720 ‌మెగా వాట్ల 8 యూనిట్లు పోయి ఢాం ఢాం ఢాం..

800 మెగావాట్ల 1 యూనిట్‌ ‌వచ్చే ఢాం ఢాం ఢాం

 కాకతీయ కలగూర గంప – 15

ఇప్పుడు భద్రాది జిల్లలోని ‘పాల్వంచ’ పట్టణం లక్షా ముప్పై వేల జనాభాతో ఒక మునిసిపల్‌ ‌కార్పొరేషన్‌ ‌గా వెలిగి పోతుంది. కాని 60 సంవత్సరాల గతంకు పోతే అది ఖమ్మం జిల్లా కొత్తగూడెం మండలం లోని ఒక చిన్న గ్రామం. ఐతే ఈ చిన్న గ్రామం రాష్ట్రానికే విద్యుత్‌ ‌వెలుగులు విరజిమ్మే గ్రామంగా మారడానికి అంకురార్పణ జరిగింది 1964లో. అప్పటి ఆంధ్రప్రదేశ్‌ ‌రాష్ట్ర నిర్ణయంతో జపాన్‌ ‌దేశపు ‘హిటాచీ’ కంపెనీ 60 మెగావాట్ల విద్యుత్తు ఉత్పాదక కెపాసిటీ గల 4 థర్మల్‌ ‌పవర్‌ ‌యూనిట్లు నెలకొల్ప నారంభించింది. అందులో మొట్టమొదటిది జులై 1966 లో ప్రారంభం కాగా, ఒక్కటొక్కటిగా మిగతా మూడు కూడా ప్రారంభమై జులై 1967 వచ్చేటప్పటికి 240 మెగావాట్ల కెపాసిటీ గల విద్యుచ్చక్తిని రాష్ట్రానికి అందించే గ్రామంగా పాల్వంచ వార్తల్లోకి వచ్చింది.ఈ విద్యుదుత్పాదక కేంద్రం కు ‘కొత్తగూడెం థర్మల్‌ ‌పవర్‌ ‌స్టేషన్‌ (‌కె టి పీ ఎస్‌)’‌గా నామకరణం జరిగింది. ఈ నాలుగు యూనిట్లను కలిపి ‘ఎ’ స్టేషన్‌ అం‌టారు.

ఈ థర్మల్‌ ‌పవర్‌ ‌యూనిట్లో విద్యుత్తును ఉత్పత్తి చేసే విధానం ఏమంటే, ‘బాయిలర్‌’ అనే ఒక ముఖ్య భాగంలో బొగ్గు చూర్ణాన్ని మడించి దాని ద్వారా ఉత్పన్నమయ్యే ఉష్ణశక్తి ద్వారా నిలువుగా అమర్చిన బాయిలర్‌ ‌గొట్టాలలో ప్రవహించే నీటిని వేడి చేసి, అధిక పీడన నీటి ఆవిరిగా మారుస్తారు. ఈ అధిక పీడన నీటి ఆవిరిని ‘టర్బైన్‌’ అనే మరొక యంత్ర భాగానికి పంపిస్తారు. ఇది ఒక షాఫ్టుకు ప్రక్కప్రక్కగా బిగించిన కొన్ని రింగులను కలిగివుంటుంది. ప్రతి రింగుకు గూడా అనేక బ్లేడులు బిగించబడి వుంటాయి. బాయిలర్‌ ‌నుండి ఉత్పన్నమయ్యే అధిక పీడన నీటి ఆవిరి ఈ టర్బైన్‌ ‌బ్లేడుల మీదకు పంపించ బడుతుంది. నీటి ఆవిరి యొక్క అధిక పీడన ఉష్ణ శక్తి ఈ బ్లేడులపై ప్రసరించి బ్లేడులను ముందుకు నెట్టడం వల్ల రింగ్‌ ‌రొటేట్‌ అవుతూ వాటిని బిగించిన షాఫ్టు గుండ్రంగా తిరగడం ఆరంభిస్తుంది. అంటే ఉష్ణ శక్తి (హీట్‌ ఎనెర్జీ) యాంత్రిక శక్తి (మెకానికల్‌ ఎనెర్జీ) లాగా మార్పు చెందుతుంది.టర్బైన్‌ ‌షాఫ్ట్ ‌మరో చివర ‘జెనరేటర్‌’ అనే భాగం బిగింప బడి వుంటుంది.

దీని నిర్మాణం మనం ఇండ్లలో వుపయోగించే విద్యుత్‌ ‌మోటార్‌ ‌లాగానే వుంటుంది. ఐతే దీని పని తీరు విద్యుత్‌ ‌మోటార్‌ ‌పని తీరుకు వ్యతిరేకం. విద్యుత్‌ ‌మోటార్‌ ‌స్విచ్‌ ‌వేసి మోటారుకు విద్యుత్తును పంపిస్తే మోటార్‌ ‌షాఫ్ట్ ‌గుండ్రంగా తిరగడం ఆరంభిస్తుంది. కాని టర్బైన్‌ ‌షాఫ్ట్ ‌పై బిగించిన జెనరేటర్లో దాని షాఫ్ట్ ‌ను గుండ్రంగా త్రిప్పడం వల్ల జెనరేటర్లో అమర్చిన విద్యుత్‌ ‌తీగల వలయాలలో విద్యుత్‌ ఉత్పన్న మవుతుంది. అంటే టర్బైన్‌ ‌యొక్క యాంత్రిక శక్తి (మెకానికల్‌ ఎనెర్జీ) జెనరేటర్‌ ‌ద్వారా విద్యుచ్చక్తి (ఎలెక్త్రికల్‌ ఎనెర్జీ) లాగా మారుతుంది.
ఐతే ఒక థర్మల్‌ ‌పవర్‌ ‌ప్లాంట్‌ ‌కు అవసరమయ్యే బొగ్గు, నీరు సమృద్ధిగా లభ్యం కావాలి కాబట్టి సింగరేణి బొగ్గు గనులు, కిన్నెరసాని నది- ఈ రెండూ దగ్గరగా ఉండటం వల్ల పాల్వంచ గ్రామం ‘కే టీ పీ ఎస్‌’ ‌నిలయమైది. ఈ ప్లాంటుకు తగినంత నీరు మళ్ళించడానికె 1966 లోనే కిన్నెరసాని పై డ్యాం నిర్మాణం పూర్తి చేసారు. ఇక పాత విషయాలలో మరొక ముఖ్య సమాచారం కూడా తెలుసుకోవాలి.1947 లో దేశ స్వాతంత్య్రం సిద్ధించగానే అప్పటి భారత ప్రభుత్వం ప్రజలకు విద్యుత్‌ అవసరాన్ని ప్రధానమైన విషయంగా గుర్తించి వెంటనే భోపాల్‌ ‌లో 1957 లో ‘హెవీ ఎలక్ట్రికళ్‌ ‌ప్లాంటును స్థాపించారు.
ఐతే ముఖ్య భాగాలన్నీ దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. వీటిని మన దేశంలోనే తయారు చేసుకోవాలని ‘భారత్‌ ‌హెవీ ఎలెక్ట్రికల్‌ ‌లిమిటెడ్‌ (‌బీ హెచ్‌ ఈ ఎల్‌) ‌పేరున 1964 లో తిరుచిరాపల్లి, హైదరాబాద్‌, ‌హరద్వార్‌ ‌లలో నెలకొల్పి 1960 వ చివరి దశకం వరకు అన్ని భాగాలు మన దేశంలోనే లభ్యమయ్యే శుభ కార్యక్రమాన్ని నిర్వహించింది భారత ప్రభుత్వం. 1974 లో భోపాల్‌ ‌హెవీ ఎలక్త్రికల్‌ ‌ప్లాంటును కూడా ‘బీ హెచ్‌ ఈ ఎల్‌’ ‌లో విలీనం చేశారు. తర్వాత ఇది మరింత విస్తరించి దేశంలో ఎన్నో ప్రధాన తయారీ పరిశ్రమలు, ఇతర కార్యాలయాలను కలిగియుంది. ఇప్పుడు ‘బీ హెచ్‌ ఈ ఎల్‌’ ‌దేశానికే ఒక ‘మహారత్న పరిశ్రమ’ అనవచ్చు.

image.png

1979‌లో పనిచేస్తున్న 720 మెగావాట్ల 8 యూనిట్లు
ఇక ‘కె టీ పీ ఎస్‌ ‘‌విషయానికి వస్తే ‘బి హెచ్‌ ఇ ఎల్‌ ’ 1974-75 ‌లో రెండు 110 మెగవాట్ల యూనిట్లను(‘బి’ స్టేషన్‌ ‌లోని 5,6 యూనిట్లు), తిరిగి 1977-78 లో రెండు 120 మెగవాట్ల యూనిట్లను (‘సి’ స్టేషన్‌ ‌లోని 7,8 యూనిట్లు) నెలకొల్పి ప్రారంభించింది. 1977 ఏప్రిల్‌ ‌నుండి 1979 డిసెంబర్‌ ‌వరకు నేను (నిరంజన్‌ ‌రావు) బి హెచ్‌ ఇ ఎల్‌ ‌తరఫున ‘సి’ స్టేషన్‌ ‌లోని రెండు (7,8) 120 మెగా వాట్ల యూనిట్ల ఎరెక్షన్‌ ఇం‌జినీర్‌ ‌గా పనిచేసిన వాళ్ళలో ఒకడిని. అదే టైం లో బి స్టేషన్‌ 5,6 ‌రెండు యూనిట్ల సామర్థ్యాన్ని కొన్ని మార్పులు చేసి 110 నుండి 120 మెగావాట్లకు పెంచడం జరిగింది. అందులో నాకు కూడా కొన్ని పనులు అప్పగించారు.

తర్వాత క్రమంలో 1997-98 లో 250 మెగా వాట్ల సామర్థ్యం గల మరో రెండు యూనిట్లు (‘డి’ స్టేషన్‌), 2011 ‌లో 500 మెగా వాట్ల సామర్థ్యం గల ఒక యూనిటును (‘ఇ’ స్టేషన్‌) ‌నెలకొల్పారు. చివరగా 2018 లో 800 మెగా వాట్ల సామర్థ్యం గల ఒక యూనిటును (‘ఎఫ్‌’ ‌స్టేషన్‌) ‌నెలకొల్పారు. దీనిని ప్రారంభించిన పిదప అప్పటికే తమ పని తీరు జీవిత కాలాన్ని ముగించిన 720 మెగా వాట్ల సామర్థ్యత గల ‘ఎ, బి, సి’ స్టేషన్లలోని మొదటి 8 యూనిట్లు తొలగించారు. ఐతే ఈ 8 యూనిట్లు కూడా పాత ‘సబ్‌ ‌క్రిటికల్‌ ‌టెక్నాలజీ’’ కి చెందినవి. ‘ఎఫ్‌’ ‌స్టేషన్‌ ‌లోని క్రొత్త 800 మెగా వాట్ల యూనిట్‌ ‘‌సూపర్‌ ‌క్రిటికల్‌ ‌టెక్నాలజీ’కి చెందింది. ఐతే వీటి మధ్య వున్న వ్యత్యాసం ఏమిటి అన్నది తెలుసుకుందాం.
మనం నీటిని వేడి చేసి దానిని నీటి ఆవిరిగా మార్చినపుడు అది తేమను కలిగి వుండకుండా పూర్తిగా వాయు రూపంలో వుంటే దానిని ‘సంతృప్త పొడి ఆవిరి ‘ అంటారు. థర్మల్‌ ‌పవర్‌ ‌స్టేషన్‌ ‌బాయిలర్లో వేడి చేసే నీరు అధిక పీడనం కలిగి వుంటుంది. పీడనం ఎక్కువైనపుడు నీటిని ఆవిరిగా మార్చే బాయిలింగ్‌ ఉష్ణోగ్రత పెరుగుతుంది.

image.png
కూల్చివేస్తున్న 8 యూనిట్ల కూలింగ్‌ ‌టవర్లు
నీటిని నీటి ఆవిరిగా మార్చడంలో ‘క్రిటికల్‌’ అన్న పదం ఎందుకు వాడామో తెలుసుకుందాం. నీటిని వేడి చేస్తూ దాని పీడనాన్ని పెంచుకుంటూ పోతే ఒక పీడనం చేరేసరికి అక్కడ ఆ ఉష్ణోగ్రతలో లభ్యమయ్యే నీటి ఆవిరి పూర్తిగా వాయు రూపంగా వుంటుంది. అంటే దానిని వాయు రూపంలోని ఆవిరి, నీటి రూపం లోని తేమ గా విడదీయలేము. ఆ పీడనాన్ని (220.64 బార్‌) ‘‌క్రిటికల్‌ ‌పీడనం’ అనీ మరియు ఆ ఉష్ణోగ్రతను (374 డిగ్రీస్‌ ‌సెంటిగ్రేడ్‌) ‘‌క్రిటికల్‌ ఉష్ణోగ్రత’ అంటారు. సబ్‌ ‌క్రిటికల్‌ ‌బాయిలర్లో నీరు ఇంతకంటే తక్కువ పీడనం వద్ద వేడి చేయబడుతుంది. సబ్‌ ‌క్రిటికల్‌ ‌బాయిలర్లో దాని పీడనం 170 బార్‌ ‌దాకా వుంటుంది. అప్పుడు దానిని నీటి ఆవిరిగా మార్చే బాయిలింగ్‌ ఉష్ణోగ్రత 352 డిగ్రీస్‌ ‌సెంటిగ్రేడ్‌. ఐతే ఈ నీటి ఆవిరి తేమను కలిగి వుంటుంది. టర్బైన్‌ ‌లో ప్రసరించే నీటి ఆవిరి తేమను కలిగి వుండరాదు. కాబట్టి ఈ తేమకలిగిన నీటి ఆవిరి ముందుగా బాయిలర్‌ ‌పైన సుమారు 100 ఆడుగుల ఎత్తులో అమర్చిన పెద్ద స్తూపాకారపు ‘డ్రమ్ము ‘ లోకి ప్రవేశించి అక్కడ తేమ లేని నీటి ఆవిరిగా పై భాగానికి , నీటి రూపం లో క్రింది భాగానికి విడదీయబడుతుంది. పైన వున్న తేమ లేని పొడి నీటిఆవిరి బాయిలర్లో అమర్చిన సూపర్‌ ‌హీటర్‌ అనే గొట్టాల్లోకి ప్రవేశించి మరింత వేడి చేయబడి సుమారు 540 డిగ్రీల ఉష్ణోగ్రతకు చేరుకుంటుంది. అక్కడినుండి అది టర్బైన్‌ ‌లోనికి 170 బార్‌ ‌పీడనంతో ప్రవేశిస్తుంది. ఆక్కడ అది టర్బైన్‌ ‌బ్లేడులపైన ఒత్తిడి కలిగించి బ్లేడులను కలిగి వున్న రింగ్‌ ‌తిరగడం ద్వార టర్బైన్‌ ‌షాఫ్ట్ ‌రొటేట్‌ అవుతుంది. డ్రమ్ము లో క్రింద వున్న నీరు మళ్ళీ బాయిలర్‌ ‌లోకి ప్రవేశించి మళ్ళీ వేడి చేయబడుతుంది. ఈ విధంగా బాయిలర్‌ ఎవాపరేటర్‌ ‌గొట్టాలలో నీరు వేడి చేయబడి పైకి ప్రసరించిన తేమ కలిగిన నీటి ఆవిరిని రెండుగా విడదీసి ‘తేమ లేని పొడి సంతృప్త నీటి ఆవిరిని’పొందడానికై డ్రమ్ము ఉపయోగిస్తుంది.
బాయిలర్‌ ‌డ్రమ్ము అన్నది ఎంతో బరువు గల అతి ముఖ్య భారీ భాగం (పటం లో చూపించినట్లుగా). 250 మెగా వాట్ల బాయిలర్‌ ‌డ్రమ్ము 150 టన్నుల బరువు, 500 మెగా వాట్ల బాయిలర్‌ ‌డ్రమ్ము 250 టన్నుల బరువు కలిగి వుంటాయి. దానిని తయారు చేయడం లో ‘ఎలెక్ట్రో స్లాగ్‌ ‌వెల్దింగ్‌’ అనే ప్రత్యేక రకపు వెల్డింగ్‌ ‌పద్ధతి ఉపయోగిస్తారు. దీనిని ఫ్యాక్టరీ నుండి రవాణా చేసే వాహనం వేగం గంటకు 30 కిలోమీటర్లకు మించరాదు.అంటే అది ఏవిధమైన కుదుపులకు గురి కాకూడదు. ఇక దీనిని బాయిలర్‌ ‌పై భాగానికి (సుమారు 100 అడుగులకు పైగా) లేపి ఎక్కించడం అతి ముఖ్య థర్మల్‌ ‌ప్లాంట్‌ ‌నిర్మాణ ప్రక్రియ (గృహ నిర్మాణం లో పైన స్లాబ్‌ ‌వేసినట్లు). మెల్లి మెల్లిగా సెంటి మీటర్‌, ‌సెంటి మీటర్‌ ‌పైకి లేపాలి. ఒక అడుగు ఎత్తులోనుండి కిందా బడ్డా, దానిని మళ్ళీ ఫ్యాక్టరీకి పంపించి నాన్‌ ‌డిస్ట్రక్టివ్‌ ‌టెస్ట్ ‌చేయించ వలసి వుంటుంది. ఇదంతా ఎందుకు తెలుసుకుంటున్నామంటే, ఈ బాయిలర్‌ ‌డ్రమ్ము ‘సూపర్‌ ‌క్రిటికల్‌ ‌బాయిలర్‌’ ‌లో వుండదు. కాబట్టి పైన తెలిపిన డ్రమ్ము సమస్యలు వుండవు. సూపర్‌ ‌క్రిటికల్‌ ‌బాయిలర్లో ఇంధన ఖర్చు తక్కువ. పైగా వాతావరణ కాలుష్యం కూడా తక్కువ. పెద్ద సబ్‌ ‌క్రిటికల్‌ ‌థర్మల్‌ ‌పవర్‌ ‌ప్లాంట్లు 170 బార్‌ ‌పీడనం, 540 సెంటిగ్రేడ్‌ ‌వద్ద పనిచేసి 38% దాకా సామర్థ్యత కలిగి వుంటాయి. సూపర్‌ ‌క్రిటికల్‌ ‌యూనిట్లు ఐతే 250 బార్‌ ‌పీడనం, 600 సెంటిగ్రేడ్‌ ‌వద్ద పనిచేసి 42% దాకా సామర్థ్యం కలిగి వుంటాయి. ఇతర వ్యత్యాసాలు పట్టికలో తెలుప బడ్డాయి.

(ఈ వ్యాసమంతా సాంకేతిక వివరాలు ఎక్కువ వున్నాయి. వొచ్చే వారం అప్పటి నా పాల్వంచ అనుభవాలు)
– శ్రీమతి పాములపర్తి చంద్రకీర్తి
– పాములపర్తి నిరంజన్‌ ‌రావు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page