ఆధ్యాత్మిక రాష్ట్రంగా తీర్చిదిద్దాలి

– అర్చకుల, ఉద్యోగుల సమన్వయం అవ‌స‌రం
– దేవాదాయ శాఖ మంత్రి సురేఖ పిలుపు

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 20 : అర్చకులు, ఉద్యోగులు సమన్వయంతో పనిచేస్తే దేవాదాయ శాఖ కార్యక్రమాలు విజయవంతమవుతాయని ఆ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. దైవాజ్ఞ లేనిదే ఏ కార్యం జరగదని, దేవాదాయ శాఖ మంత్రిగా తన చేతుల మీదుగా ఈ కార్యాలు జరగాల్సి వుండటం దైవేచ్ఛ అని అన్నారు. హైదరాబాద్‌లోని దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయంలో రాష్ట్ర దేవాలయ పాలనా సంస్థ(స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్- సిటా)ను మంత్రి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉద్యోగుల సంక్షేమం, పాలనా సంస్కరణలు, నైపుణ్యాభివృద్ధికి ‘సిటా’ కొత్త దిశను నిర్దేశించనున్నట్లు చెప్పారు. ఆలయాల పరిపాలన, సిబ్బంది శిక్షణ, కొత్త సాంకేతికత అమలు దిశగా అవసరమైన విధానాలను, శిక్షణ కార్యక్రమాలను ‘సిటా’ చేపడుతుందని మంత్రి స్పష్టం చేశారు. శాఖ ముఖ్య కార్యదర్శి శైలాజా రామయ్యర్ మాట్లాడుతూ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ‘సిటా’ క్రియాశీలంగా లేని కారణంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలిపారు. దేవాలయాల నిర్వహణ, ఉద్యోగుల సంక్షేమం పట్ల ఎంతో నిబద్ధత కలిగిన మంత్రి సురేఖ చొరవతో దీనిని పున:ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ‘సిటా’ ఆధ్యర్యంలో దేవాదాయ శాఖ ఖ్యాతి ఇనుమడిస్తుందని డైరెక్టర్ హనుమంతరావు అన్నారు. రాబోయే మూడు రోజుల్లో (పనిదినాల్లో) దేవాలయ సంస్కృతి-ఆగమ శాస్త్రాలు అంశంపై ధార్మిక భవన్‌తోపాటు భద్రాచలం, యాదగిరిగుట్ట, వేములవాడ తదితర క్షేత్రాల్లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. గత వారం 26 మంది ఈవోలకు గ్రేడ్-2 నుంచి గ్రేడ్-1గా పదోన్నతితోపాటు అర్చక, ఇతర ఉద్యోగుల సంక్షేమ నిధి ట్రస్టు ప్రయోజనాల పెంపు ఉత్తర్వులు జారీ చేసిన దేవాదాయ శాఖ నేడు 38మందికి గ్రేడ్-3 నుంచి గ్రేడ్-2 ఉద్యోగులుగా పదోన్నతులు కల్పించింది. పలువురు ఉద్యోగులకు ‘సంక్షేమ నిధి ట్రసు’్ట ద్వారా ఆర్థిక ప్రయోజనాల అందజేశారు. కార్యక్రమంలో ధార్మిక సలహాదారు ఆర్.గోవిందహరి, ‘సిటా’ డైరెక్టర్ సీహెచ్.విజయ రాఘవాచార్యులు, అడిషనల్ కమిషనర్లు శ్రీనివాస్, జ్యోతి, రీజనల్ జాయింట్ కమిషనర్ రామకృష్ణారావు, డిప్యూటి కమిషనర్‌లు వినోద్ రెడ్డి, కృష్ణప్రసాద్, తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ అధ్యక్షుడు బసవరాజు శ్రీనివాస్, వైస్ చైర్మన్ సుబ్రహ్మణ్య ప్రసాద్, దేవాదాయ శాఖ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.

ఉద్యోగులకు పదోన్నతులు

ఈ సందర్భంగా 18మంది ఉద్యోగులకు ట్రాన్స్‌ఫర్ ఆఫ్ సర్వీస్ కింద సీనియర్ అసిస్టెంట్లుగా, మరో 20మందికి గ్రేడ్-3 నుంచి గ్రేడ్-2 ఈవోలుగా దేవాదాయ శాఖ పదోన్నతులు కల్పించింది. వీరంతా మంత్రి సురేఖ చేతుల మీదుగా పదోన్నతుల ఉత్తర్వులు అందుకున్నారు.

ఆర్థిక ప్రయోజనాలు

అర్చక, ఇతర ఉద్యోగుల సంక్షేమ నిధి ద్వారా రిటైరైన పలువురు ఉద్యోగులు మంత్రి చేతుల మీదుగా ఆర్థిక ప్రయోజనాలను అందుకున్నారు. సంక్షేమ నిధి ప్రయోజనాలను పెంచిన తర్వాత వర్తించే మొత్తాన్ని గ్రాట్యుటీ రూపంలో ఓ ఉద్యోగి అందుకున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *