– ముగ్గురికి నోబెల్ బహుమతి ప్రకటన
న్యూదిల్లీ, అక్టోబర్ 6: వైద్యశాస్త్రంలో విశేష కృషి చేసినందుకుగాను మేరీ ఇ.బ్రంకో, ఫ్రెడ్ రామ్స్‌డెల్, షిమన్ సకగుచీలకు ఈ ఏడాది అత్యంత ప్రతిష్ఠాత్మక నోబెల్ పురస్కారం 2025 వరించింది. రోగనిరోధక వ్యవస్థకు సంబంధించిన పరిశోధనలకు గుర్తింపుగా ఈ ముగ్గురికీ అవార్డు దక్కింది. స్వీడన్‌లోని స్టాక్‌హోంలో నోబెల్ బృందం ఈ ప్రకటన చేసింది. మేరీ ఇ.బ్రంకో, ఫ్రెడ్ రామ్స్‌డెల్ అమెరికాకు చెందినవారు కాగా సకగుచీ జపాన్‌కు చెందిన పరిశోధకుడు. వైద్య విభాగంతో మొదలైన నోబెల్ పురస్కారాల ప్రదానం ఈ నెల 13వ తేదీ వరకు కొనసాగనుంది. శరీరంలో శక్తిమంతమైన రోగనిరోధక వ్యవస్థకు నియంత్రణ తప్పనిసరి. లేకపోతే.. సొంత అవయవాలపై దాడి చేసే అవకాశం ఉంది. దీన్ని నిరోధించే ’పెరిఫెరల్ ఇమ్యూన్ టాలరెన్స్’కు సంబంధించిన ఆవిష్కరణలకుగానూ ఈ ముగ్గురికి నోబెల్ లభించింది. రోగనిరోధక కణాలు సొంత శరీరంపై దాడి చేయకుండా అడ్డుకునే ‘రెగ్యులేటరీ టీ సెల్స్’ను వీరు గుర్తించారు. రోగనిరోధక వ్యవస్థ ఎలా పనిచేస్తుందో, అందరికీ ఆటోఇమ్యూన్ వ్యాధులు ఎందుకు రావో అర్థం చేసుకునేందుకు వారి ఆవిష్కరణలు దోహదపడతాయని నోబెల్ కమిటీ ఛైర్మన్ ఓలె కాంపే తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





