– మూడో రోజుకు సరస్వతి అంత్య పుష్కరాలు
– మహామండలేశ్వర ఆచార్య సంవిదానంద పుణ్యస్నానం
జయశంకర్ భూపాలపల్లి, ప్రజాతంత్ర, మే 23 : జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాళేశ్వరంలో సరస్వతి అంత్య పుష్కరాలు అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా మూడవ రోజు శనివారం కాళేశ్వరం త్రివేణి సంగమ తీరానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఘాట్లన్నీ భక్తుల రాకతో కిక్కిరిసిపోయాయి. మండుతున్న ఎండలను సైతం లెక్కచేయకుండా భక్తులు సరస్వతి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి, పితృదేవతలకు పిండప్రదానాలు నిర్వహించారు. కాగా, నాసిక్‌కు చెందిన మహామండలేశ్వర ఆచార్య సంవిదానంద సరస్వతి మహారాజ్ కాళేశ్వరంలోని కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం సరస్వతి నదిలో పుణ్యస్నానం ఆచరించిన అనంతరం ఆలయానికి చేరుకున్న మహారాజ్‌కు అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించి ప్రత్యేక దర్శనం చేసుకున్నారు. అలాగే పార్వతి (శుభానంద) దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆశీర్వచన మండపంలో అర్చకులు, భక్తులకు ధార్మిక ప్రవచనాలు చేశారు. అనంతరం ఆలయం తరఫున స్వామివారి శేష వస్త్రాలను మహారాజ్‌కు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మోహన్ శర్మ, ఆర్జేసీ రామకృష్ణ, ఈవో మహేష్, ఆలయ అధికారులు, వేద పండితులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.తదుపరి మహా సరస్వతి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పెరుగుతున్న భక్తులు : కలెక్టర్ రాహుల్ శర్మ 
సరస్వతీ అంత్య పుష్కరాల సందర్భంగా మూడవ రోజు కాళేశ్వరం త్రివేణి సంగమంలో భక్తుల రద్దీ క్రమంగా పెరుగుతోంది. మండుతున్న ఎండను సైతం లెక్కచేయకుండా భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తూ స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఆర్టీసీ బస్సుల్లో వచ్చే భక్తుల సౌకర్యార్థం బస్టాండ్ నుంచి పుష్కర ఘాట్ వరకు ఉచిత షటిల్ సర్వీసులు ఏర్పాటు చేయడంతో భక్తులు సులభంగా ఘాట్లకు చేరుకుంటున్నారు. సరస్వతి ఘాట్ వద్ద సాయంత్రం నిర్వహించే సరస్వతి నవరత్న మాలా హారతి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. హారతి అనంతరం సాంస్కృతిక కళా ప్రదర్శనలు, పండితుల ప్రవచనాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి స్వామీజీలు విచ్చేసి ప్రవచనాలు అందించడంతో భక్తుల రాక మరింతగా పెరుగుతోంది. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని మంచినీటి సరఫరా, చలువ పందిళ్లు, మిస్ట్ ఫాగ్ స్ప్రింక్లర్లు ద్వారా నీటి జల్లులు పడేలా ప్రత్యేక ఏర్పాట్లయడం ద్వారా భక్తులు సేదతీరుతున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖల సమన్వయంతో యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసి పుష్కరాలను విజయవంతంగా నిర్వహిస్తోంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





