మత్స్యకారుల సమగ్రాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

– పశు సంవర్ధక శాఖ మంత్రి వాకిటి
– కోహెడలో ఎగుమతి ఆధారిత హోల్‌సేల్ చేపల మార్కెట్‌కు శంకుస్థాపన
కోహెడ, ప్రజాతంత్ర, జూలై 10 : మత్స్యకారుల సమగ్ర అభివృద్ధి కోసం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం పని చేస్తున్నదని పశు సంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్య, యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా కోహెడలో రూ.47.03 కోట్లతో నిర్మించనున్న ఎగుమతి ఆధారిత హోల్‌సేల్ చేపల మార్కెట్‌కు శుక్రవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అత్యధిక జనాభా ఉన్న మత్స్యకారులు ఆర్ధికంగా ఎదగాలని, మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా మత్స్య కారులకు శుభాకాంక్షలు తెలిపారు. ముదిరాజుల సంక్షేమం కోసం పాటుపడతానని, ముదిరాజుల అభివృద్ధి కోసం మంత్రి, ఎమ్మెల్యే పదవికే కాదు.. ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధం అని శ్రీహరి అన్నారు. తెలంగాణ మత్స్య రంగ చరిత్రలో మరో చారిత్రక ఘట్టంగా నిలిచే కోహెడలో అంతర్జాతీయ మంచినీటి చేపల ఎగుమతుల కేంద్రం శంకుస్థాపనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, సముద్రతీర ప్రాంతం కాకుండా దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో ఇలాంటి ఆధునిక ఎగుమతుల కేంద్రం ఏర్పాటు కావడం తెలంగాణకు గర్వకారణమని చెప్పారు. మత్స్యకారుల ఆదాయాన్ని పెంచడం, వారికి శాశ్వత ఉపాధి కల్పించడం, అంతర్జాతీయ మార్కెట్లకు అవకాశాలు కల్పించడం లక్ష్యంగా ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపట్టిందన్నారు.
మంచినీటి చేపల ఉత్పత్తిలో అగ్రస్థానం
ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద కేంద్ర ప్రభుత్వం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులతో సుమారు రూ.47 కోట్లతో ఈ కేంద్రాన్ని నిర్మిస్తున్నారు. తెలంగాణ ప్రస్తుతం మంచినీటి చేపల ఉత్పత్తిలో దేశంలోనే అగ్రస్థానంలో కొనసాగుతోంది. 2025లో రాష్ట్రంలో సుమారు 4.20 లక్షల టన్నుల చేపలు, 15 వేల టన్నుల మంచినీటి రొయ్యల ఉత్పత్తి నమోదైంది. ఈ ఎగుమతుల కేంద్రం అందుబాటులోకి వస్తే రాష్ట్రంలోని చేపలకు దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లు లభించి మత్స్యకారులకు మెరుగైన ధరలు అందనున్నాయి. తెలంగాణ చేపలకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు దక్కనుంది. ఈ కేంద్రంలో ఆధునిక శీతల గిడ్డంగులు, శుద్ధి యూనిట్లు, ప్యాకేజింగ్ కేంద్రాలు, శిక్షణ కేంద్రం, కస్టమ్స్ సదుపాయాలు, భారీ హోల్‌సేల్ మార్కెట్ వంటి అన్ని ఆధునిక సౌకర్యాలు కల్పించనున్నారు. సుమారు రెండు వేల మంది వ్యాపారులు ఇక్కడ వ్యాపారం నిర్వహించే అవకాశం ఉండగా లోడింగ్, అన్‌లోడింగ్, ప్యాకేజింగ్, రవాణా తదితర రంగాల్లో సుమారు ఐదు వేలమందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఇది చేపల మార్కెట్ మాత్రమే కాక రాష్ట్ర మత్స్య రంగాన్ని ప్రపంచ మార్కెట్‌తో అనుసంధానం చేసే అభివృద్ధి వేదికగా నిలవనుంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంతోపాటు యువతకు కొత్త ఉపాధి అవకాశాలను సృష్టించనుంది. తెలంగాణలో ఉత్పత్తి అయ్యే ప్రతి చేపకు ప్రపంచ మార్కెట్ అందించడమే తమ లక్ష్యం.. మత్స్యకారుల కుటుంబాల్లో ఆర్థిక సంతోషం నింపడమే ప్రభుత్వ సంకల్పం’ అని ప్రభుత్వం పేర్కొంది. ఈ కార్యక్రమంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, ఫిషరీస్ డైరెక్టర్ నిఖిల, ఫ్రూట్ మార్కెట్ చైర్మన్ చిలుక మధు, రంగారెడ్డి మత్స్య సహకార సంఘం అధ్యక్షుడు దూస వెంకటేష్, ఫిషరీస్ అడిషనల్ డైరెక్టర్ మురళీకృష్ణ, అడిషనల్ కలెక్టర్ చంద్రారెడ్డి, మత్స్యకారులు పాల్గొన్నారు.
————————————————————————————————————————————————————————————

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *