గొంతు మీద కత్తి పెట్టి, చర్చలు చేయాలంటే ఇండియా చేయదు. అనుకూల వాతావరణం వచ్చే వరకు ఆగి, ఆ తరువాత భారత్ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని ఒప్పందాలు చేసుకుంటాము- అన్నారు కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్. అమెరికా అధ్యక్షుడు తొంభై రోజుల టారిఫ్ విరామానికి స్పందిస్తూ ఆయన అన్నమాటలు అవి. కాంగ్రెస్ వైపు నుంచి తాజాగా వచ్చిన ‘బూటకపు జాతీయవాదం’ అన్న విమర్శను ఎదుర్కొనడానికి అన్నారో లేదా నిజంగా కడుపుమండి అన్నారో కానీ, అమెరికా వంటి అగ్రరాజ్యాన్ని ఉద్దేశించి మన మంత్రిగారు అంత మాట అనగలగడం ఆశ్చర్యమే. ఎదుటిపక్షం నుంచి బలప్రయోగపు ఒత్తిడి మధ్య, డీల్స్ కుదిరించుకోవాలంటే ఎట్లా అన్నది,ఎప్పుడూ బలహీను లవైపు నుంచి వచ్చే న్యాయమైన ప్రశ్న. ఒక పక్కన శాంతి చర్చలు జరుగుతుండగా మరోపక్కన గాజా మీద బాంబుల వర్షం కురిపించే ఇజ్రాయిల్ తీరే న్యాయమని బలవంతుల వాదన! శాంతి, సామరస్యం, సంధి అన్న విలువలు అసమా నుల మధ్య ఒకరికి మనుగడ అవసరంగా, మరొకరికి ఆధిక్యస్థిరీకరణ సాధనంగా ముందుకు వస్తాయి. యుద్ధంలో పైచేయిగా ఉన్నవారు కూడా సంధిని కోరుకోవలసి వచ్చే సందర్భాలు చరిత్రలో చాలా అరుదుగా మాత్రమే ఉంటాయి.
ఇటీవలి కాలంలో చత్తీస్గఢ్లో జరుగుతున్న వరుస ఎన్ కౌంటర్లు, అందులో మావోయిస్టులతో పాటు పెద్దసంఖ్యలో అమాయక ఆదివాసులు ఉంటున్నట్టు వస్తున్న వార్తలు సహజంగానే దేశవ్యాప్తంగా ప్రజాస్వామిక వాదులను కలవరపరుస్తున్నాయి. విప్లవకారుల ఆచరణతో, ప్రభుత్వం చేసే నిర్బంధంతో భౌతికమైన, బౌద్ధికమైన పరిచయం, సంబంధం లేని వారికి కూడా కొద్దికాలంలోనే భద్రతా దళాల కాల్పుల్లో 400 మందికి పైగా చనిపోవడం విచారం కలిగించే విషయం. అదంతా సహజమని కళ్లు మూసుకుని కూర్చోవడానికి సమాజపు అంతరాత్మ ఎల్లకాలం సిద్ధపడదు. మార్చి నెలలో హైదరాబాద్లో పౌరసమాజ ముఖ్యులు కొందరు ముందుకు తెచ్చిన శాంతిచర్చల ప్రతిపాదనకు, మావోయిస్టులు స్పందించారు, మావోయిస్టుల ప్రకటనకు చత్తీస్గఢ్ హోంశాఖమంత్రి విజయ్ శర్మ ప్రతిస్పందించారు. ప్రతిపాదనను స్వాగతించారు. షరతులు కుదరవన్నారు. మావోయిస్టుల నుంచి రెండో లేఖ కూడా వచ్చింది. దానిపై స్పందిస్తూ, మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి రావడానికి ఇష్టపడితే, బేషరతు చర్చలకు ప్రభుత్వం సిద్ధమని విజయశర్మ అన్నారు. ప్రభుత్వం చర్చల కోసం ఏ కమిటీని ఏర్పాటు చేయదని, మావోయిస్టులు తమకు ఇష్టమైన మార్గాల ద్వారా చర్చలకు రావచ్చునని చెప్పారు. హైదరా బాద్ లో ప్రారంభమైన శాంతిచర్చల ప్రతిపాదన, ఇప్పుడు జాతీయస్థాయికి విస్తరించింది. పేరుపొందిన మేధావులు, రచయితలు, పాత్రికేయులు ఈ ప్రతిపాదనను ముందుకు తీసుకుపోయే ప్రయత్నంలో భాగం అవుతున్నారు.
ఇప్పుడు రక్తపాతాన్ని నివారించడానికి, ‘ఆపరేషన్ల’ నేపథ్యంలో ఆదివాసుల అస్తిత్వాన్ని కాపాడడానికి శాంతి ప్రతిపాదకులు బలమైన నైతిక ప్రాతిపదికలను నిర్మించాలి. సంధి కోరేవారు మనసావాచా సాయుధపక్షాల మధ్య తటస్థులుగా ఉండాలి. ఆదివాసీల ప్రాణాలకు, ఉనికి కి, వనరులకు మాత్రమే నిబద్ధులుగా ఉండాలి. నిర్మూలన పేరుతో జరుగుతున్న దాడులు, చర్యలు ఏ మాత్రం మానవీయ విలువలకు అనుగుణమైనవి కావని, ఉద్రిక్తతలను, హింసను తగ్గించడానికి ఇతర నాగరక మార్గాలను అన్వేషించాలని చెప్పాలి.
కేవలం భద్రతాచర్యలు మాత్రమే జరుగుతున్నప్పుడు పోలీసు అధికారులు మాత్రమే మాట్లాడేవారు. శాంతి ప్రతిపాదనలు వినిపించడం మొదలు కాగానే రాజకీయ స్వరాలు మాట్లాడక తప్పని పరిస్థితి ఏర్పడిరది. ఆ రకంగా చూసినప్పుడు, కాల్పుల విరమణ, శాంతి వంటి భావనలు మావోయిస్టు ‘సమస్య’ కు సంబంధించిన సంవాదాన్ని మార్చివేశాయి. సాధ్యాసాధ్యాల సంగతి ఎట్లా ఉన్నా, శాంతి అన్న భావనకు ఒక నైతిక శక్తి ఉంటుంది. సమాజంలో ఒక తటస్థ ఆవరణం ఏర్పడే అవకాశం ఏర్పడుతుంది. అట్లాగే, నక్సలైట్లు, మావోయిస్టుల విషయంలో, వారి సాహసత్యాగాల వల్ల కావచ్చు, లేదా, ఆశయాల వల్ల కావచ్చు, స్థూలంగా ప్రజల మనస్సుల్లో ఏర్పడిన సానుకూల అభిప్రాయం ఇంకా కొనసాగుతోంది. నక్సలైట్ల ఆచరణకు సంబంధించి అనేక ఫిర్యాదులున్న వారు సైతం వారి నిబద్ధతను, నిజాయితీని శంకించరు. బహిరంగ ప్రజాజీవితంలో ప్రగతిశీల, లౌకిక, ప్రజానుకూల భావాలతో, ఆచరణతో ఉండేవారిని ‘అర్బన్ నక్సల్స్’ అని చెప్పి కొంతైనా ‘బదనామ్’ చేయగలిగారు కానీ, అసలు నక్సల్స్కు ఉన్న ఇమేజ్ ను, ఇతర సాయుధ మిలిటెంట్ల విషయంలో మాదిరి, చెరిపివేయలేకపోయారు. టెర్రరిస్టులు తారసపడితే చాలు కళ్ల మధ్య గురిచూసి కాల్చేస్తామని పార్లమెంటులో అనగలిగిన పెద్దమనిషే, ఇవాళ మావోయిస్టులను ‘సోదరుల’ ని సంబోధించవలసి వచ్చింది. ‘తప్పుడు’ మార్గంలో అయినా సామాజికమార్పు కోసం పనిచేస్తున్నవారని చెప్పవలసివస్తున్నది. శాంతి, సంధి వంటి ప్రతిపాదనల నేపథ్యంలో, ప్రజాభిప్రాయాన్ని తమకు అనుకూలంగా కూడగట్టడానికి ప్రభుత్వానికి కొంత విన్యాసం అవసరమవుతోంది. ఇంత కాలం, చత్తీస్గఢ్ లో జరుగుతున్న ‘ఆపరేషన్లు’ ప్రభుత్వ యథేచ్ఛతో సాగిపోయాయి.
దేశవ్యాప్త పౌరసమాజం ఎందుకింత కాలం బలమైన గొంతు వినిపించలేకపోయింది, గత పది సంవత్సరాలుగా దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయ వాదనల వ్యక్తులు, సంస్థలు ఎటువంటి నిర్బంధాలకు లోనుకావడం వల్ల ఈ నిశ్శబ్దం ఏర్పడిరది, అన్నది అందరికీ తెలిసిన చరిత్రే. కానీ, ఆలస్యంగా అయినా, గొంతులు పెగులుతున్నాయి. ఒక అమానవీయ రక్తపాతం గురించి, గొంతెత్తినప్పుడు, దానంతట అదే ఒక నైతికతా సవాల్ను వ్యవస్థ పై విసురుతుంది. ఆపరేషన్ కగార్ ఆపివేసి, సానుకూల వాతావరణం కల్పిస్తే చర్చలకు సిద్ధమని మావోయిస్టులు అంటున్నారు. ఆయు ధాలు వదిలిపెట్టి జనజీవన స్రవంతిలోకి వస్తే, చర్చలు చేద్దామని ప్రభుత్వం అంటున్నది. చర్చల కోసం రెండు పక్షాలూ షరతులు పెడుతున్నాయి. ఒకేరకమైనవి గా కనిపిస్తాయి కానీ, నిజానికి అవి ఒకటి కావు. ప్రభుత్వం చేయవలసింది కేవలం తాత్కాలిక సడలింపు, మావోయిస్టుల నుంచి కోరుతున్నది మాత్రం విధానపరమైన మార్పు. ఈ రెండిరటి చిక్కుముడి శాంతిచర్చల ప్రతిపాదనను చాలా కాలం పాటు వేధించనున్నది.పదులు, ఇరవైలు, ముప్పైల సంఖ్యలో మరణాలను నమోదు చేస్తున్న ‘కగార్ చర్యలు’, సుమారు పదిరోజుల కిందట సీనియర్ మావోయిస్టు, రచయిత్రి అయిన రేణుక ‘ఎన్కౌంటర్’’ అనంతరం విరామం తీసుకున్నాయి. మళ్లీ ఏప్రిల్ పన్నెండు శనివారం పొద్దున ఇంద్రావతీ తీరంలోని నేషనల్ పార్క్లో ఎన్కౌంటర్ జరిగింది. శాంతి చర్చల ప్రతిపాదన తరువాత జరిగిన మొదటి ఎన్కౌంటర్ గా జాతీయమీడియా దీన్ని చెబుతోంది.
సాధ్యాసాధ్యాల సంగతి ఎట్లా ఉన్నా, శాంతి అన్న భావనకు ఒక నైతిక శక్తి ఉంటుంది. సమాజంలో ఒక తటస్థ ఆవరణం ఏర్పడే అవకాశం ఏర్పడుతుంది. అట్లాగే, నక్సలైట్లు, మావోయిస్టుల విషయంలో, వారి సాహసత్యాగాల వల్ల కావచ్చు, లేదా, ఆశయాల వల్ల కావచ్చు, స్థూలంగా ప్రజల మనస్సుల్లో ఏర్పడిన సానుకూల అభిప్రాయం ఇంకా కొనసాగుతోంది. నక్సలైట్ల ఆచరణకు సంబంధించి అనేక ఫిర్యాదులున్న వారు సైతం వారి నిబద్ధతను, నిజాయితీని శంకించరు.
శాంతి ప్రస్తావనలతో నిమిత్తం లేకుండా తమ పని కొనసాగుతుందని ప్రభుత్వం ఈ తాజా ఎన్ కౌంటర్ ద్వారా సూచించిందనుకోవచ్చు. శుక్రవారం నాడు చత్తీస్గఢ్ మంత్రి విజయ్ శర్మ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఈ వైఖరికి సూచికలుగా తీసుకోవచ్చు. చర్చలకోసం వచ్చేవారు నేరుగా నిర్భయంగా తన దగ్గరకు రావచ్చునని, అయితే హింసకు మాత్రం బలప్రయోగంతోనే సమాధానం చెబుతామని గుర్తించాలని ఆయన అన్నారు.
ప్రభుత్వపక్షం ఇప్పుడు దూకుడుగా ఉన్నది, విజయాలు సాధిస్తున్నది. వారనుకున్నట్టు, మార్చి 2026 నాటికి వారి లక్ష్యం నెరవేరేటట్టు కనిపిస్తున్నది. అంతకు ముందే కూడా సాధ్యపడితే ఆశ్చర్యం లేదని పత్రికలు రాస్తున్నాయి. ఈ స్థితిలో శాంతిచర్చలు తమ గడువును, లక్ష్యాన్ని ఆలస్యం చేసేవో, భగ్నపరిచేవో అవుతాయని ప్రభుత్వం భావిస్తూ ఉండవచ్చు. అటువంటప్పుడు కూడా, ఒకవైపు శాంతికి, చర్చలకు వ్యతిరేకం కాదని చెబుతూనే, ఆ ప్రతిపాదనలను తేలిక చేయడం, అవి ముందుకువెళ్లలేని షరతులు పెట్టడం ప్రభుత్వ వ్యూహంలో భాగంగా ముందుకు వస్తాయి. ప్రతిపాదకులకు, పౌరసమాజానికి చెల్లుబాటు లేదని చెప్పడానికి, వారికి దేశం మీద నిబద్ధత లేదని ప్రచారం చేయడానికి ప్రయత్నాలు జరుగుతాయి. ‘చర్చలంటే ఏమిటి? చాయ్ నాస్తా చేయడమా? కాదు, జనజీవన స్రవంతిలోకి రావడం, మేమేమీ ఇక్కడ సంధికుదుర్చు కోబోవడం లేదు. వాళ్లు రావచ్చు, పోలీసు కేసులు, పునరావాసం వంటి విషయాల్లో ఏమైనా డౌట్స్‌ఉంటే తీర్చుకోవచ్చు’ అని విజయశర్మ అనడంలో, ఆధిక్యం కలిగినవారి స్వరం వినిపిస్తుంది.
బహుశా అందులో భాగంగానే, లొంగుబాట్లను ప్రోత్సహిం చడం, లొంగిపోయినవారికి పునరావాసం గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేయడం, వాటినే శాంతిస్థాపన చర్యలుగా చెప్పుకోవడం జరుగుతున్నాయి. విచక్షణారహితంగా అణ చివేత చర్యలు జరగడం వల్ల, ఆదివాసులు పెద్దసంఖ్యలో చనిపోతున్నారని, చిత్రహింసలకు, అత్యాచారాలకు లోనవుతున్నారని వస్తున్న కథనాలకు ప్రతిగా, ఆదివాసీ యువకులను జనజీవనంలోకి తీసుకువచ్చే పథకాలను, కార్యక్రమాలను ప్రకటిస్తున్నారు. రెండేళ్లకిందట ఉన్న ‘‘చత్తీస్గఢ్ నక్సలిజం నిర్మూలన విధానం-2023’’ స్థానంలో ఇప్పుడు ‘‘ నక్సలైట్ లొంగుబాటు/ బాధిత సహాయ, పునరావాస విధానం-2025’’ను అమలుచేస్తున్నారు. లొంగిపోయిన నక్సలైట్లకు మూడేళ్లపాటు నెలకు పదివేల రూపాయల భృతి ఇవ్వడం కూడా ఈ విధానంలో భాగం.
ఇటీవలి కాలంలో చత్తీస్గఢ్లో జరుగుతున్న వరుస ఎన్ కౌంటర్లు, అందులో మావోయిస్టులతో పాటు పెద్దసంఖ్యలో అమాయక ఆదివాసులు ఉంటున్నట్టు వస్తున్న వార్తలుసహజంగానే దేశవ్యాప్తంగా ప్రజాస్వామిక వాదులను కలవరపరుస్తున్నాయి. విప్లవకారుల ఆచరణతో, ప్రభుత్వం చేసే నిర్బంధంతో భౌతికమైన, బౌద్ధికమైన పరిచయం, సంబంధం లేని వారికి కూడా కొద్దికాలంలోనే భద్రతాదళాల కాల్పుల్లో 400 మందికి పైగా చనిపోవడం విచారం కలిగించే విషయం. అదంతా సహజమని కళ్లు మూసుకుని కూర్చోవడానికి సమాజపు అంతరాత్మ ఎల్లకాలం సిద్ధపడదు.
మొత్తానికి, ఏకముఖంగా సాగిన ఆపరేషన్ ఇప్పుడు బహుముఖంగా విస్తరిస్తోంది. నక్సలైట్లను బలహీనం చేయడమనే పనిలో గణనీయమైన విజయాలు సాధించిన తరువాత, ఆదివాసులను తమ అదుపుకలిగిన వ్యవస్థలలోకి తీసుకురావడమనే అనంతర దశలోకి భారతప్రభుత్వం ప్రవేశించింది. ఇప్పుడు రక్తపాతాన్ని నివారించడానికి, ‘ఆపరేషన్ల’ నేపథ్యంలో ఆదివాసుల అస్తిత్వాన్ని కాపాడడానికి శాంతి ప్రతిపాదకులు బలమైన నైతిక ప్రాతిపదికలను నిర్మించాలి. సంధి కోరేవారు మనసావాచా సాయుధపక్షాల మధ్య తటస్థులుగా ఉండాలి. ఆదివాసీల ప్రాణాలకు, ఉనికి కి, వనరులకు మాత్రమే నిబద్ధులుగా ఉండాలి. నిర్మూలన పేరుతో జరుగుతున్న దాడులు, చర్యలు ఏ మాత్రం మానవీయ విలువలకు అనుగుణమైనవి కావని, ఉద్రిక్తతలను, హింసను తగ్గించడానికి ఇతర నాగరక మార్గాలను అన్వేషించాలని చెప్పాలి.
రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నామని చెబుతున్న ప్రభుత్వ పక్షం, తాము తీసుకుంటున్న చర్యలను పారదర్శకంగా, చట్ట ప్రమాణాలకు లోబడి ఉన్నట్టు నిరూపించుకోవాలని కోరాలి. జవాబుదారీతనాన్ని నెలకొల్పడం మాత్రమే అమాయకులను, నిరాయుధులను హతమార్చడాన్ని నిరోధిస్తుంది. తమ చర్యలను సమర్థించు కోవడానికి తగిన వాదనలను ప్రభుత్వం ఎట్లాగూ ప్రయత్ని స్తుంది. భారత ప్రజల వైపు నుంచి, బాధిత ఆదివాసుల వైపు నుంచి, సమాజ శ్రేయస్సును నిష్పాక్షికంగా చూడగలిగిన ఆలోచనాపరులందరి తరఫున ఒక తిరుగులేని నైతిక శాంతి ప్రతిపాదనను రూపొందించగలిగితే, పరిస్థితిలో మెరుగుదల కనిపిస్తుంది. తటస్థత పై నిబద్ధత, విస్తృత అంగీకారం పొందగలిగే ఒక దౌత్యసరళి కలిగిన ప్రతిపాదనపై పౌరసమాజం చర్చించాలి! ఎదురేలేకపోవడం వల్ల, అమితమైన బలం ఉండడం వల్ల, నిరంకుశాధికారాన్ని చెలాయించే ప్రలోభం లోకి ప్రభుత్వాలు పడిపోతాయి. వాటిని ఆ దౌర్బల్యం నుంచి రక్షించడానికి ప్రజలు, సమాజం కల్పించుకోవలసి వస్తుంది. ఒకసారి, ప్రశాంతత, అమాయకులకు హాని జరగని స్థితి ఏర్పడిన తరువాత, అన్ని విషయాలూ చర్చల్లోకి తీసుకురావచ్చును. బహిరంగ ప్రజాజీవితంలో పనిచేస్తూ, వ్యవస్థను మార్చడానికి ఉన్న అవకాశాలను మరోసారి పరిశీలించాలని మావోయిస్టులను, ప్రభుత్వం కాదు, ప్రజలు, కోరవచ్చు.