డిసెంబరులో అంతర్జాతీయ వాతావరణ సదస్సు

– ఎల్‌నినో సన్నద్ధత, హరిత పెట్టుబడులపై ప్రత్యేక దృష్టి
– హాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులకూ ఆహ్వానం పంపే యోచన
– ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో భాగంగా నిర్వహణ
– పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్

హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబరు 9 : హైదరాబాద్‌లో డిసెంబరు 7 నుంచి అంతర్జాతీయ వాతావరణ సదస్సు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026లో భాగంగా నిర్వహించే ఈ సదస్సుకు దేశవిదేశాల వాతావరణ నిపుణులతోపాటు పర్యావరణ పరిరక్షణలో చురుకుగా ఉన్న హాలీవుడ్, బాలీవుడ్ సినీ ప్రముఖులను ఆహ్వానించాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనే సన్నద్ధత, వాతావరణ మార్పులను తట్టుకునే సామర్థ్యాన్ని పెంచడం, హరిత పెట్టుబడులు సదస్సులో ప్రధాన చర్చాంశాలుగా ఉంటాయని పేర్కొన్నారు. సచివాలయంలోని తన కార్యాలయంలో సదస్సు ఏర్పాట్లపై మంత్రి ఉన్నతాధికారులతో సోమవారం సమీక్ష నిర్వహించారు. నీటి భద్రత, వ్యవసాయం, ప్రజల జీవనోపాధిపై ఎల్‌నినో చూపగల ప్రభావాన్ని సమగ్రంగా చర్చించాలన్నారు. వక్తల స్థాయి, చర్చల నాణ్యత, తెలంగాణకు అంతర్జాతీయంగా లభించే గుర్తింపు, పెట్టుబడి అవకాశాలు, ముఖ్యంగా ఆచరణలో పెట్టగల నిర్ణయాల ఆధారంగా సదస్సు విజయాన్ని అంచనా వేయాలని సూచించారు. సమీక్షలో పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, అటవీ శాఖ ప్రధాన సంరక్షణాధికారి వినయ్‌కుమార్, టీజీ ట్రాన్స్‌కో మేనేజింగ్ డైరెక్టర్ డి. కృష్ణభాస్కర్‌తోపాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఎల్‌నినోపై ముందస్తు సన్నద్ధత

ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావం దీర్ఘకాలం కొనసాగడం, నీటి కొరత, అధిక ఉష్ణోగ్రతలు, సాగుకు ఇబ్బందులు వంటి పరిణామాలకు రాష్ట్రం ముందుగానే సిద్ధం కావాలని మంత్రి చెప్పారు. తాగునీరు, విద్యుత్ అవసరాలు పెరిగే అవకాశాన్నీ దృష్టిలో ఉంచుకోవాలన్నారు. వేసవి తీవ్రంగా ఉండే నెలల్లో కరువు ప్రభావాన్ని తగ్గించేందుకు, సహాయక చర్యలు చేపట్టేందుకు నెలకు దాదాపు రూ.1,000 కోట్లు సమీకరిస్తామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీని గుర్తు చేశారు. రాష్ట్ర సన్నద్ధతను మెరుగుపరిచేందుకు శాస్త్రీయ పద్ధతుల ఆధారంగా సుస్థిరమైన దీర్ఘకాలిక వ్యూహాలు రూపొందించాలని సూచించారు. వేసవిలో కీలకమైన మార్చి నుంచి మే వరకు తాగునీరు, పశుగ్రాసం అందుబాటులో ఉంచడం, కరువు ప్రభావానికి ఎక్కువగా గురయ్యే వర్గాలను ఆదుకోవడం వంటి అంశాలపై సదస్సులో చర్చకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ప్రముఖులను ఎంపిక చేసి సంబంధిత సంస్థలు, దౌత్య మార్గాల ద్వారా వారిని ఆహ్వానించాలని మంత్రి అధికారులకు సూచించారు. ప్రతిపాదిత ఆహ్వానితుల్లో రాజేంద్ర సింగ్, సునీతా నారాయణ్, సద్గురు, నార్వే మాజీ పర్యావరణ మంత్రి ఎరిక్ సోల్హైమ్ ఉన్నారు. పర్యావరణ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్న సినీ నటి దియా మీర్జాను సదస్సు పరిచయ కార్యక్రమానికి ఆహ్వానించే అవకాశాన్ని పరిశీలించాలని మంత్రి కోరారు. కేంద్ర మంత్రులు, దేశీయ రాజకీయ, పర్యావరణ రంగాల ప్రముఖులతోపాటు నార్వే, డెన్మార్క్, స్వీడన్ తదితర దేశాల రాయబారులను ఆహ్వానించే ప్రతిపాదన కూడా ఉంది. చర్చలకు తమ అనుభవంతో తోడ్పడగల, సదస్సుకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురాగల వ్యక్తులకు ఆహ్వానాల్లో ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి పేర్కొన్నారు.

హరిత పెట్టుబడులపై ప్రత్యేక చర్చ

వాతావరణ సమస్యలకు పరిష్కారాలను అందించే వ్యాపారాలు, పెట్టుబడి అవకాశాలపై సదస్సులో ప్రత్యేకంగా చర్చించాలని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సూచించారు. వాయు కాలుష్య నియంత్రణ, పునరుత్పాదక ఇంధనం, వాతావరణ చర్యలకు నిధుల సమీకరణ, జల సంరక్షణ, హరిత సాంకేతికతలు, సుస్థిర మౌలిక వసతులు, వ్యర్థాల నుంచి సంపద సృష్టి వంటి అంశాలను ఈ చర్చల్లో భాగం చేయాలన్నారు. భూగర్భజలాల పునరుద్ధరణ, క్షీణించిన భూముల పునరుద్ధరణ, సూక్ష్మ సేద్యం, నేల సంరక్షణ, తక్కువ నీటితో ఉద్యాన పంటల సాగులో విజయవంతమైన నమూనాలను సదస్సులో ప్రదర్శించాలని సూచించారు. మణికొండలో ఓ నివాస సముదాయం చేపట్టిన భూగర్భజలాల పునరుద్ధరణ కార్యక్రమాన్ని, కాన్హా శాంతివనంలో చేపట్టిన మొక్కల పెంపకం, నేల సంరక్షణ పనులను ఉదాహరణలుగా ప్రస్తావించారు.

ఈనెల 28న క్షేత్రస్థాయి సంప్రదింపులు

వాతావరణ మార్పులతో నేరుగా ప్రభావితమవుతున్న ప్రజల అనుభవాలు, అవసరాలు సదస్సు చర్చల్లో ప్రతిబింబించేలా ఈనెల 28న క్షేత్రస్థాయి సంప్రదింపుల సమావేశం నిర్వహించాలని మంత్రి ప్రతిపాదించారు. వివిధ వర్గాలకు చెందిన సుమారు వంద మంది ప్రతినిధులను ఈ సమావేశానికి ఆహ్వానించాలని సూచించారు.

రెండు రోజుల సదస్సుకు ప్రతిపాదన

అంతర్జాతీయ సదస్సును రెండు రోజులపాటు నిర్వహించి పరిమిత సంఖ్యలో సమావేశాలతో ప్రధాన అంశాలపై లోతైన చర్చకు అవకాశం కల్పించాలని మంత్రి ఉత్తమ్ సూచించారు. కరువు, ఎల్‌నినో సన్నద్ధతతోపాటు నీటి భద్రత, వాతావరణ మార్పులను తట్టుకునే చర్యలు, అటవీ విస్తరణ, ఎడారీకరణ నివారణ వంటి అంశాలను సదస్సు కార్యసూచిలో చేర్చాలన్నారు.


zతెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *