టూరిజం ప్లాజాలో మంత్రి జూపల్లి ఆకస్మిక తనిఖీలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 17: టూరిజం ప్లాజా హోటల్స్‌లో పరిశుభ్రత పాటించాలని, ఆహారంలో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా ఉండాలని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. బేగంపేటలోని టూరిజం ప్లాజా హోటల్‌లో మంగళవారం ఉదయం ఆయన ఆకస్మిక తనిఖీలు చేశారు. రెస్టారెంట్ అంతా కలియతిరిగి ఆహార పదార్థాలను, కిచెన్‌ను పరిశీలించారు. అల్ఫాహారం చేస్తున్న పర్యాటకులు, అతిథులతో మంత్రి మాట్లాడి ఆహార నాణ్యత, రుచి గురించి ఆరా తీశారు. అనంతరం మంత్రి జూపల్లి మాట్లాడుతూ హరిత హోటల్స్‌లో సౌకర్యాలు, ఆహార నాణ్యతపై నిరంతరం పరిశీలన కొనసాగిస్తామన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పర్యాటకులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాల్సిన బాధ్యత హోటల్స్ నిర్వాహకులపై ఉందని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆదాయం పెంచడంతోపాటు పర్యాటకులు, అతిథుల కోసం మెరుగైన సౌకర్యాలు, వసతుల కల్పనపై ప్రధానంగా దృష్టి పెడుతున్నామన్నారు. ఆహ్లాదకరమైన వాతారణం ఉండేలా హరిత హోటల్స్‌ను తీర్చిదిద్దుతామని మంత్రి చెప్పారు.