సెల్ఫ్ గోల్ కొట్టిన‌ ప్ర‌భుత్వం

– మాట త‌ప్పిన జూప‌ల్లి రాజీనామా చేయాలి
– గురుకుల టెండ‌ర్ల‌లో అవ‌క‌త‌వ‌క‌ల‌పై ఆధారాల‌తో మాట్లాడాం
– ఫోన్ చేస్తే మంత్రులు స‌మాధానం చెప్ప‌లేదు
– ఒక శాఖ‌పై మ‌రో శాఖ కోర్డుకు వెళ్లే దుస్థితి
– మాజీ మంత్రి హ‌రీష్‌రావు

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూలై 2: ‘ఈ ప్రభుత్వం సవాళ్లు విసిరి చివరకు తోక ముడిచింది.. గోల్ కొడతామనుకుని సెల్ఫ్ గోల్ కొట్టుకున్నారు. జూపల్లి కృష్ణారావు రూ.8 లక్షల కోట్ల అప్పు చేశారని ఆరోపిస్తూ తెలంగాణ భవన్‌కు వచ్చి సవాల్ విసిరారు.. కేటీఆర్, తాను తెలంగాణ భవన్‌లో ఉంటే చర్చకు రాలేద’ని హ‌రీష్‌రావు విమ‌ర్శించారు. గురువారం ఆయ‌న విలేక‌ర్ల‌తో మాట్లాడుతూ చీమూ నెత్తురు ఉంటే, పాలమూరు పౌరుషం ఉంటే జూపల్లి రాజీనామా చేయాలన్నారు. నిన్న రూ.8 లక్షల కోట్ల అప్పు అన్నారు… ఈరోజు రూ.7 లక్షల కోట్ల అప్పు అంటున్నారు. జూపల్లి మాట తప్పారు.. రాజీనామా చేయాల్సిందేన‌న్నారు. సబ్జెక్ట్ లేకుండా, పస లేకుండా సవాల్ విసిరి చివరకు తోక ముడిచారు. అప్పులపై గతంలోనే అసెంబ్లీ సాక్షిగా తాము లెక్కలు చెప్పాం. తోక ముడిచింది మీరే.  పోలీసులను పెట్టి చర్చను అడ్డుకున్నారు. గురుకుల టెండర్లలో అవకతవకలు జరిగాయని నేను, ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్, కొప్పుల ఈశ్వర్ ఆధారాలతో మాట్లాడాం. అడ్లూరి లక్ష్మణ్ మొదట ప్రెస్ క్లబ్‌కు వస్తానన్నారు. తర్వాత హరీశ్ రావే రావాలని షరతులు పెట్టారు. తాము సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌కు రావడానికి సిద్ధమైతే పోలీసులు అడ్డుకున్నారు. మమ్మల్ని గన్‌పార్క్‌కు కూడా రానివ్వలేదు. అజారుద్దీన్, అడ్లూరి లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్‌లకు ఫోన్ చేస్తే ఫోన్ కూడా ఎత్తలేదు. టెండర్లలో అవినీతి జరిగిందని తేటతెల్లమైంది. కంచన్‌బాగ్ పోలీస్ స్టేషన్ లో కుర్చీలు ఏర్పాటు చేసినా చర్చకు రాలేదు. ప్రభుత్వం చర్చకు సిద్ధంగా లేదు. అవినీతి చేసినందుకే పోలీసులను అడ్డుపెట్టుకుని తప్పించుకుంది. అడ్లూరి లక్ష్మణ్ గారు పూటకో మాట మాట్లాడుతున్నారు. కాళేశ్వరం ఖర్చు 84 వేల కోట్లు అయితే, లక్ష కోట్ల అవినీతి అంటూ దుష్ప్రచారం చేశారు. మేము రూ.2,000 కోట్ల టెండర్లలో స్కాం జరిగిందంటే… మీరు ముందుగా రూ.687 కోట్లు, తర్వాత రూ.1,142 కోట్లు అన్నారు. గురుకుల కిరాణా టెండర్లు రూ.800 కోట్లకు పిలిచారు. పత్రికల్లో రూ.200 కోట్ల గోల్‌మాల్ జరిగిందని వచ్చింది. ఈ టెండర్ విధానంపై కొందరు కోర్టును ఆశ్రయించారు. మొదటి నుంచే పిల్లలు తినే ఆహారం, గుడ్ల కొనుగోళ్లలో కూడా స్కాం జరిగిందని చెబుతున్నాం. పామాయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్, గరం మసాలా వంటి వస్తువులను అధిక ధరలకు కొనుగోలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 2017లో చేనేత కార్మికులకు ఉపాధి కల్పించేందుకు జీవో తీసుకొచ్చింది. పోలీసు, పాఠశాల, గురుకుల యూనిఫాంల ఆర్డర్లు టెస్కోకే ఇవ్వాలనే నిబంధన ఉండేది. కాంగ్రెస్ ప్రభుత్వం ఆ నిబంధనలను ఉల్లంఘించి పెద్ద కాంట్రాక్టర్లకు టెండర్లు ఇచ్చింది. దీనిపై కోర్టుకు వెళ్తే చేనేత కార్మికుల జీవనోపాధిని దృష్టిలో పెట్టుకుని ఆర్డర్లు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన జీవోను అమలు చేయాలని న్యాయమూర్తి నందా ఆదేశించారు. అయినా అమలు చేయకపోవడంతో వీరాంజనేయ హ్యాండ్‌లూమ్ సొసైటీ మళ్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో కూడా హైకోర్టు చేనేత కార్మికుల జీవనోపాధిపై దెబ్బ కొట్టొద్దని స్పష్టం చేసింది. కమిషన్ల కోసం ప్రభుత్వం ఇప్పటికే ఇచ్చిన ఆర్డర్లను వెనక్కి తీసుకుంది. ఆర్డర్లను రద్దు చేసిన చర్య తప్పని హైకోర్టు వ్యాఖ్యానించింది. కొండా సురేఖ  కూడా ముఖ్యమంత్రికి లేఖ రాశారు. వేలాది చేనేత కార్మికులు రోడ్డున పడతారని లేఖలో పేర్కొన్నారు. దయాపూర్వక పరిశీలన కోరినా ప్రభుత్వం పట్టించుకోలేదు. రేవంత్ రెడ్డికి గుజరాత్ దళారులపై ఉన్న దయ.. చేనేత కార్మికులపై లేదు.. “మఫత్‌లాల్ ముద్దు.. చేనేత వద్దు” అన్నదే ప్రభుత్వ వైఖరి. బీఆర్ఎస్ ప్రభుత్వం 2022లో జీవో నెం.110 తీసుకొచ్చింది. ఆ జీవో ప్రకారం బట్టలు, బూట్ల కొనుగోళ్లు లిడ్‌క్యాప్ ద్వారా జరగాలి. ఒక శాఖ మరో శాఖపై కోర్టుకు వెళ్లే పరిస్థితి ఏర్పడింది. ఇదే స్కాంకు నిదర్శనం. లిడ్‌క్యాప్ నుంచి ఆర్డర్లు లాక్కొని దళిత బిడ్డలను మోసం చేశారు. కేసీఆర్ హయాంలో మాకే ఆర్డర్లు ఇచ్చేవారని లిడ్‌క్యాప్ లేఖ రాసింది. అలాంటప్పుడు స్కాం జరగలేదని అడ్లూరి లక్ష్మణ్ గారు ఎలా చెబుతారు? బీఆర్ఎస్ మద్దతుతోనే మీరు జడ్పీ చైర్మన్ అయ్యారు. శ్రీధర్ బాబుకు కూడా లిడ్‌క్యాప్ లేఖ రాసింది. పీఎంయూ చైర్మన్‌కూ లేఖ రాసి దళిత బిడ్డల నోరు కొట్టొద్దని విజ్ఞప్తి చేసింది. ప్రభుత్వం ఇచ్చిన జీవోను తుంగలో తొక్కింది. దళిత మంత్రి, శ్రీధర్ బాబు, పీఎంయూ చైర్మన్ పట్టించుకోలేదు. గుజరాత్ దళారులకు ఆర్డర్లు కట్టబెట్టారు. చివరకు దళిత బిడ్డలు హైకోర్టుకు వెళ్లాల్సి వచ్చింది. హైకోర్టు చెప్పిన తర్వాతే 10 శాతం ఆర్డర్లు ఇచ్చారు. చెప్పుడేమో ఘనం.. చేతలేమో శూన్యం. చేవెళ్ల డిక్లరేషన్‌లో ఎస్సీ, ఎస్టీలకు టెండర్లు, ప్రొక్యూర్‌మెంట్‌లో రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి మోసం చేశారు. మీ ఎస్సీ, ఎస్టీ చేవెళ్ల డిక్లరేషన్ కాకి ఎత్తుకుపోయిందా? కేసీఆర్ వైన్ షాపులు, ఇరిగేషన్, ఆసుపత్రుల టెండర్లలో రిజర్వేషన్లు కల్పించారు.. మరి మీరు చర్చకు ఎందుకు రావడం లేదు? నోట్‌బుక్స్ కొనుగోళ్లలో రూ.150 కోట్ల కమిషన్ కోసం వాటర్‌మార్క్ నిబంధన పెట్టారు. మేము బయటపెట్టడంతో టెండర్లు రద్దు చేశారు. ఇప్పటికీ పాఠశాలలకు నోట్‌బుక్స్ అందలేదు. సీఎం, ఐఏఎస్ అధికారుల పిల్లలు కూడా నోట్‌బుక్స్ లేకుండా పాఠశాలలకు వెళ్తారా? మీ వల్ల పిల్లల చదువులు దెబ్బతింటున్నాయి. ఈ ప్రశ్న అడగడం తప్పా? ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ గట్టిగా ప్రశ్నిస్తున్నారని ఆయన భార్య లక్ష్మీభాయిని బదిలీ చేశారు. శ్రీధర్ బాబు సతీమణి మా ప్రభుత్వంలో పనిచేశారు.. మేము ఇలా చేశామా? ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ గారి భద్రతను తగ్గించారు. రిటైర్ అయ్యే ఏడాది ముందు ఆయన భార్యను ఉద్దేశపూర్వకంగా బదిలీ చేశారు.  గురుకులాల్లో చదివే 6 లక్షల మంది పిల్లల కోసం, ఎస్సీ, ఎస్టీ బిడ్డల భవిష్యత్తు కోసం బీఆర్ఎస్ పోరాటం చేస్తుంద‌న్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *