~ రాష్ట్రాలకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
~ దేశంలో 47,000 మంది చిన్నారుల ఆచూకీ లేదు..
~ అత్యున్నత న్యాయస్థానం తీవ్ర ఆందోళన
~ యాంటీ ట్రాఫికింగ్ విభాగాలు ముమ్మరం చేయాలని స్పష్టీకరణ
~ దేశంలో 47,000 మంది చిన్నారుల ఆచూకీ లేదు..
~ అత్యున్నత న్యాయస్థానం తీవ్ర ఆందోళన
~ యాంటీ ట్రాఫికింగ్ విభాగాలు ముమ్మరం చేయాలని స్పష్టీకరణ
న్యూదిల్లీ, మే 23: దేశంలో నానాటికీ పెరిగిపోతున్న చిన్నారుల అదృశ్యం కేసులపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం దేశంలో దాదాపు 47వేల మంది చిన్నారుల ఆచూకీ లభించకుండా పోయిందంటూ ఏటా ఈ బ్యాక్‌లాగ్ పెరుగుతుండటంపై తీవ్ర అసంతృప్తిని వెలిబుచ్చింది. ఈ వ్యవస్థాగత లోపాలను సరిదిద్దడానికి, అంతర్రాష్ట్ర మానవ అక్రమ రవాణా ముఠాల నెట్‌వర్క్‌ను ఛేదించడానికి సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్ అహసానుద్దీన్ అమానుల్లా, జస్టిస్ ఆర్.మహాదేవన్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. చిన్నారుల అదృశ్యం కేసులను కేవలం మిస్సింగ్‌గా కాకుండా అంతర్రాష్ట్ర ముఠాల కిడ్నాప్ కోణంలోనే దర్యాప్తు చేయాలని స్పష్టం చేసింది. పోలీసుల వద్ద ఉన్న క్రిమినల్ ట్రాకింగ్ డేటాబేస్, చైల్డ్ వెల్ఫేర్ అథారిటీల వద్ద ఉన్న ’విశాల్ వాసిల్య’ డేటాబేస్ మధ్య సమన్వయం లేకపోవడాన్ని కోర్టు తప్పుపట్టింది. ఈ క్రమంలో సుప్రీంకోర్టు ఐదు కీలక ఆదేశాలను జారీ చేసింది. దేశంలోని వివిధ సంస్థలు నిర్వహిస్తున్న చిన్నారుల డేటాబేస్‌లన్నింటినీ అనుసంధానం చేయాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖను ఆదేశించింది. దీనివల్ల పోలీస్ అధికారులు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీలు, జిల్లా బాలల రక్షణ విభాగాలు చైల్డ్ కేర్ హోమ్‌ల మధ్య సమాచారం రియల్ టైమ్‌లో షేర్ అవుతుంది. చాలా జిల్లాల్లో మానవ అక్రమ రవాణా నిరోధక విభాగాలు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తగిన అధికారాలు, మౌలిక సదుపాయాలతో నాలుగు వారాల్లోగా పూర్తిగా అందుబాటులోకి తీసుకురావాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఏదైనా చైల్డ్ మిస్సింగ్ కేసు నమోదైన వెంటనే అధికారులు ప్రాథమికంగా దానిని కిడ్నాప్ లేదా అపహరణగా భావించి దర్యాప్తు ప్రారంభించాలి. దీనివల్ల ప్రొసీజర్ ఆలస్యం కాకుండా దర్యాప్తులో సీరియస్‌నెస్ వస్తుందని కోర్టు పేర్కొంది. ఒకవేళ ఆ కేసులో హ్యూమన్ ట్రాఫికింగ్ అనుమానాలు ఉంటే నిబంధనల ప్రకారం నాలుగు నెలలు వేచి చూడకుండా వెంటనే కేసును బదిలీ చేయాలని స్పష్టం చేసింది. రక్షించిన లేదా రికవరీ చేసిన చిన్నారులను సాధారణంగా 24 గంటల్లోగా వారి కుటుంబాలకు అప్పగించాలి. ఒకవేళ ఆ నిర్దిష్ట చైల్డ్ ట్రాఫికింగ్ లేదా దోపిడీ వెనుక కుటుంబ సభ్యుల ప్రమేయం ఉన్నట్లు అనుమానం వస్తే తప్ప మిగిలిన సమయాల్లో తక్షణమే తల్లిదండ్రుల వద్దకు చేర్చాలి. కుటుంబ సభ్యులపై అనుమానం ఉంటే ఆ బాధ్యతను చైల్డ్ వెల్ఫేర్ కమిటీలు చూసుకోవాలి. రక్షించిన ప్రతీ బిడ్డకు ఒకే గుర్తింపు ఉండేలా చూసుకోవడం, భవిష్యత్తులో వారి ఆచూకీని సులభంగా పర్యవేక్షించేందుకు అవసరమైన అధికారిక రిజిస్టేష్రన్, వెరిఫికేషన్ పక్రియలను వేగవంతం చేయాలని డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్లను కోర్టు ఆదేశించింది. తద్వారా ఐడెంటిటీ డూప్లికేషన్‌ను నిరోధించవచ్చని పేర్కొంది. 2011 సెప్టెంబరులో చెన్నైలోని విరుగంబాక్కం పరిధిలో కవిత అనే చిన్నారి అదృశ్యమైంది. స్థానిక పోలీసులు, సెంట్రల్ క్రైం బ్రాంచ్ దర్యాప్తు చేసినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులు ఈ కేసును ఆచూకీ లభించనిదిగా పేర్కొంటూ క్లోజర్ రిపోర్టు ఇచ్చారు. దీనిపై తండ్రి జి.గణేష్ దాఖలు చేసిన పిటిషన్‌ను 2025 మార్చిలో మద్రాస్ హైకోర్టు తిరస్కరించింది. చిన్నారి 2011లో మిస్ అయింది కావున 2013లో వచ్చిన హోం శాఖ యాంటీ-ట్రాఫికింగ్ గైడ్‌లైన్స్ దీనికి వర్తించవని హైకోర్టు పేర్కొంది. ఈ తీర్పును సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. ’చిన్నారి ఆచూకీ లభించనంత కాలం చైల్డ్ ప్రొటెక్షన్ గైడ్‌లైన్స్, యాంటీ-ట్రాఫికింగ్ ప్రొటోకాల్స్ అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది’ అని స్పష్టం చేసింది. ఈ కేసును సుమోటోగా స్వీకరించి దేశవ్యాప్తంగా ఉన్న మిస్సింగ్ చిన్నారుల సమస్యపై ఈ సమగ్ర ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు తదుపరి విచారణ ఆగస్టుకు వాయిదా వేసింది. ఆ సమయంలోగా అన్ని రాష్ట్రాలు, అధికారులు దీనిపై నివేదిక సమర్పించాల్సి ఉంటుంది.
——————————————————————————————————————————————————————
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





