– ప్రతీ గ్రామాన్ని అభివృద్ధి బాటలోకి తీసుకువెళ్తా
– నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్
– మంత్రి పొన్నంతో కలిసి అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు
హుజూర్‌నగర్, ప్రజాతంత్ర, జూలై 11: హుజూర్‌నగర్, కోదాడ నియోజకవర్గాల అభివృద్ధి తనకు రాజకీయ బాధ్యత మాత్రమే కాదని, ప్రజలు తనపై ఉంచిన విశ్వాసానికి ఇచ్చే కృతజ్ఞత అని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఈ రెండింటినీ తెలంగాణలోనే అత్యుత్తమ మౌలిక వసతులు, ఆధునిక విద్య, నాణ్యమైన వైద్యం, శాశ్వత సాగునీటి వసతులు కలిగిన ఆదర్శ నియోజకవర్గాలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన పనిచేస్తోందని స్పష్టం చేశారు. రూ.21 కోట్లతో కోదాడలో నూతన ఆర్టీసీ బస్ డిపో నిర్మాణానికి, హుజూర్‌నగర్ బస్టాండ్ ఆధునికీకరణ పనులకు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి శనివారం శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ మాట్లాడుతూ హుజూర్‌నగర్, కోదాడ ప్రజలతో తన బంధం ఎన్నికలతో ఏర్పడింది కాదని, మూడు దశాబ్దాలకుపైగా విశ్వాసం, ఆప్యాయత, పరస్పర నమ్మకంతో నిర్మితమైన అనుబంధమని అన్నారు. ఆరుసార్లు శాసనసభకు, ఒకసారి లోక్‌సభకు తనను గెలిపించిన ప్రజల రుTణం తీర్చుకోవడానికి అభివృద్ధినే మార్గంగా ఎంచుకున్నానని పేర్కొన్నారు. రైతు సంక్షేమమే గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అని పేర్కొన్న మంత్రి, రెడ్లకుంట, ఆర్-9, శాంతినగర్ ఎత్తిపోతల పథకాలతోపాటు సాగర్ ఆయకట్టు మేజర్, మైనర్ కాల్వలకు లైనింగ్ పనులు చేపట్టి ప్రతీ ఎకరాకు నీరు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. హుజూర్‌నగర్-కోదాడలను శాశ్వత సాగునీటి భరోసా కలిగిన వ్యవసాయ ప్రాంతాలుగా మార్చడం ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో కూడా చరిత్రాత్మక పెట్టుబడులు పెడుతున్నామని మంత్రి వెల్లడించారు. రూ.200 కోట్లతో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్, రూ.50 కోట్లతో జవహర్ నవోదయ పాఠశాల, రూ.26 కోట్లతో సిటీ స్కాన్ సౌకర్యంతో కూడిన వంద పడకల ఆధునిక ప్రభుత్వ హాస్పిటల్, యువతకు అంతర్జాతీయస్థాయి నైపుణ్యాలు అందించే అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. కోదాడ పురపాలక సంఘాన్ని ఆధునిక పట్టణంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించామని, రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి వ్యవస్థ, వీధి దీపాలు, పారిశుధ్యం, పట్టణ సుందరీకరణ వంటి రంగాల్లో భారీ పెట్టుబడులు పెట్టనున్నట్లు వెల్లడించారు. హుజూర్‌నగర్, కోదాడ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలు మాత్రమే కాదని, ప్రజాస్వామ్య విలువలకు అండగా నిలిచిన రాజకీయ చైతన్యానికి ప్రతీకలని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో హుజూర్‌నగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థికి లక్షా ఐదు వేలకుపైగా, కోదాడలో లక్ష ఓట్లకు పైగా వచ్చిన భారీ మెజారిటీ ప్రజలు అభివృద్ధి రాజకీయాలకు ఇచ్చిన అపూర్వ తీర్పుగా చరిత్రలో నిలిచిపోతుందన్నారు. అభివృద్ధి విషయంలో ప్రభుత్వానికి రాజకీయ భేదాలు లేవని, ప్రతీ గ్రామం, ప్రతీ రైతు, ప్రతీ విద్యార్థి, ప్రతీ మహిళ, ప్రతీ యువకుడు ప్రభుత్వ అభివృద్ధి ఫలాలను అందుకోవాలని, అదే కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా తత్వమని పేర్కొన్నారు. కార్యక్రమంలో కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, సూర్యాపేట కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





