– సమగ్ర కార్యాచరణకు అధికారులతో ప్రత్యేక కమిటీ
– రైతు వేదికల్లో విత్తనాలు, ఎరువుల పంపిణీ
– ఎరువుల కోసం కేంద్రంపై ఎప్పటికప్పుడు ఒత్తిడి
– ఎంపీలతో కలిసి కేంద్రం వద్దకు మంత్రుల బృందం
– వ్యవసాయ శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 16 : రైతులకు విత్తనాల సరఫరా నుంచి పండించిన పంట ఉత్పత్తుల కొనుగోళ్ల వరకు సమగ్ర ప్రణాళికతోపాటు నిర్దిష్ట కార్యాచరణ అమలు చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి అదేశించారు. పంట వేసినప్పటి నుంచే రైతుల వివరాల నమోదు, పంటల వివరాల రికార్డులు, దిగుబడి అంచనాలు, ధాన్యం కొనుగోళ్ల వరకు ప్రతీ దశలో వ్యవసాయ శాఖకు పూర్తి అవగాహన ఉండాలని ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డి బోధి పెవిలియన్‌లో వ్యవసాయ శాఖపై మంగళవారం నిర్వహించిన సమీక్షలో స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోళ్లలో ఇప్పటివరకు ఉన్న అనుభవాలు, రైతులు ఇబ్బంది పడకుండా చేపట్టాల్సిన చర్యలపై రైతు కమిషన్, అగ్రికల్చర్ యూనివర్సిటీ, వ్యవసాయ నిపుణులు ఇచ్చిన సలహాలు, సూచనలను సమీక్ష సమావేశంలో చర్చించారు. రైతులు ఎక్కడా ఇబ్బందిపడకుండా వచ్చే సీజన్ నుంచే కొనుగోళ్లు సాఫీగా జరిగేలా ఇప్పుడే ఉన్నతాధికారుల కమిటీని ఏర్పాటు చేయాలని అదేశించారు. వ్యవసాయ శాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో పనిచేసే ఈ కమిటీలో వ్యవసాయ శాఖ డైరెక్టర్, సివిల్ సప్లయిస్ మేనేజింగ్ డైరెక్టర్, ప్లానింగ్ విభాగం కార్యదర్శి సభ్యులుగా ఉంటారు. విత్తనాల పంపిణీ మొదలు పంట వేసినప్పటినుంచే అన్ని గ్రామాల్లో రైతుల వివరాల నమోదు, పంటల వివరాల రికార్డులు, పంట ఉత్పత్తుల అంచనాలు, ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యే వరకు వివిధ దశల్లో చేపట్టాల్సిన చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఈ కమిటీ ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంది. క్షేత్రస్థాయిలో పర్యవేక్షించడంతో పాటు ఈ ప్రక్రియకు అవసరమైన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని(ఏఐ) సమకూర్చుకుంటుంది. ఏ రైతు ఏ పంట వేశాడు.. ఏ గ్రామంలో ఏయే పంటలు ఎంత విస్తీర్ణంలో ఉన్నాయనే వివరాలు కచ్చితంగా క్షేత్రస్థాయి పరిశీలనతో నమోదు చేయాలని సీఎం చెప్పారు. కనీస మద్దతు ధరలు, కేంద్రం నిర్దేశించిన కోటాలను అనుసరించి రాష్ట్రంలో పంట ఉత్పత్తుల కొనుగోళ్లు సాఫీగా జరిగేలా అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్ల సమయంలో అకాల వర్షాలు, తూకం, రవాణా, నిల్వ, మార్కెటింగ్ వంటి అంశాలపై ముందుగానే కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు. సీడ్స్ నుంచి కొనుగోలు వరకు వ్యవసాయ శాఖ ,సివిల్ సప్లయిస్, అగ్రికల్చర్ యూనివర్సిటీ సమన్వయంతో పనిచేయాలన్నారు.
ఏడు రకాల సన్న వడ్ల విత్తనాలను అందుబాటులో ఉంచాలి
సన్న వడ్లు పండించే రైతులకు బోనస్ ఇస్తున్న నేపథ్యంలో ఏడు రకాల సన్న వడ్ల విత్తనాలను అందుబాటులో ఉంచాలని, వీటిని సబ్సిడీపై రైతులకు ఇవ్వాలని సీఎం ఆదేశించారు. రైతు వేదికల్లోనే సన్న వడ్ల విత్తనాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సన్న వడ్లు పండించే రైతుల పూర్తి డేటా సేకరించాలని, ధాన్యం దిగుబడిపై వ్యవసాయ శాఖకు సంపూర్ణ అవగాహన ఉండాలని స్పష్టం చేశారు. రైతు వేదికలను ఇకపై రైతులకు ఉపయోగపడే కేంద్రాలుగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రైతులు అక్కడే తమ వివరాలు నమోదు చేసుకుని విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసేలా అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ప్రతీ రైతు వేదిక వద్ద వ్యవసాయ శాఖతోపాటు రెవెన్యూ, పోలీస్ విభాగాల నుంచి ఒక్కో అధికారి అందుబాటులో ఉండాలని సూచించారు. జిల్లాల్లో వీటి నిర్వహణ, పర్యవేక్షణ బాధ్యతలను అదనపు కలెక్టర్లకు అప్పగించాలని ఆదేశించారు. వ్యవసాయ శాఖలో సాంకేతికత వినియోగాన్ని మరింత పెంచుకోవాలని సీఎం సూచించారు. ఏఐ ఆధారిత విధానాలను సమర్థంగా వినియోగించాలని చెప్పారు. అగ్రికల్చర్ యూనివర్సిటీని నోడల్ ఏజెన్సీగా పెట్టుకుని విత్తనాల నుంచి కొనుగోళ్ల వరకు మొత్తం వ్యవస్థలో సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసంధానం చేయాలని ఆదేశించారు. వ్యవసాయ శాఖ, సివిల్ సప్లయిస్, అగ్రికల్చర్ యూనివర్సిటీ సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. భద్రాద్రి కొత్తగూడం జిల్లా దమ్మపేట మండలంలో ప్రారంభించిన ఏఐ పైలట్ ప్రాజెక్టు ఫలితాను అధ్యయనం చేయాలని, రైతులకు ఉపయోగంగా ఉంటే మరింత విస్తృతంగా వినియోగించుకోవాలని అన్నారు. ఎరువుల పంపిణీలో పారదర్శకత, వేగం పెంచేందుకు అన్ని రకాల ఎరువులను యాప్ ద్వారా బుక్ చేసే విధానం తీసుకురావాలని సీఎం ఆదేశించారు. యాప్ ద్వారా రైతులు బుక్ చేసుకున్న యూరియాను రైతు వేదికల ద్వారా పంపిణీ చేయాలని సూచించారు. యూరియా పంపిణీ బాధ్యతను జిల్లా అదనపు కలెక్టర్లకు అప్పగించాలని చెప్పారు. ఖరీఫ్ సీజన్‌కు అవసరమైన యూరియా, ఇతర ఎరువుల కేటాయింపులపై ఎప్పటికప్పుడు కేంద్రానికి లేఖలు రాయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ముఖ్యమంత్రి సూచించారు. రామగుండం ఎరువుల కర్మాగారంలో ఉత్పత్తి అయ్యే ఎరువులు అత్యధికంగా తెలంగాణకే కేటాయించేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎరువుల పరిస్థితిపై అన్ని పార్టీల ఎంపీలతో సమావేశం నిర్వహించి వాస్తవ పరిస్థితిని వివరించాలని సూచించారు. అవసరమైతే మంత్రులు, ఎంపీల బృందం దిల్లీకి వెళ్లి కేంద్రానికి విజ్ఞప్తి చేయాలన్నారు. మార్క్‌ఫెడ్ నష్టాలను తగ్గించే దిశగా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. వ్యాపారులకు తలొగ్గకుండా ఈసారి ప్రభుత్వం వ్యూహత్మకంగా వ్యవహరించిన కారణంగా మొక్కజొన్న కొనుగోళ్లతో వచ్చే నష్టం తగ్గించగలిగామని సీఎం వివరించారు. గతంలో రూ.13 వేలకు టన్ను అమ్మిన పరిస్థితి ఉందని, ఈసారి రూ.21 వేలకు పైగా టెండర్ రేట్ వచ్చిందని చెప్పారు. ఆయిల్‌ఫెడ్‌ను మరింత బలోపేతం చేసి లాభాలబాట నడిపించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ డెయిరీని మరింత బలోపేతం చేయాలని, పాల రైతులకు సకాలంలో చెల్లింపులు జరపాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎంవో ముఖ్య కార్యదర్శి శేషాద్రి, వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్, పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి, ప్రణాళిక శాఖ కార్యదర్శి గౌరవ్ ఉప్పల్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





