– ప్రభుత్వ నిర్లక్ష్యంతో కుప్పకూలుతున్న విద్యావ్యవస్థ
– ఓయూకి రూ.1000 కోట్ల హామీ అమలు ఏమైంది?
– 45 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు మాయం వెనుక దొంగలెవరు?
– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 20 : సింగరేణి బొగ్గు కుంభకోణాన్ని దాచిపెట్టడంతోపాటు ఈ అవినీతిపై నిజాలు బయటకు రాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా మైనింగ్, ఎక్స్పోర్ట్స్, వేస్ట్ ఎనర్జీ రంగాల్లో ప్రముఖ పారిశ్రామికవేత్తగా దేశ ప్రగతికి తోడ్పడుతున్న ఫణి కుమార్ ప్రధాని నరేంద్ర మోదీ పాలన, నాయకత్వం పట్ల ఆకర్షితులై బీజేపీ సభ్యత్వం తీసుకున్నారు. సింగరేణి కాలరీస్ పరిధిలో దాదాపు 45 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు మాయమైందని పేపర్లలో వార్తలు రావడంపై నిజానిజాలు తెలుసుకోవడానికి మా పార్టీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి , ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం ఫ్యాక్ట్ ఫైండింగ్ కోసం వెళ్తే రేవంత్ ప్రభుత్వం పోలీసులతో అడ్డుకుందని రామచందర్ రావు మండిపడ్డారు. సింగరేణిలో 51 శాతం వాటా రాష్ట్ర ప్రభుత్వానిది, 49 శాతం వాటా కేంద్ర ప్రభుత్వానిది అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వానికి అక్కడ కనీసం ఒక అటెండర్‌ను నియమించే లేదా బదిలీ చేసే అడ్మినిస్ట్రేటివ్, ఫైనాన్షియల్ అధికారాలు లేవని స్పష్టం చేశారు. అందుకే ఈ కుంభకోణంపై విచారణ జరిపించాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారని తెలిపారు. తప్పు చేయనప్పుడు బీజేపీ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీని ఎందుకు అడ్డుకున్నారని, ఈ బొగ్గు దొంగతనం వెనుక ఉన్న అసలు దొంగలెవరో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ పాఠశాలల్లో నో అడ్మిషన్ బోర్డులు పెట్టాల్సి వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి గొప్పగా చెప్పుకోవడం అత్యంత హాస్యాస్పదమన్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం విద్యావ్యవస్థను నిర్లక్ష్యం చేస్తే, ప్రస్తుత రేవంత్ ప్రభుత్వం దాన్ని పూర్తిగా చంపేస్తోందని విమర్శించారు. రేషనలైజేషన్ పేరిట స్కూళ్లను తగ్గించి ఇప్పుడు మూసివేత దిశగా తీసుకెళ్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో 90 శాతానికి పైగా ప్రభుత్వ పాఠశాలలు కూలిపోయే స్థితిలో ఉన్నాయని, విద్యార్థినులకు ప్రత్యేక టాయిలెట్లు, కనీస మౌలిక వసతులు లేవని మండిపడ్డారు. విద్యా సంవత్సరం ప్రారంభమై నెల కావస్తున్నా ఇప్పటివరకు కొత్త పాఠ్యపుస్తకాలు ప్రింట్ కాలేదని, యూనిఫారాలు అందలేదని గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని కేంద్రీయ విద్యాలయాలకు ఉన్న డిమాండ్, స్టాండర్డ్స్ రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలకు ఎందుకు లేవని ప్రశ్నించారు. టీచర్లకు సరైన ప్రమోషన్లు లేవన్నారు. కేవలం జీతాలకే సరిపోయే బడ్జెట్ కాకుండా విద్యాశాఖకు బడ్జెట్‌ను తక్షణమే పెంచాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి నాడు ప్రకటించిన రూ.1000 కోట్ల నిధుల హామీ ఇంతవరకు అమలుకు నోచుకోలేదని విమర్శించారు. ఓయూలో హాస్టళ్ల పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని, ‘బి’ హాస్టల్ ఇప్పటికే మూతపడగా, ‘డి’, ‘ఇ’ హాస్టళ్లు కూడా కూలిపోయే స్థితికి చేరాయని ఆందోళన వ్యక్తం చేశారు. మెస్‌లలో క్వాలిటీ లేదని, విద్యార్థుల సమస్యలపై, హక్కులపై మాట్లాడే ప్రొఫెసర్లను సస్పెండ్ చేయడం దుర్మార్గమన్నారు. ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీల హాస్టళ్లను తక్షణమే పునర్నిర్మించాలని రాంచందర్ రావు డిమాండ్ చేశారు. మరోవైపు రాహుల్ గాంధీ ప్రధానమంత్రిని చేస్తే ధాన్యం కొనుగోలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడటం రైతులను వంచించడమేనని దుయ్యబట్టారు. ధాన్యం కొనుగోళ్లలో జాప్యం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాంతీయ పార్టీలను విచ్ఛిన్నం చేస్తోందంటూ బీజేపీపై బురదజల్లడం సరికాదన్నారు. హామీలకే పరిమితం కాకుండా విద్యావ్యవస్థను కాపాడాలని, రైతులకు తక్షణ న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





