రైతులను గాలికి వదిలేసిన ప్రభుత్వం

– ధాన్యం కొనుగోళ్లలో ఘోర వైఫల్యం
– 40 రోజులుగా కొనుగోలు కేంద్రాల్లో రైతుల పడిగాపులు
– లారీల, సంచుల సమస్యలతో అవస్థలు
– రైస్ మిల్లులు ధాన్యం దించుకోవడం లేదు
– దిల్లీ చుట్టూ తిరగడం మానేసి రైతుల కష్టాలు చూడాలి
– సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు విమర్శలు

సిద్దిపేట, ప్రజాతంత్ర, మే 12: కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలులో విఫలమైందని, రైతుల కష్టాలను గాలికి వదిలేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాలయాపన చేస్తున్నారని సిద్దిపేట శాసనసభ్యుడు తన్నీరు హరీష్ రావు విమర్శించారు. సిద్దిపేట రూరల్ మండలంలోని బండచెర్లపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం పంట కొనుగోళ్ల విషయంలో పూర్తిగా విఫలమైందని తీవ్రస్థాయిలో విమర్శించారు. ముఖ్యమంత్రి, మంత్రులు వెంటనే కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతుల కష్టాలు తెలుసుకోవాలని డిమాండ్ చేశారు. మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, శనగలు విక్రయించిన రైతులకు ఇప్పటివరకు ప్రభుత్వం నుండి రూపాయి కూడా చెల్లింపులు అందలేదన్నారు. మార్కెట్లలో ఇంకా సగానికిపైగా పంట నిల్వలు పేరుకుపోయి ఉండగా రైతులు 40 రోజులుగా ఎదురు చూస్తున్నారని తెలిపారు. వరి ధాన్యం తరలింపులో లారీల కొరత తీవ్రంగా ఉందంటూ ఆర్టీఏ అధికారులు, వెహికల్ ఇన్‌స్పెక్టర్లు, పోలీసులను రంగంలోకి దించి రోడ్లపై వెళ్లే ఖాళీ వాహనాలను మళ్లించి వెంటనే ధాన్యం తరలించే చర్యలు చేపట్టాలని కోరారు. కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు వెళ్లిన లోడ్లను దించుకోవడం లేదని, దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా అస్తవ్యస్త పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. ప్రభుత్వం రైస్ మిల్ అసోసియేషన్లతో చర్చించి సమస్యను పరిష్కరించాలని సూచించారు. ప్రతీ మిల్లు వద్ద ఒక సివిల్ సప్లై లేదా రెవెన్యూ అధికారిని నియమించి పర్యవేక్షణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం సమస్యలను పరిష్కరించడం మానేసి ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టడం వంటి చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. వర్షాలు పడకముందే యుద్ధప్రాతిపదికన ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలన్నారు. తాము అధికారంలో ఉన్న సమయంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో అధికారులతో సమీక్షలు నిర్వహించి సమస్యలు లేకుండా చర్యలు తీసుకున్నామని ఆయన గుర్తు చేశారు. ఎరువులు, విద్యుత్, సాగునీరు సమస్యలతోపాటు పంటను అమ్ముకోవడంలో కూడా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. మార్చి 22న సిద్దిపేట సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుబంధు నిధులు 45 రోజుల్లో పూర్తిగా చెల్లిస్తామని హామీ ఇచ్చారని, అయితే 52 రోజులు గడిచినా రైతులకు ఆ నిధులు అందలేదని విమర్శించారు. సిద్దిపేట మార్కెట్ యార్డులో మొక్కజొన్న రైతులు సంచుల కోసం ఇబ్బందులు పడుతున్నారని, అధికారులు సంచులు అందించకపోవడంతో రైతులు బయట కొనుగోలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. రాష్ట్రంలోని సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నం చేయడం లేదని, ముఖ్యమంత్రి, మంత్రులకు ప్రజల సమస్యల పట్ల కనీస పట్టింపు కూడా లేదని విమర్శించారు. సమస్యలను లోతుగా అర్థం చేసుకుని వాటి పరిష్కారానికి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ చుట్టూ తిరగడం మానేసి సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని, రైతుల కష్టాలను చూడాలని, వెంటనే ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని హరీష్‌రావు డిమాండ్ చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *