– సుప్రీంకోర్టు తీర్పుతో సుంకాల తిరిగి చెల్లింపు
వాషింగ్టన్, ఏప్రిల్ 20: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన సుంకాలు చెల్లుబాటు కావంటూ అక్కడి సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించిన నేపథ్యంలో సుంకాల తిరిగి చెల్లింపు పక్రియ ప్రారంభమైంది. అమెరికా కస్టమ్స్ బోర్డర్ ప్రొటెక్షన్ ఇందుకోసం ఆన్‌లైన్ సిస్టమ్‌ను తీసుకొచ్చింది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 8 గంటల నుంచి దిగుమతిదారులు, వారి బ్రోకర్లు క్లెయిమ్‌లను సబ్మిట్ చేయొచ్చు. అమెరికా చరిత్రలో ఇది అతిపెద్ద రిఫండ్ పక్రియగా నిలవనుంది. గతేడాది ట్రంప్ వివిధ దేశాలపై ఎడాపెడా సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. అయితే, 1977 నాటి అత్యవసర అధికారాల చట్టం కింద ట్రంప్ ఈ సుంకాలను విధించడం రాజ్యాంగ విరుద్ధమని ఈ ఏడాది ఫిబ్రవరి 20న సుప్రీంకోర్టు 6-3 మెజారిటీతో తీర్పునిచ్చింది. పన్నులు విధించే అధికారం కాంగ్రెస్‌కు మాత్రమే ఉంటుందని స్పష్టం చేసింది. సుంకాలు చెల్లుబాటు కాకపోవడంతో ఆ మొత్తం రిఫండ్ చేయాలని కోర్టు ఆదేశించింది. ఈ సుంకాలను చెల్లించిన వ్యాపార సంస్థలు, దిగుమతిదారులు ఈ రిఫండ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ట్రంప్ వెలువరించిన ఉత్తర్వుల అనంతరం 3.30 లక్షల మంది దిగుమతిదారులు దాదాపు 166 బిలియన్ డాలర్లను సుంకాల రూపంలో చెల్లించారు. ఇందులో 56,497 మంది దిగుమతిదారులు రిజిస్టేష్రన్ చేసుకున్నారు. వారికి వడ్డీతో కలిపి సుమారు 127 బిలియన్ డాలర్లు ప్రస్తుతం వాపసు ఇవ్వడానికి ట్రంప్ సర్కారు సిద్ధమవుతోంది. క్లెయిమ్ ఆమోదం పొందిన తర్వాత 60 నుంచి 90 రోజుల్లో డబ్బు తిరిగి రానుంది. ఇటీవల చెల్లించిన సుంకాలను ముందుగా వాపస్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంటే తొలుత చెల్లించిన వారికి ఆలస్యం కానుంది. దిగుమతిదారులు తాము పొందిన రిఫండ్‌ను వినియోగదారులకు పంచాల్సిన అవసరం లేదు. అయితే, ఫెడఎక్స్ వంటి కొన్ని సంస్థలు మాత్రం తమ కస్టమర్లకు ఈ ప్రయోజనాన్ని బదిలీ చేస్తామని వెల్లడించడం గమనార్హం.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



