ఆదిలాబాద్‌ ‌నుండి నిర్మల్‌ ‌బస్‌ ‌పయనంలో మూడు గంటల సేపు ముచ్చెమట్లు పట్టించిన మహబూబ్‌ ‌ఘాట్‌ ‌రోడ్డు

కాకతీయ కలగూర గంప – 28
నాగపూర్‌ ‌నుండి హైదరాబాద్‌ ‌వచ్చే జాతీయ రహదారి ఎన్‌ ‌హెచ్‌ 44 ‌పైనే ఆదిలాబాద్‌, ‌నిర్మల్‌ ‌పట్టణాలు ఉంటాయి. పూర్వం దక్షిణాది నుంచి ఉత్తర భారతదేశంలోని ముఖ్యమైన ప్రదేశాలకు చేరడానికి రహదారి గా ప్రయాణికులు ఉపయోగించిన మార్గమే నేటి ఎన్‌ ‌హెచ్‌ 44 అశోక చక్రవర్తి కాలం నుండి ఈ రహదారి వాడుకలో ఉంటుందని స్థానికులు నమ్ముతారు. తరువాత కాలంలో చివరి నిజాం అయిన మీర్‌ ఉస్మాన్‌ అలీ ఖాన్‌ ‌కాలంలో, 1932 లో కావచ్చు ‘‘ఘాట్‌ ‌విభాగం’’ ఏర్పడింది. కొండను ముక్కలు చేయడానికి వందలాది మంది కార్మికులు కొన్ని నెలలు శ్రమించారు.నిర్మల్‌ ‌టౌన్‌ ‌నుండి 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న సహ్యాద్రి కొండల పరిధిలో ఉన్న 3 కిలోమీటర్ల ఈ ఘాట్‌ ‌రోడ్‌ ‌ను ‘మహబూబ్‌ ‌ఘాట్‌ ‌రోడ్‌’ ‌గా పేర్కొన్నారు. అనేక వంపులతో ఒక నెక్లెస్‌ ‌లాగా సుందరం గా వుంటుంది. అందుకే ప్రకృతిని ప్రేమించే ‘ప్రేమికుడు’ (మహబూబ్‌) అని పేరు పెట్టారు.
1990 దాకా హైదరాబాదు నగరంలో సుదీర్ఘ కాలం (28 యేండ్లు) పని చేసిన పిదప ఎట్టకేలకు ప్రమోషన్‌ ‌మీద హైదరాబాదు వదలి బయటకు పోవల్సి రావడం జరిగింది. అందులోనూ ఆదిలాబాదుకు. అంటే జనాల రణగొణల మధ్యనుంచి వన జీవన పక్షుల సావ్య కుహూకుహూరవాల వైపన్నమాట. హైదరాబాదు నగరమంటే అది ఒక నందన వనంలాంటిది 1980 దాకా. ఎప్పుడైతే 1969 తెలంగాణా ఉద్యమం ఆగిపోయిందో, ముల్కీ రూల్స్ ‌పోయి ఆరు సూత్రాల లోకల్‌-‌నాన్‌ ‌లోకల్‌ ‌నిబంధనలు వచ్చాయో క్రమంగా ఇక్కడి వాళ్ళే నాన్‌ ‌లోకల్‌ ‌స్ఠితికి రావడం హైదరాబాద్‌ ‌రూపు రేఖలు మారడం ప్రారంభమైంది. నందన వనం నుండి తుమ్మలవనం లాగా తయారవుతూ వచ్చింది.చారిత్రిక నౌబత్‌ ‌పహాడ్‌ ‌పై బిర్లా వెంకటేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. ఫ్రజలు సేదదీరే పబ్లిక్‌ ‌పార్కులో విశ్వవిద్యాలయం వెలిసింది. మూసీ నది కడ్డంగా బస్సు స్టాండ్‌ ‌వచ్చింది. హైదరాబాద్‌ ‌గుండె చప్పుడు ఆల్విన్‌ ఆగి పోయింది. అడిగేవాడు లేడు కనుక అంతా మనదే అన్న వ్యవహారమొచ్చింది. నాలుగు టెన్నిస్‌ ‌కోర్టులతో పిల్లలకు టెన్నిస్‌ ‌నేర్పించే లిబర్టీ దగ్గరి లేడీ హైదరీ క్లబ్బు మాయమైంది. హైదరాబాదు నందన వన సువాసనలు కాంక్రీట్‌ ‌భవనాల సిమెంట్‌ ‌వాసలను తోడు తెచ్చుకున్నాయి.ఏమైతేనేం హైదరాబాద్‌ 1997 ‌లో వదిలి పెట్టాల్సివచ్చింది. ఏ మాత్రం బాధపడకుండా జనారణ్యాన్ని వదలి వనారణ్యం చేరుకున్నాను.ఆదిలాబాద్‌ ‌కాదది నిజమైన ఆహ్లదాబాద్‌. ‌తెలుగు – మరాఠీ సంస్కృతుల సమ్మేళనం. అమాయకత్వపు బీదతనం. అప్పుడప్పుడే పురి విప్పుతున్న రాజకీయ చైతన్యం. అన్యాయాన్ని,మోసాలను ప్రశ్నించే ధీరత్వం.మా పాలిటెక్నిక్‌ ‌భవనం కూడా కొత్తగా ఊరి బయట కట్టబడింది. వసతి కుదిరింది కాని భోజనానికి, కొంత ఇబ్బంది పడ్డాను.ఇక ఇప్పుడు చెప్పబోయే సంఘటన ఇంకా పాతది. 1978 లో ఆదిలాబాద్‌ ‌లో ప్రభుత్వ పాలిటెక్నిక్‌ ‌నెలకొలిపారు. అది అద్దె భవనంలో పనిచేసేది.
ఇకపోతే 1984 లో సాంకేతిక విద్యాశాఖ (డిపార్ట్ ‌మెంట్‌ ఆఫ్‌ ‌టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌) ‌నుండి పరీక్షా విభాగాన్ని విడదీసి ప్రత్యేకంగా ఒక బోర్డ్ ‌ను ఏర్పరచారు. దీనిని సింపుల్‌ ‌గా ‘టెక్నికల్‌ ‌బోర్డ్’ అం‌టారు. అసలు పేరు ‘‘స్టేట్‌ ‌బోర్డ్ ఆఫ్‌ ‌టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ అం‌డ్‌ ‌ట్రైనింగ్‌’’.అది నెలకొల్పినప్పటి నుండి నేను 2006 లో రిటైర్‌ అయ్యే వరకు ఇందులో పనిచేసిన అధికారులు, క్రింది స్థాయి సిబ్బంది అత్యంత అనుభవజ్ఞులు, నీతిమంతులు. పద్ధతి ప్రకారం పనిచేసే నూతన విధానాల రూప కల్పనలో నిష్ణాతులు. 1985 నుండి ప్రతి సంవత్సరం ప్రభుత్వ పాలిటెక్నిక్‌ ‌లలో ప్రవేశానికి గాను రాష్ట్రంలో ప్రత్యేక పరీక్ష ‘సీప్‌’ (‌కామన్‌ ఎం‌ట్రన్స్ ఎగ్జామినేషన్‌ ‌ఫర్‌ అడ్మిషన్‌ ‌టు పాలిటెక్నిక్స్) ‌నిర్వహించాలని నిర్ణయించారు. 1985 లో నిర్వహించే పరీక్షకు గాను ప్రశ్నాపపత్రాలను ఆయా జిల్లాల పాలిటెక్నిక్‌ ‌సెంటర్‌ ‌లకు తరలింపుకు గాను రాష్ట్రంలో నాలుగు ‘రూట్‌’ ‌లు ఏర్పరచి ప్రతి రూట్‌ ‌కు బాధ్యత గల అధికారి ని రూట్‌ ఆఫీసర్‌ ‌గా నియమించారు. అందులో నేను ఒకడిని. తెలంగాణకు చెందిన కొన్ని పాలిటెక్నిక్‌ ‌సెంటర్‌ ‌లకు అందజేసే మా రూట్‌ (‌మార్గం) లో ఆదిలాబాద్‌ ఒకటి. ప్రతి రూట్‌ ‌కు ఒక ప్రత్యేక ఆర్టీసీ బస్సు. ఇద్దరు డ్రైవర్లు. ఇద్దరు పోలీస్‌ ‌కానిస్టేబుల్లు. బోర్డ్ ‌నుండి ఆఫీసు సూపరింటెండెంట్‌ ‌ర్యాంక్‌ ‌గల అసిస్టెంట్‌ ‌రూట్‌ ఆఫీసర్‌. ఒక బోర్డు క్లర్క్. ఒక సహాయకుడు. పరీక్షా కేంద్రాల ప్రకారం సీల్‌ ‌వేసిన ప్రశ్నాపత్రాల క్లాత్‌ ‌బండిళ్లను బస్సులో వెనుక భాగాన అమర్చి ముందు సీట్ల లో మేము కూర్చున్నాము. రూల్‌ ఏమంటే రాత్రి 11 తరువాత పయనించరాదు. దగ్గరగా వున్న పోలీస్‌ ‌స్టేషన్‌ ‌వద్ద ఆగాలి. బస్‌ ‌దిగి బయట పడుకోరాదు.
ఆదివారం పరీక్ష. గురువారం పొద్దున 6 గంటలకు మా బోర్డు సెక్రటరీ గారు జండా వూపి సాగనంపారు.ఇక విషయానికి వస్తే ఆ రోజు సుమారు 4 గంటలకు ఆదిలాబాద్‌ ‌చేరుకున్నాము. 5 గంటలకు తిరిగి బయలుదేరాము. తరువాత పోవలసినది కరీంనగర్‌ ‌కు. అక్కడి వాళ్లు ఉట్నూర్‌, ‌జన్నారం మార్గము వద్దన్నారు. ఎందుకంటే దాదాపు గంటసేపు దట్టమైన అడవిలోపోవాలి. చీకటి పడే టైమ్‌. ‌నిర్మల్‌ ‌మార్గంలో పొమ్మన్నారు. సరే అని బయలుదేరాము.మహబూబ్‌ ‌ఘాటు రోడ్డు పై సగం దూరం పయనించాక ఒక వంపులో ఒక లారీ అడ్డంగా పడి వుంది. దానిపైన వున్న ఇనుప సామాను లారీ పక్కగా పడి రోడ్డు మొత్తం మూసి వేయ బడింది. ఇటు వైపు నుండి మాదే మొదటి వాహనం. ఇక అటువైపు నిర్మల్‌ ‌నుండి మూడు నాలుగు కార్లు ఆగివున్నాయి. మెల్లి మెల్లగా ఒక్కొక్క కారు మా బస్‌ ‌వెనకాలకు చేరడం మొదలైంది. గుండె జల్లుమంది.
చెమటలు మొదలయ్యాయి. పడివున్న లారీ డ్రైవర్‌, అతని సహాయకుడు అక్కడ పడివున్న ఇనుప సామాను పక్కకు నెట్టి వేస్తున్నారు. వెంటనే మా వాళ్లతో మాట్లాడాను. ఒక డ్రైవర్‌, ‌కానిస్టేబుల్‌ ‌తప్ప అందరం కిందకు దిగి మా బస్‌ ‌వైపు పడి వున్న సామానును జరుపుతూ మా డ్రైవర్‌ ‌ను మెల్లిగా లారీ పక్కకు సగం దూరం వచ్చేట్లు చేశాం. మా బస్‌ ‌డ్రైవర్‌ ‌కూడా లారీ పక్కగా మా బస్సును ముందుకు తీసుకువచ్చాడు. ‘అమ్మయ్య’ అనుకున్నా. లేకుంటే అటువైపు నుండి కార్లు రావడం మొదలైతే ఎప్పుడు మాకు క్లియరెన్స్ ‌వస్తుందో తెలియదు. మరో అరగంటలో మా బస్‌ ఇటువైపు వచ్చింది. అప్పటికే రాత్రి 8 అవుతుంది. నేరుగా నిర్మల్‌ ‌పోలీస్‌ ‌స్టేషన్‌ ‌చేరి ఆ రాత్రి అక్కడే వుండి మరుసటి రోజు ఉదయం 5 గంటలకు మా పయనం ప్రారంభించాము. మిగతా కార్యక్రమం అంతా సవ్యంగా జరిగింది.ఇక్కడ రెండు విశేషాలు. ఒకటి మా బస్‌ అన్నిటి కంటే ముందు వుండడం. ఇది కాల మహిమ. ఇక రెండవది మా బస్సును ముందుగా ఖాళీ అవుతున్న ప్రదేశంలోకి పంపించడం. ఇది సమయస్ఫూర్తి.
– శ్రీమతి పాములపర్తి చంద్రకీర్తి
– పాములపర్తి నిరంజన్‌ ‌రావు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page