ప్ర‌తిభావంతుడైన విద్యార్థికి కె.టి.ఆర్‌ స‌హాయం

– పార్టీ త‌ర‌పున ఎంబీబీఎస్‌ పూర్తి ఖ‌ర్చు భ‌రించేందుకు హామీ
– త‌క్ష‌ణ స‌హాయంగా వినయ్ భాస్క‌ర్ ద్వారా  రూ.1.5ల‌క్ష‌లు అంద‌జేత‌
– అడ్మిష‌న్ ప్ర‌క్రియ పూర్తిచేసిన బీఆర్ ఎస్ నాయ‌కులు
– కృత‌జ్ఞ‌తలు తెలిపిన విద్యార్థి ఆర్ముళ్ల గ‌ణేష్‌

వ‌రంగ‌ల్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 6:  ప్ర‌తిభావంతుడైన నిరుపేద విద్యార్థి ఎంబీబీఎస్ క‌ల‌ను సాకారం చేసేందుకు బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ క‌ల్వ‌కుంట్ల తార‌క రామారావు ముందుకు వ‌చ్చారు. ఎంబీబీఎస్‌లో సీటు వ‌చ్చిన విద్యార్థికి త‌క్ష‌ణ స‌హాయంగా రూ. 1,50,000 చెక్కును మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ద్వారా అంద‌జేశారు. గ‌తంలో ఆర్ముళ్ల గణేష్ అనే ఆ విద్యార్థి పూర్తి వైద్య విద్య ఖర్చును తామే భరిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. ఈ హామీ మేరకు తొలి విడతగా అడ్మిషన్ ఫీజు కోసం అవసరమైన రూ. 1,50,000 ను బీఆర్‌ఎస్ నాయకులు సోమవారం గణేష్‌కు అందించారు. వరంగల్‌లోని పశ్చిమ నియోజకవర్గం పెద్దమ్మగడ్డకు చెందిన గణేష్ చిన్నతనంలోనే తల్లిదండ్రులను, తోబుట్టువును కూడా కోల్పోయి అమ్మమ్మ ఇంట్లో పెరిగాడు.పేదరికం వెంటాడుతున్నప్పటికీ ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లోనే చదివి, పట్టుదలతో ఎంబీబీఎస్ ఫ్రీ సీటు (ప్రతిమ రిలీఫ్ మెడికల్ కాలేజీలో) సాధించాడు. అయితే ఈ నెల 6వ తేదీ లోపు ట్యూషన్ ఫీజు, డిపాజిట్ కింద రూ. 1,50,000 చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. గడువులోగా డబ్బు చెల్లించకపోతే సీటు కోల్పోయే ప్రమాదం ఉందని తెలుసుకున్న కొందరు సామాజిక కార్యకర్తలు, జర్నలిస్టులు కేటీఆర్‌కు ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేశారు. ట్వీట్‌కు స్పందించి గణేష్‌ ఎంబీబీఎస్ చదువు పూర్తి బాధ్యత బీఆర్‌ఎస్ తరపున తానే తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో బాలసముద్రంలోని హన్మకొండ జిల్లా బీఆర్‌ఎస్ కార్యాలయంలో ప్రభుత్వ మాజీ చీఫ్ విప్‌, బీఆర్‌ఎస్ హన్మకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్  సోమవారం గణేష్‌ను, అతని మామ దేవదాసును కలిసి కేటీఆర్ ఆదేశాల మేరకు  రూ. 1,50,000 చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా వినయ్ భాస్కర్ మాట్లాడుతూ కేటీఆర్ ఆదేశాల మేరకు తాము నేరుగా ప్రతిమ రిలీఫ్ మెడికల్ కాలేజీకి వెళ్లి ఈ తక్షణ సాయంతో గణేష్ అడ్మిషన్ ప్రక్రియను పూర్తి చేశామని తెలిపారు. ఎంబీబీఎస్ పూర్తి అయ్యే వరకు ఖర్చు మొత్తం కేటీఆర్ బీఆర్‌ఎస్ తరపున అందిస్తారని హామీ ఇచ్చారు. కేటీఆర్‌ అందించిన‌ సహాయానికి కృతజ్ఞతలు తెలుపుతూ విద్యార్థి గణేష్ భావోద్వేగానికి గురయ్యాడు. కేటీఆర్ అన్నకు, సాయం చేసిన వినయన్నకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశాడు. గణేష్ కోసం ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేసిన జర్నలిస్ట్ బొలెపాక రాజేష్‌కు, అతని మామ దేవదాసుకు, పాస్టర్ స్వామి దాసుకు, ఈ పరిస్థితిని కేటీఆర్‌కు చేరవేసిన దామెర అక్షయ్‌కు వినయ్ భాస్కర్ ప్రత్యేక అభినందనలు తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page