విద్యా విప్లవానికి ఆరుట్లతో శ్రీకారం

– తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను నేడు ప్రారంభించనున్న సీఎం
– అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రభుత్వ విద్య
– విద్యార్థులకు విద్య, రవాణా, పోషకాహారం
– నర్సరీ నుంచి ఇంటర్ వరకు ఒకే క్యాంపస్

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 16 : రాష్ట్రంలో ప్రభుత్వ విద్యకు దిశ దశ మార్చేలా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. విద్యా సంస్కరణలు చేపట్టిన ప్రజా ప్రభుత్వం తెలంగాణ పబ్లిక్ స్కూల్స్(టీపీఎస్)కు నాంది పలికింది. తన డ్రీమ్ ప్రాజెక్టుగా రూపుదిద్దుకున్న టీపీఎస్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరుట్లలో ఈనెల 17న ప్రారంభించనున్నారు. కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా అత్యాధునిక వసతులతో రూపొందిన టీపీఎస్ విద్యా రంగంలో నూతన విప్లవానికి శ్రీకారం చుట్టనుంది. ఉదయం 9:30 గంటలకు ఆరుట్లకు చేరుకుని పబ్లిక్ స్కూల్ పైలాన్‌ను సీఎం ఆవిష్కరిస్తారు. అనంతరం పాఠశాలలోని డిజిటల్ క్లాస్‌రూమ్స్, లైబ్రరీ, సైన్స్ ల్యాబ్స్, డైనింగ్ హాల్, క్రీడా మైదానాలను పరిశీలిస్తారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, స్కూల్ కమిటీ సభ్యులతో ప్రత్యేకంగా సమావేశమై వారి అభిప్రాయాలను తెలుసుకుంటారు. విద్యార్థులతో కలిసి బ్రేక్‌ఫాస్ట్ చేస్తారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

కార్పొరేట్‌కు దీటుగా తెలంగాణ పబ్లిక్ స్కూల్ 

కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ విద్యను అందుబాటులో ఉంచాలనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి దేశంలో ఎక్కడా లేని విధంగా విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేసి విద్యారంగ బలోపేతానికి సూచనలు తీసుకున్నారు. ఇందులో భాగంగా విద్యా కమిషన్ చైర్మన్ డాక్టర్ ఆకునూరి మురళి, సభ్యులు పీఎల్ విశ్వేశ్వర్ రావు, డాక్టర్ చారకొండ వెంకటేష్, జోష్నా శివారెడ్డిల ప్రత్యేక పర్యవేక్షణలో ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్ రూపుదిద్దుకుంది. ఇక్కడ నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్య అందించనున్నారు. అంతేకాక విద్యతోపాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, వ్యక్తిత్వ వికాసానికి సమాన ప్రాధాన్యం కల్పిస్తున్నారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్‌లో విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం, ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, సాయంత్రం స్నాక్స్ అందించనున్నారు. ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన జరగనుంది. ఆధునిక బోధనా పద్ధతులు, సాంకేతిక సదుపాయాలతో ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో విశ్వాసాన్ని మరింత పెంచేలా తెలంగాణ విద్యకు రోల్ మోడల్‌గా తెలంగాణ పబ్లిక్ స్కూల్ రూపుదిద్దుకుంది. పైలట్ ప్రాజెక్టుగా ప్రభుత్వం నాలుగు పాఠశాలలను ఎంపిక చేసింది. మొదటి విడతలో రంగారెడ్డి జిల్లాలోని ఆరుట్ల, మంచాల పాఠశాలలతోపాటు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని వంగూరు, పోల్కంపల్లి పాఠశాలలను ఎంపిక చేసింది. టీపీఎస్ కాన్సెప్ట్‌ను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేందుకు ప్రజా ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. దశలవారీగా వంద టీపీఎస్‌లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ఆరుట్ల టీపీఎస్ అదుర్స్   

ఆరుట్ల టీపీఎస్‌లో ఆధునిక వసతులు, డిజిటల్ క్లాస్‌రూమ్స్, విద్యార్థులకు విశాలమైన ప్లేగ్రౌండ్స్, ల్యాబ్స్, గాలి-వెలుతురు పుష్కలంగా ఉండే తరగతి గదులు, లైబ్రరీ, జిమ్, డైనింగ్ హాల్స్‌తోపాటు క్రికెట్, ఫుట్‌బాల్, వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, టెన్నిస్, క్యారమ్స్ వంటి ప్రతి క్రీడకు సంబంధించిన మైదానాలు ఏర్పాటు చేశారు. ఆయా క్రీడలకు ప్రత్యేక శిక్షకులను కూడా అందుబాటులో ఉంచారు. ఆరుట్ల చుట్టుపక్కల గ్రామాల నుంచి విద్యార్థులను పాఠశాలకు తీసుకురావడానికి ప్రభుత్వం ఐదు స్కూల్ బస్సులను ఏర్పాటు చేసింది. దీంతో తెలంగాణ పబ్లిక్ స్కూల్‌లో తమ పిల్లలను చేర్పించేందుకు తల్లిదండ్రులు క్యూ కడుతున్నారు. ప్రైవేట్ స్కూళ్లలో చదువుతున్న పిల్లలను సైతం టీపీఎస్‌లో చేర్పించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం ఈ స్కూల్‌లో మొత్తం 1,814 మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రీ-ప్రైమరీ విభాగంలో 150మంది, ప్రైమరీలో 600మంది, హైస్కూల్ రెండు బ్లాకుల్లో కలిపి 800మంది, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 160మంది, రెండో సంవత్సరంలో 104మంది విద్యార్థులు ఉన్నారు. తల్లిదండ్రుల నుంచి పెరుగుతున్న డిమాండ్‌ను తట్టుకోలేక నో అడ్మిషన్ బోర్డు పెట్టాల్సిన పరిస్థితి టీపీఎస్‌లో నెలకొంది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *