భూ భారతి పై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష
హాజరైన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉన్నతాధికారులు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 12: ఈ నెల 14 న భూ భారతి పోర్టల్ ను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు శనివారం భూభారతి అమలుపై సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు. ఈ సమావేశంలో రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితోపాటు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈసందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ఎంపిక చేసిన మూడు మండలాల్లో పైలట్ ప్రాజెక్టు నిర్వహించనున్నట్లు తెలిపారు. భూ భారతి పోర్టల్ పై ప్రతీ మండలంలో అవగాహన సదస్సులు నిర్వహించాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.
క్షేత్ర స్థాయిలో అవగాహన కలిగించేలా అన్ని మండలాల్లో అవగాహన సదస్సులు నిర్వహించే బాధ్యత కలెక్టర్లకు అప్పగించాలని ఆదేశించారు. ప్రజలకు సౌకర్యంగా ఉండేలా భూ భారతి పోర్టల్ పైలట్ ప్రాజెక్టులో ప్రజల నుంచి వచ్చే సలహాలు, సూచనలను స్వీకరించాలని ఆ తర్వాత పోర్టల్ ను మరింత బలోపేతం చేయాలని అధికారులకు సూచించారు. ధరణి పోర్టల్ లో ఎదురైన సమస్యలు పునరావృతం కాకుండా పకడ్బందీగా భూభారతి చట్టాన్ని అమలు చేయాలన్నారు. ఈనెల 14న హైదరాబాద్ లోని శిల్పకళా వేదికగా సీఎం రేవంత్ రెడ్డి చేతులు మీదుగా నూతన రెవెన్యూ చట్టం, పోర్టల్ ను ఆవిష్కరించేందుకు రెవెన్యూ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. కొత్త చట్టం అమలు, నియమ, నిబంధనలపై అదేరోజు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది.