తొడ‌గొట్టి తోక‌ముడిచిన మంత్రులు

– మూడు గంట‌లు వేచి ఉన్నా అడ్ర‌స్‌ లేని జూప‌ల్లి
– మేం గ‌న్ పార్కుకు వెళ్ల‌కుండా నాట‌కాలు ఆడారు
– హ‌రీష్‌రావు, ఇత‌ర నేత‌ల్ని అరెస్టు చేయ‌డం సిగ్గుమాలిన చ‌ర్య‌
– ప్ర‌త్యేక అసెంబ్లీ స‌మావేశాలు పెట్టండి
– ప్ర‌జ‌ల ప‌క్షాన ప్ర‌భుత్వాన్ని నిత్యం నిల‌దీస్తూనే ఉంటాం
– బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూలై 2: అప్పులపై చర్చకు సిద్ధమని సవాళ్లు విసిరిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన మంత్రులు తీరా సమయం వచ్చేసరికి తోకముడిచి పారిపోయారని బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సవాల్ విసిరి చేతకాక పారిపోయిన ఈ సన్నాసుల బాగోతాన్ని ఇవాళ రాష్ట్ర ప్రజలంతా కళ్లారా చూశారని మండిపడ్డారు. తానే స్వయంగా తెలంగాణ భవన్ కు వస్తున్నానని ప్రగల్భాలు పలికిన మంత్రి జూపల్లి కృష్ణారావు కోసం ప్రత్యేకంగా కుర్చీ వేసి శాలువాతో మూడు గంటలపాటు వేచి చూసినా రాలేదన్నారు. మంత్రి రాకుండా మొహం చాటేయడంతోపాటు మరో చోట డ్రామాకు తెరలేపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరికి గన్ పార్క్ వద్ద చర్చకు సిద్ధమై బయలుదేరిన హరీశ్ రావును ఇతర నేతల్ని అరెస్టు చేయడం, త‌మ‌ను అడుగడుగునా అడ్డుకోవడం సిగ్గుచేటు అని కేటీఆర్ ఫైర్ అయ్యారు. అక్కడ కూర్చుని మంత్రులు సవాళ్లు విసరడం, ఇక్కడ పోలీసులను పెట్టి అడ్డుకోవడం ఈ ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శన‌మ‌న్నారు. కంచన్ బాగ్ పోలీస్ స్టేషన్‌లో కు తరలించిన నేతలను పరామర్శించేందుకు కూడా వెళ్లనీయ‌కుండా అడ్డుకోవడం దుర్మార్గమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రికి, మంత్రులకు నిజంగానే చర్చించే దమ్ముంటే వెంటనే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయాలని కేటీఆర్ సవాల్ విసిరారు. సభలో మైక్ కట్ చేయకుండా తమకు మాట్లాడే అవకాశం ఇస్తే ఈ ప్రభుత్వ రెండున్నరేళ్ల డొల్లతనాన్ని, అవినీతి బండారాన్ని మొత్తం బట్టబయలు చేస్తామని స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన అబద్ధపు హామీలు, పరిపాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రభుత్వం నిత్యం ప్రయత్నిస్తోందని, ఇలాంటి శిఖండి రాజకీయాలను ప్రజలు సహించరని హెచ్చరించారు. రెండున్నరేళ్లలో అనుముల బ్రదర్స్ రాష్ట్రాన్ని నిలువునా దోచుకుంటున్నారని, అదానీని మించిన ఆస్తులు కూడబట్టారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ప్రస్తుతం సాగుతున్నది ప్రజా పాలన కాదని, రాక్షస పాలన అని కేటీఆర్ విమర్శించారు. ఎక్సైజ్ శాఖలో హోలోగ్రామ్ టెండర్లలో మంత్రి కొడుకు, సీఎం అల్లుడి పంచాయతీ భరించలేకే ఐఏఎస్ అధికారి రిజ్వీ రాజీనామా చేశారని, బీర్ల కోసం తెచ్చిన జీవోపై జూపల్లికి కనీస అవగాహన లేదని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పాలనలో కేవలం 2.80 లక్షల కోట్ల అప్పు చేసిందని ఆర్బీఐ, కాగ్ లెక్కలు చెబుతుంటే సీఎం, డిప్యూటీ సీఎంలు పొంతన లేని కాకి లెక్కలతో ప్రజలను మభ్యపెడుతున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ‘ఆర్ఆర్ టాక్స్’ వసూలు చేస్తున్నారని స్వయంగా ప్రధానమంత్రి మాట్లాడినా ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని బీజేపీని ప్రశ్నించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై జరిగిన ఈడీ దాడుల విచారణ ఏమైందో బండి సంజయ్ సమాధానం చెప్పాలన్నారు. అమృత్ టెండర్లలో జరిగిన భారీ అవినీతిపై ఎందుకు విచారణ జరపడం లేదని, కాంగ్రెస్ సర్కారులో బీజేపీ ఎంపీలకు కాంట్రాక్టులు ఎలా దక్కుతున్నాయో సమాధానం చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. సీఎం, మంత్రులు ఇవాళ పారిపోయినా వదిలిపెట్టే ప్రసక్తే లేదని, నాలుగు కోట్ల ప్రజల పక్షాన నిత్యం ప్రజాక్షేత్రంలో నిలదీస్తూనే ఉంటామని కేటీఆర్ స్పష్టం చేశారు. నిన్న ఒకే వేదికపై ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం పొంతన లేని గణాంకాలు చెప్పి అడ్డంగా దొరికిపోయారని ఎద్దేవా చేశారు. గతంలో నోట్ల కట్టలతో దొరికిన రేవంత్ కు రాష్ట్రంలో విశ్వసనీయతే లేదన్నారు. కోటి ఎకరాలను నిషేధిత జాబితాలో పెట్టి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. పొంగులేటి కుమారుడు వట్టినాగులపల్లిలో కంపెనీలపై పడి భూములను దోచుకుంటున్నారని ఆరోపించారు. తాము హైదరాబాద్‌లో లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టాం.. దమ్ముంటే పొంగులేటి లక్షా ఒకటో ఇల్లు కట్టి చూపించాలని సవాల్ విసిరారు. 6 గ్యారంటీలు 420 హామీలు 14 డిక్లరేషన్ల పేరిట రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను రేవంత్ సర్కార్ చేసిన ద్రోహాన్ని ఎండగడతామని తెలిపారు. త్వరలోనే రైతు సంగ్రామ సదస్సులు, యువజన, విద్యార్థి సదస్సుల ద్వారా కాంగ్రెస్ మోసాలను ఎక్కడికక్కడ నిలదీసి ప్రజలను చైతన్యవంతం చేస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు.

5000 ఉద్యోగాలకే నోటిఫికేషన్ అని మోసం చేస్తోంది 

రాష్ట్రంలో 20 వేల పోలీసు ఉద్యోగ ఖాళీలు ఉంటే కేవలం 5000 ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్ వేస్తామని ప్రభుత్వం దారుణంగా మోసం చేస్తున్న‌దని పోలీసు ఉద్యోగాల అభ్యర్థులు మండిపడ్డారు. వందలాదిమంది అభ్యర్థులు తెలంగాణ భవన్ కు తరలివచ్చి కేటీఆర్ ను కలిశారు. పోలీసు ఉద్యోగ నోటిఫికేషన్ కోసం రెండున్నరేళ్లుగా తాము కోచింగ్ తీసుకుని సిద్ధమైతే ప్రభుత్వం తూతూమంత్రంగా నోటిఫికేషన్ వేసి చేతులు దులుపుకునే కుట్ర చేస్తున్న‌దని ఆయ‌న‌ దృష్టికి తెచ్చారు. నిరుద్యోగుల నిరసనలతో అశోక్ నగర్ చిక్కడపల్లితోపాటు దిల్ సుఖ్ నగర్ రగిలిపోతున్న‌దని, ప్రభుత్వం నిరుద్యోగులను ఉక్కుపాదంతో అణచివేస్తున్న‌దని మండిపడ్డారు. నిరుద్యోగులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని, ఓసారి మీరు కూడా దిల్ సుఖ్ నగర్ కు రావాలని కోరారు. ఈ రెండున్నరేళ్లలో నిరుద్యోగుల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉన్నామని, తప్పకుండా దిల్ సుఖ్ నగర్ కు వస్తానని కేటీఆర్ హామీ ఇచ్చారు. తొలి ఏడాదే రెండులక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని మాట ఇచ్చిన రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు తీరని ద్రోహం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా కేంద్రం మెడలు వంచి కేసీఆర్ 95 శాతం లోకల్ రిజర్వేషన్ సాధించారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో భర్తీ చేసిన 65 వేల ఉద్యోగాలను కూడా తమ ఖాతాలో వేసుకునే నీచానికి ఈ ముఖ్యమంత్రి ఒడికట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే 20వేల పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *