– సెకండరీ హెల్త్ కేర్ వ్యవస్థను బలోపేతం చేస్తాం
– ఏరియా హాస్పిటల్స్, హెల్త్ సెంటర్లలో సదుపాయాల కల్పన
– వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 9 : రాష్ట్రంలోని ప్రజలకు అన్ని రకాల వైద్య సేవలు వారి జిల్లాల్లోనే అందుబాటులోకి తీసుకురావాలన్నది ప్రభుత్వ లక్ష్యమని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ స్పష్టం చేశారు. ఈ లక్ష్య సాధనలో కమÖ్యనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా హాస్పిటళ్లు, జిల్లా హాస్పిటళ్లు అత్యంత కీలక పాత్ర పోషిస్తాయన్నారు. ఇందుకనుగుణంగా ఈ హాస్పిటళ్లలో మౌలిక సదుపాయాలు, స్పెషలిస్ట్ వైద్య సేవలు, అవసరమైన వైద్య సిబ్బంది, డయాగ్నస్టిక్ సదుపాయాలను అందుబాటులోకి తీసుకొస్తున్నామని మంత్రి తెలిపారు. సెకండరీ హెల్త్ కేర్ వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా రోగులు చిన్న సమస్యలకు కూడా హైదరాబాద్, మెడికల్ కాలేజీ హాస్పిటళ్లకు వెళ్లే పరిస్థితి తగ్గుతుందని మంత్రి పేర్కొన్నారు. ఈ మేరకు సెక్రటేరియట్లో డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్ (తెలంగాణ వైద్య విధాన పరిషత్(టీవీవీనీ) పునర్వ్యవస్థీకరణపై సోమవారం నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో మంత్రి మాట్లాడారు. డీఎస్‌హెచ్ పునర్వ్యవస్థీకరణపై అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా రూపొందించిన అధ్యయన నివేదికలోని ప్రతిపాదనలను మంత్రి సమీక్షించారు. డీఎస్‌హెచ్ పరిధిలోని హాస్పిటళ్లలో ఇటీవలే 1,616 మంది స్పెషలిస్ట్ డాక్టర్లను నియమించామని, అవసరమైన మేర నర్సులు, టెక్నీషియన్ల నియామకాలు కూడా చేపట్టామని మంత్రి గుర్తుచేశారు. ప్రభుత్వం చేపట్టిన ఈ నియామకాల ఫలితాలు ప్రజలకు అందాలంటే ప్రతి హాస్పిటల్లో అందుబాటులో ఉన్న సిబ్బందిని సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. ఏ హాస్పిటల్లో ఏ స్పెషలిస్ట్ వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి.. ఇంకా ఏయే విభాగాల్లో వైద్యులు, నర్సింగ్, పారామెడికల్ సిబ్బంది అవసరం ఉంది.. ఏయే వైద్య పరికరాలు, డయాగ్నస్టిక్ సదుపాయాలు కల్పించాల్సి ఉంది అనే అంశాలపై హాస్పిటల్ వారీగా సమగ్ర సమీక్ష చేపట్టాలని ఆదేశించారు. స్పెషలిస్టులు ఉన్నప్పటికీ అవసరమైన పరికరాలు, సిబ్బంది లేక వైద్య సేవలు అందించలేని పరిస్థితి ఉండకూడదని స్పష్టం చేశారు. 30 పడకలు, 50 పడకలు, 100 పడకలు, అంతకంటే ఎక్కువ సామర్థ్యం కలిగిన హాస్పిటళ్లకు వాటి స్థాయికి అనుగుణంగా వైద్య సేవల పరిధిని నిర్ణయించాలని మంత్రి సూచించారు. సీహెచ్‌సీలు, ఏరియా హాస్పిటళ్లు, జిల్లా హాస్పిటళ్లలో అందుబాటులో ఉండాల్సిన స్పెషాలిటీ విభాగాలు, వైద్య సేవలు, పడకలు, ఆపరేషన్ థియేటర్లు, ల్యాబ్‌లు, ఇతర సదుపాయాలపై స్పష్టమైన ప్రణాళిక రూపొందించాలని అధికారులకు సూచించారు. సెకండరీ హెల్త్ కేర్ హాస్పిటళ్లను కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్స్ మార్గదర్శకాలకు అనుగుణంగా అభివృద్ధి చేయాలని మంత్రి సూచించారు. ప్రస్తుతం ఉన్న సిబ్బంది, మంజూరైన పోస్టులు, ఐపీహెచ్ఎస్ ప్రమాణాల ప్రకారం అవసరమైన సిబ్బంది సంఖ్యను పోల్చి చూసి లోటుపాట్లను గుర్తించాలని సూచించారు. ఇప్పటికే ఉన్న పోస్టులను అవసరాలకు అనుగుణంగా పునర్వ్యవస్థీకరించడంతోపాటు, అదనంగా అవసరమైన పోస్టులపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రతి జిల్లాలో డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్(డీసీహెచ్ఎస్) కార్యాలయాలను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను సమీక్షించిన మంత్రి రాష్ట్రస్థాయి డైరెక్టరేట్ నుంచి జిల్లాస్థాయి వరకు స్పష్టమైన పరిపాలనా బాధ్యతలు ఉండాలని సూచించారు. ప్రతి జిల్లాలోని హాస్పిటళ్ల పనితీరు, వైద్య సేవల నాణ్యత, మౌలిక సదుపాయాల అభివృద్ధిని నిరంతరం పర్యవేక్షించే వ్యవస్థ ఉండాలని పేర్కొన్నారు. హాస్పిటళ్లలో రోగులకు ఎదురవుతున్న సమస్యలు, వైద్య సేవల్లో లోటుపాట్లు, సిబ్బంది అవసరాలను ఎప్పటికప్పుడు గుర్తించి పరిష్కరించేలా జిల్లాస్థాయి అధికారులకు బాధ్యతలు అప్పగించాలని సూచించారు. సమావేశంలో ప్రముఖ ఆంకాలజిస్ట్, ప్రభుత్వ సలహాదారు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు, పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ఫౌండర్ ప్రెసిడెంట్ డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి, జీఏడీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ మహేశ్ దత్ ఎక్కా, ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జడ్. చొంగ్తు, ఆర్థికశాఖ స్పెషల్ సెక్రటరీ సిక్తా పట్నాయక్, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ ముషారఫ్ అలీ, ఆస్కి డైరెక్టర్ డాక్టర్ సుబోధ్ తదితరులు పాల్గొన్నారు.
zతెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





