– ఫోన్ ట్యాపింగ్‌పై అసత్య ఆరోపణలు
– బేషరతుగా క్షమాపణ చెప్పాలి
– బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.ఆర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 17: ఫోన్ ట్యాపింగ్ పేరిట పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆరోపణలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయనకు లీగల్ నోటీసులు పంపించారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి హామీలు అమలు చేయడం చేతకాని కాంగ్రెస్ సర్కారు తన చేతకానితనాన్ని కప్పిపుచ్చేందుకు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చి రాద్ధాంతం చేస్తోందని దుయ్యబట్టారు. ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా తమపై, తమ పార్టీ నేతలపై ఇంతటి దిగజారుడు వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. వెంటనే బేషరతుగా మహేష్ కుమార్ గౌడ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. చట్టాలను గౌరవించే వ్యక్తులుగా అక్రమంగా పెట్టిన కేసు విచారణకు సైతం హాజరై సహకరించామని తెలిపారు. అడ్డగోలుగా మాట్లాడితే బీఆర్ఎస్ శ్రేణులు కూడా చూస్తూ ఊరుకోబోరని తెలిపారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అత్యంత అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ నేతలకు ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదని తేల్చిచెప్పారు. స్థానిక ఎన్నికల్లో ప్రజల్ని తప్పుదోవ పట్టించాలనే దురుద్దేశంతోనే మరోసారి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారు తప్ప, ఈ లొట్టపీసు కేసుతో ఒరిగేదేమీ లేదన్నారు. ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్ అబద్ధాలు చెప్పడంలో పోటీపడుతున్నట్టు కనిపిస్తోందని, రాష్ట్రాన్ని నడిపించే సత్తా, సామర్థ్యం లేకపోవడంతోనే ఇలాంటి డైవర్షన్ కుట్రలతో కాలం వెళ్లదీసే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం రాజకీయంగా పబ్బం గడుపుకునేందుకు చేసే ఇలాంటి దుర్మార్గపూరిత వ్యాఖ్యల పైన మహేష్ కుమార్ గౌడ్ లాంటి నాయకులను కోర్టులకు ఈడుస్తామని కేటీఆర్ హెచ్చరించారు. ఇప్పటికైనా పరిపాలన పైన దృష్టి పెట్టి, అటెన్షన్ డ్రైవరేషన్ డ్రామాలను పక్కన ప్రతిపక్ష నాయకుల పైన ప్రాపగాండా చేయడం మానాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ప్రజలకు మంచి చేసే అంశాల పైన దృష్టి సారించాలని హితవు పలికారు.