తెలుగు అకాడమీ చైర్మన్ గా కూరపాటి

                (మండువ రవీందర్ రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి) 

తెలంగాణ తెలుగు అకాడమీ చైర్మన్ గా కాకతీయ యూనివర్శిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ కూర పాటి వెంకటనారాయణ నియామతుల య్యా రు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. పద్దెనిమిది కార్పొరేషన్లకు చైర్మన్, వైస్ చైర్మన్లను ప్రభుత్వం నియమించింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన పన్నెండు ఏళ్ళకు వెంకటనారాయణకు ఈ పదవి లభించడం పట్ల వరంగల్ ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి వారికి సముచిత గౌరవాన్ని కలిగిస్తున్నది. అందులో భాగంగా వెంకటనారా యణకు తెలుగు అకాడమీ పదవి లభించింది. ప్రొఫెసర్ వెంకటనారాయణ పక్కా తెలంగాణవాది. మలివిడత తెలంగాణ ఉద్యమానికన్నా ముందునుండే ఆయన పరాయి పాలనలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపై పోరాటం చేసిన వ్యక్తి. 1997లో భువనగిరిలో మొదటిసారిగా ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన సభ మొదలు అనేక సభలు, సమావేశాల్లో తెలంగాణ గళాన్ని వినిపించారు. తెలంగాణ గాంధీగా పేరుగాంచిన భూపతి కృష్ణమూర్తి, బియ్యాల జనార్థన‌రావు సాహచర్యంలో పోరు బాట పట్టారు. తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ శిష్యరికంలో ఆయనకున్న పట్టుదల, నిబద్ధత తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితిలో కీలక బాధ్యతలను నిర్వహించేలా చేసింది. ప్రగతిశీల ఉద్యమకారుల ఉద్యమ కార్యాచ రణలో కూడా ఆయన కీలక బాధ్యుడిగా పని చేశారు. అందులో భాగంగా 2006లో హన్మ కొండలోని కాకతీయ డిగ్రీ కళాశాల ఆవరణలో నిర్వహించిన ఐక్యవేదిక వెంకటనారాయణ కార్యదీక్షకు నిదర్శనం. ఆ కార్యక్రమంలో రాష్ట్రంలోని కళాకారులు, జననాట్యమండలి, అరుణోదయ లాంటి సంస్థలు పాల్గొనడంతో ఉద్యమానికి ఊతాన్నిచ్చాయి. మరోపక్క కెసిఆర్ నాయకత్వంలో ఉద్యమం కొనసాగుతున్న క్రమంలో వివిధ జిల్లాల్లో ఏర్పడిన జాయింట్ యాక్షన్ కమిటీ బాధ్యుడిగా ఆయన అలుపెరుగని పోరాటం చేశారు. నాటి కాంగ్రెస్ మంత్రులు, ఎంఎల్ఎల ఇండ్ల ముందు ధర్నాలు, ఆందోళన కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొన్నారు.

నెల్లికుదురు మండలం మేచ రాజుపల్లిలో జననం

ఉమ్మడి వరంగల్ జిల్లా నెల్లికుదురు మండలం మేచ రాజుపల్లి గ్రామంలో 1952 జూన్ 8న జన్మిం చిన వెంకటనారాయణ తమ గ్రామంలోనే ప్రాథమిక విద్యను పూర్తిచేసి, హన్మకొండలో ఉన్నత చదువులను పూర్తిచేశారు. తన విద్యార్జన చేసిన కాకతీయ విశ్వవిద్యాలయంలోనే 31 ఏళ్ళపాటు అద్యాపకులుగా పనిచేసిన వెంకటనారాయణ యూనివర్శిటీ విద్యార్థులను ఉద్యమం వైపు మళ్ళించడంలో విశేషంగా కృషి చేశారు. ఆంధ్రా ప్రాంతానికి చెందిన వైకుంఠం కెయుసి విసిగా ఉన్నప్పుడు వెంకట నారాయణ చేస్తున్న ఉద్యమాలకు ఆయన్ను ఇతర ప్రాంతాలకు బదిలీ చేశారు. అయినా ఆయన ఏనాడు ఉద్యమానికి దూరంగాలేరు. అలాగే ఆయన సామాజిక ఉద్యమాలను కూడా చేపట్టారు. యూనివర్శిటీ ఎన్ఎస్ఎస్ కో ఆర్డినేటర్గా విస్తృత కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా కెయుసికి దేశంలోనే ప్రత్యే కల్గి గుర్తింపును తీసుకువచ్చారు. ఆనాడు వీరి యూనిట్కు ఇందిరాగాంధీ అవార్డు లభించింది. మైక్రో ఫైనాన్స్ బాదితులను చూసి చలించిపోయారు. ముఖ్యంగా మహిళా బాధితులకు న్యాయం చేయాలని ఉద్యమించిన ఫలితంగా మైక్రో ఫైనాన్స్ రెగ్యులేటరీ యాక్ట్ వచ్చింది. అదే విధంగా ఉమ్మడి రాష్ట్రంలో 2001లో వరుసగా జరుగుతున్న రైతుల ఆత్మ హత్యలు ఆయన్ను తీవ్రంగా బాదించాయి. వారికి కావాల్సిన ఆర్థిక సహకారం, సబ్సీడీ రుణాలు, రుణమాఫీలకోసం ప్రభుత్వంతో పో రాటం చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఆయన తన పోరాటాలను కొనసాగిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా పదేళ్ళ బిఆర్ఎ స్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల ఆశయాలను తుంగలో తొక్కడాన్ని సహించలేకపోయారు. నాటి ప్రభుత్వం చేపట్టిన ప్రజా వ్యతిరేక పనులను, నిరంకుశపాలనను ఎండగడుతూ వచ్చారు. అయినా బిఆర్ఎస్ ప్రభుత్వంనుండి ఆయనకు చెన్నూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసే అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది. అయినప్పటికీ బిఆర్ఎస్ను గద్దె దింపాలన్న ఆయన ఆకాంక్ష నెరవేరింది. అనుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనకు తమ పాలనలో అవకాశం కలిగించింది. ఏనాడు ఎలాంటి పదవులు ఆశించని వెంకట నారాయణకు తెలుగు అకాడమీ చైర్మన్ పదవి లభించడం అభినందనీయం. తనకు ఈ అవకాశం కలిగించిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *