– లాభాల్లో నడుస్తున్న పాల ప్యాకింగ్ ప్లాంటును మూసేయాల్సిన అవసరమేంటి?
– ప్రైవేటు డెయిరీలకు కట్టబెట్టే కుట్ర దాగుందన్న అనుమానాలు
ఖమ్మం, ప్రజాతంత్ర, జూలై 1 : ఇడుపు కాయితం.. ఈ పేరు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. భర్త, భార్య విడిపోవడానికి రాసుకునే అంగీకార పత్రమే ఇడుపు కాయితం. ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకంటే యాభై ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఖమ్మం ప్రభుత్వ పాడి పరిశ్రమ (విజయ డెయిరీ) ఇక్కడ నుంచి విడిపోయే పరిస్థితి నెలకొంది. ఇక అసలు విషయానికి వస్తే.. జిల్లా కేంద్రం అయిన ఖమ్మం నగరంలో ఇందిరా నగర్ లో ఏర్పాటు చేసిన పాల డెయిరీ మనుగడ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. పాడి రైతుల సంక్షేమం, పాడి పరిశ్రమాభివృద్ధికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని పాలకులు ఒక వైపు ప్రకటిస్తుండగా మరో వైపు ఇక్కడి డెయిరీని మూసివేసే దిశగా తెరవెనుక సంబంధిత ప్రభుత్వ యంత్రాంగం వేగంగా అడుగులు వేస్తోంది. లాభాల బాటలో నడుస్తున్న పాల ప్యాకింగ్ ప్లాంటును ఆకస్మాత్తుగా మూసివేసి వరంగల్ కు తరలించేందుకు జరుగుతున్న ప్రయత్నాలు ఉమ్మడి ఖమ్మం వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి.
రోడ్డున పడనున్న పాడి రైతులు
పాల కేంద్రం మూసివేత కేవలం ఒక ప్లాంట్ కు సంబంధించిన విషయం కాదు. దశాబ్దాలుగా ఈ డెయిరీని నమ్ముకుని పాల ఉత్పత్తి చేస్తున్న సుమారు 12 వేల మంది రైతుల జీవనోపాధికి సంబంధించినది. పాల ప్యాకింగ్ యూనిట్ ఇక్కడి నుంచి తరలిపోతే పాల సేకరణపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఈ డెయిరీపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడి బతుకుతున్న వందలాది మంది కార్మికులు, ఉద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా మారనుంది. మరో వైపు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రభుత్వ హాస్టళ్లకు ఖమ్మం కేంద్రం నుంచే పాలు అతి కష్టంగా సరఫరా అవుతున్న పరిస్థితి ఉంది. అలాంటిది వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న వరంగల్ నుంచి రోజూ హాస్టళ్లకు పాలు సకాలంలో ఎలా సరఫరా చేస్తారనేది ప్రశ్న తలెత్తుతోంది. ఈ నిర్ణయంతో విద్యార్థుల్లో సైతం ఆందోళన వ్యక్తమవుతోంది. వరంగల్ నుంచి పాల ప్యాకెట్లు తెప్పించి సరఫరా చేసే క్రమంలో రవాణా భారం, జాప్యం భరించలేక డిస్ట్రిబ్యూటర్లు చేతులెత్తేస్తే క్రమంగా ఆ సరఫరా కాంట్రాక్టులను ప్రైవేట్ డెయిరీలకు కట్టబెట్టే భారీ కుట్ర జరుగుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
అసలు కథ భూముల చుట్టేనా?
డెయిరీ మూసివేత వెనుక ప్రధాన కారణం ఖమ్మం నగర నడిబొడ్డున ఉన్న వందల కోట్ల విలువైన విజయ డెయిరీ భూములే అన్న అనుమానాలు బలంగా వ్యక్తమవుతున్నాయి. గతంలో పనిచేసిన ఒక ఎమ్మార్వో విజయ డెయిరీ భూములను ఖాళీగా ఉన్న భూములుగా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం వెనుక పెద్ద ఎత్తుగడ ఉందనే విమర్శలు ఉన్నాయి. ఇటీవలే హైదరాబాద్ లాలాగూడలోని వేల కోట్ల విలువైన 35 ఎకరాల భూమిని అమెజాన్ సంస్థకు లీజుకు ఇచ్చినట్లు వస్తున్న వార్తలు ఈ అనుమానాలకు మరింత బలంచేకూరుస్తున్నాయి. హైదరాబాద్ తరహాలోనే ఖమ్మం డెయిరీ ఆస్తులను సైతం కార్పొరేట్ సంస్థలకు లేదా రియల్ ఎస్టేట్ బడాబాబులకు కట్టబెట్టేందుకే ప్లాంట్ ను ఖాళీ చేయిస్తున్నారా అన్న సందేహాలు స్థానికుల్లో వ్యక్తమవుతున్నాయి. విజయ డెయిరీ ఆస్తుల పరిరక్షణలో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. భద్రాచలం నడిబొడ్డున ఉన్న సుమారు ఆరు ఎకరాల విజయ డెయిరీ భూములు ఇప్పటికే అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లినా ప్రభుత్వంగానీ, అధికారులుగానీ పట్టించుకున్న పాపాన పోలేదు. మరోవైపు యాభై ఏళ్ల చరిత్ర కలిగిన విజయ డెయిరీ సంస్థకు చెందిన మిల్క్ ప్రొడక్ట్స్ (పాల ఆధారిత ఉత్పత్తులు) తయారీ వ్యవస్థను జనగామలోని ఓ ప్రైవేట్ ‘శక్తి డెయిరీ’కి అప్పగించడం చూస్తుంటే ప్రభుత్వరంగ సంస్థను క్రమంగా నిర్వీర్యం చేస్తున్నారనేది స్పష్టమవుతోంది. ప్యాకింగ్ యంత్రాలు పాతబడిన కారణంగానే ఖమ్మం ప్లాంటును మూసివేస్తున్నామని, ఇకనుంచి వరంగల్ ప్లాంట్ నుంచి ఖమ్మం జిల్లాకు పాల ప్యాకెట్లు సరఫరా చేస్తాం అని అధికారులు పేర్కొంటున్నారు. కానీ, ఇక్కడే అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. వాస్తవానికి ఖమ్మం ప్యాకింగ్ ప్లాంట్ కన్నా వరంగల్ ప్లాంట్ ఎన్నో ఏళ్లు పాతది. కొత్త యంత్రాలు కొనుగోలు చేసి లాభాల్లో ఉన్న ఖమ్మం ప్లాంట్ ను ఆధునికీకరించాల్సిందిపోయి పాత యంత్రాలు ఉన్న వరంగల్ కు ప్యాకింగ్ ను తరలించడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇతర జిల్లాల డెయిరీలతో పోలిస్తే ఎంతో మెరుగ్గా, లాభాల్లో నడుస్తున్న ఖమ్మం డెయిరీని కాపాడుకోవాల్సిన బాధ్యత స్థానిక ప్రజాప్రతినిధులు, ముగ్గురు మంత్రులపై ఉందని ప్రజల నుంచి డిమాండ్లు వస్తున్నాయి. ప్రధానంగా వ్యవసాయ శాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న పాల ఆధారిత ఉత్పత్తులు ప్లాంట్ మూసివేతపై బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన చేసిన విషయం విదితమే. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఖమ్మం ప్లాంట్ మూసివేత నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, అవసరమైన నిధులు మంజూరు చేసి ఇక్కడే నూతన యంత్రాలను ఏర్పాటు చేయాలని పాడి రైతులు, కార్మిక సంఘాలు కోరుతున్నాయి.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





