నిరుద్యోగుల‌పై లాఠీఛార్జ్ అమానుషం

– 20వేల పోలీసు పోస్టులు భ‌ర్తీ చేయాల్సిందే
– విద్యార్థులు, జేఏసీ నేత‌ల అక్ర‌మ అరెస్టులను ఖండిస్తున్నాం
– అరెస్టు చేసిన‌ వారిని బేష‌ర‌తుగా విడుద‌ల చేయాలి
– బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 16: దిల్‌సుఖ్‌నగర్ లో తమ న్యాయమైన డిమాండ్ల కోసం, ఉద్యోగాల భర్తీ కోసం శాంతియుతంగా ఆందోళన చేస్తున్న నిరుద్యోగ యువతపై, పోలీస్ అభ్యర్థులపై ప్రభుత్వం పోలీసులను ప్రయోగించి లాఠీఛార్జి చేయించడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలుపుతున్న అభ్యర్థులను వీధుల వెంట వెంటాడటం, అక్రమంగా అరెస్టు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ అహంకారానికి, నిరంకుశత్వానికి నిదర్శనమని మండిపడ్డారు. విద్యార్థులను నిరుద్యోగులను పోలీసులతో అణగదొక్కడమే కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన ఇందిరమ్మ ప్రజా పాలననా అని కేటీఆర్ ప్రశ్నించారు. ఇప్పటికే హైదరాబాద్ తోపాటు అన్ని యూనివర్సిటీల్లో విద్యార్థులు ఉద్యోగుల భర్తీ కోసం నోటిఫికేషన్లు జారీ చేయాలని అనేక రోజులుగా పలు రకాల నిరసన కార్యక్రమాలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఎన్నికల ముందు ఒకే ఏడాది రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, ‘మెగా నోటిఫికేషన్లు’, ‘జాబ్ క్యాలెండర్’ అంటూ కోతలు కోసి, నిరుద్యోగ యువతను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, నేడు నిరుద్యోగుల నోట్లో మట్టి కొడుతోందని కేటీఆర్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో 20 వేలకి పైగా పోలీస్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నప్పటికీ కేవలం 5 వేల పోస్టులతో చేతులు దులుపుకోవాలని చూడటం అన్యాయమన్నారు. సుదీర్ఘకాలంగా కోచింగ్ సెంటర్లలో శిక్షణ తీసుకుంటూ ఆర్థిక ఇబ్బందులు పడుతున్న అభ్యర్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నట్టు వెంటనే 20వేల‌ కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేస్తూ మెగా నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దిల్‌సుఖ్‌నగర్‌లో హక్కుల కోసం పోరాడిన నిరుద్యోగ జేఏసీ నేతలను, విద్యార్థులను అక్రమంగా అరెస్ట్ చేసి పలు పోలీస్ స్టేషన్లకు తరలించడాన్ని కేటీఆర్ తప్పుపట్టారు. అరెస్టయిన వారిని బేషరతుగా తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లాఠీలతో నిరుద్యోగుల గొంతు నొక్కాలని చూస్తే ఈ ప్రభుత్వానికి కాలం దగ్గరపడినట్టేనని హెచ్చరించారు. నిరుద్యోగుల ఆవేదనను, వారి న్యాయమైన డిమాండ్లను లాఠీలతో అణచివేయలేరని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా తన మొండివైఖరి వీడి, 20 వేల కానిస్టేబుల్ పోస్టుల భర్తీ, వయోపరిమితి సడలింపు వంటి నిరుద్యోగుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చకపోతే నిరుద్యోగ, విద్యార్థి సమాజానికి అండగా బిఆర్ఎస్ ఉంటుందన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *