని ఆశిస్తోంది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *