హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 27 : భారత మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత డాక్టర్ మన్మోహన్ సింగ్ పరమపదించారని తెలిసి తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్ననట్లు కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి (Kishan reddy ) ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత సమస్యలతో బాధపడుతున్న డాక్టర్ మన్మోహన్ దిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ కాసేపటి క్రితం కన్నుమూశారని తెలిసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ గా, ప్రణాళికా సంఘంలో కీలక బాధ్యతల్లో, యూజీసీ చైర్మన్ గా, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా గా వారు దేశానికి వన్నెతీసుకొచ్చారు. పీవీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, దేశ ఆర్థికమంత్రిగా.. దేశంలో సంస్కరణలు తీసుకురావడంలో వారు పోషించిన పాత్రను దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని తెలిపారు.
2019లో తాను పార్లమెంటు సభ్యుడిగా ఉన్న సమయంలో వారు అప్పుడప్పుడూ పార్లమెంటు వీల్ చైర్లో రావడం నాకు గుర్తుంది. పార్లమెంటు సభ్యుడిగా వారి అంకితభావానికి ఇది నిదర్శనం. మేధావి, మితభాషి, సౌమ్యుడు, స్థిత ప్రజ్ఞత కలిగిన నేతగా.. మన్మోహన్ సింగ్ మన యువతరానికి ఆదర్శం. మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటు. నిరాడంబర జీవితం, దేశం పట్ల వారి అంకిత భావం భావితరాలకు స్ఫూర్తి దాయకం. ఆ మహనీయుని ఆత్మకు శాంతి ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అని జి.కిషన్ రెడ్డి పేర్కొన్నారు.