– 25 టన్నుల కల్తీ మసాలా దినుసులు స్వాధీనం
– 13 మసాలా వ్యాపార సంస్థల్లో సోదాలు
– కల్తీ మసాలాలతో క్యాన్సర్ వంటి ప్రమాదాలు
– ఇప్పటికే ముగ్గురు నిందితుల అరెస్ట్
– నగర పోలీస్ కమిషనర్ సజ్జన్నార్ వెల్లడి
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 4: ఆహార కల్తీకి పాల్పడుతున్న వారిపై ఉక్కుపాదం మోపుతున్న హెచ్-ఫాస్ట్ అధికారులు భారీ ఆపరేషన్ నిర్వహించి పెద్ద ఎత్తున మసాలా దినుసులు స్వాధీనం చేసుకున్నారు. నగరంలో పలుచోట్ల తనిఖీలు చేపట్టి 25 టన్నుల కల్తీ మసాలా దినుసులు స్వాధీనం చేసుకున్నట్టు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు. 13 మసాలా వ్యాపార సంస్థల్లో సోదాలు నిర్వహించి 25.3 టన్నుల కల్తీ మసాలా దినుసులు, 89.15 టన్నుల ముడిపదార్థాలను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. మూడు క్రిమినల్ కేసుల్లో ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్టు చెప్పారు. సింథటిక్ రంగులు, క్లాత్ డైలు, టాల్కమ్ పౌడర్లు, ఇండస్ట్రియల్ కలర్స్, రైస్ బ్రాన్ అయిల్ నకిలీ మసాలాల్లో వినియోగించినట్టు గుర్తించామన్నారు. కల్తీ మసాలాల వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదముందని హెచ్చరించారు. కల్తీ ఆహార పదార్థాల కేసులపై త్వరలో ప్రత్యేక ‘సిట్’ ఏర్పాటు చేస్తామని సజ్జనార్ తెలిపారు. కల్తీ మసాలా తయారీ ముఠా కేసులో హైదరాబాద్ పోలీసులు ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రమాదకర రసాయనాలతో టన్నులకొద్దీ మసాలా దినుసులను తెలుగు రాష్ట్రాలకు ఈ ముఠా సరఫరా చేస్తోందని తెలిపారు. ప్రజల సమాచారం ఆధారంగా ప్రత్యేక డ్రైవ్ చేపట్టామని చెప్పారు. మైలార్‌దేవ్‌పల్లి, బాలాపూర్ పోలీస్ స్టేషన్లలో మూడు కేసులు నమోదు అయ్యాయని వెల్లడించారు. వాము, జీలకర్ర, లవంగం, షాజీరా, ఆవాలు సహా పలు మసాలాల్లో కల్తీ చేసినట్లు గుర్తించామని తెలిపారు. మసాలాలకు మెరుపు కోసం హానికర రసాయనాలను వినియోగిస్తున్నారని, రంగులు వేసి నాణ్యమైన మసాలాల మాదిరిగా విక్రయిస్తున్నారని వివరించారు. ఆహార భద్రత చట్టం కింద కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కల్తీ మసాలాల నమూనాలను ల్యాబ్ పరీక్షలకు పంపామని వెల్లడించారు. కల్తీ ఆహారం వల్ల కాలేయం, మూత్రపిండాలకు ముప్పు పొంచి ఉందని సీపీ సజ్జనార్ హెచ్చరించారు. ఈ మసాలాలతో క్యాన్సర్, అలర్జీలు, జీర్ణ సమస్యలు వచ్చే ప్రమాదం ఉందన్నారు. హెచ్-ఫాస్ట్ ఏర్పడిన 140 రోజుల్లో 659 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించామన్నారు. 202 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి 246 టన్నుల కల్తీ ఆహారాన్ని స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. ప్రజలు అనుమానాస్పద ఆహారంపై వెంటనే తమకు ఫిర్యాదు చేయాలని సీపీ సజ్జనార్ కోరారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





