ఇది రాష్ట్ర రాజకీయాల్లో మార్పు తెచ్చే ఎన్నిక

– బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లు చేసిందేమీ లేదు
– జూబ్లీహిల్స్‌ను పరోక్షంగా ఏలాలనుకుంటున్న మజ్లిస్‌
– నాడు మజ్లిస్‌ను కేసీఆర్‌ మోస్తే నేడు అదే చేస్తోన్న కాంగ్రెస్‌
– బీజేపీని గెలిపించాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విన్నపం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 16: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక రాష్ట్ర రాజకీయాలలో మార్పు తెచ్చేదని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. పదేళ్లు పాలించిన బీఆర్‌ఎస్‌, పదేళ్లకుపౖౖెగా కాంగ్రెస్‌ పార్టీ ఈ నియోజకవర్గానికి చేసిందేమీ లేదని విమర్శించారు. బోరబండ డివిజన్‌ బీజేపీ కార్యాలయంలో ఎర్రగడ్డ డివిజన్‌ బూత్‌ అధ్యక్షులు, కార్యకర్తలతో కిషన్‌రెడ్డి గురువారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం కాంగ్రెస్‌ ప్రభుత్వం జూబ్లీహిల్స్‌ను ఏమాత్రం పట్టించుకోవడం లేదని, నియోజకవర్గంలో ఎక్కడ చూసినా డ్రైనేజీ పొంగిపొర్లుతోంది.. చెత్తాచెదారంగా మారిందని విమర్శించారు. ఈరోజు రాష్ట్రాన్ని పాలించేది కాంగ్రెస్‌ కాదని, మజ్లిస్‌ పార్టీ పాలిస్తోందని ఆరోపించారు. పాత బస్తీలో మజ్లిస్‌ గూండాల కారణంగా చాలా ఇళ్లు ఖాళీ అయ్యాయని తెలిపారు. మజ్లిస్‌ పార్టీ, అసదుద్దీన్‌ ఒవైసీ కలిసి కాంగ్రెస్‌ అభ్యర్థిని నిర్ణయించారని తెలిపారు. నాడు కేసీఆర్‌ మజ్లిస్‌ పార్టీని భుజాల మీద మోశారని, ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీ అదే చేస్తున్నదని ఆయన ఎద్దేవా చేశారు. ఈ నియోజకవర్గాన్ని పరోక్షంగా మజ్లిస్‌ పార్టీ ఏలాలని చూస్తోందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలు కోసం యువకులు, మహిళలు కాంగ్రెస్‌ను నిలదీయాలన్నారు. ఇప్పటికి ఒక్కరికి కూడా కొత్త పెన్షన్‌ ఇవ్వలేదని, వాటిని ఎందుకు ఇవ్వలేదో రాహుల్‌ గాంధీ, రేవంత్‌ రెడ్డి చెప్పాలని నిలదీశారు. కాంగ్రెస్‌ పార్టీ ఏ హామీని కూడా నెరవేర్చలేదని దుయ్యబట్టారు. ఈ ప్రభుత్వం జూబ్లీహిల్స్‌లో కనీసం వీధి దీపాలు కూడా వేయలేదని, ముఖ్యమంత్రి తిరిగే మార్గంలో కూడా వీధి దీపాలు లేవని చెప్పారు. తెలంగాణలో బీజేపీ ఎదగకుండా అధికార పార్టీతో కలిసి మజ్లిస్‌ పార్టీ ప్రయత్నిస్తోంది. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు రెండూ కుటుంబ పార్టీలే. అప్పుడు కేసీఆర్‌ కుటుంబం, ఇప్పుడు సోనియా కుటుంబం తెలంగాణను దోచుకుంటున్నాయి. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలకు ఓటు వేస్తే అది మజ్లిస్‌ పార్టీకి వేసినట్టేనని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్‌కు తెలంగాణలో భవిష్యత్తు లేదని, ఆ పార్టీకి ఓటు వేస్తే మూసీలో వేసినట్టేనని చెప్పారు. బీజేపీ కార్యకర్తలు నవంబర్‌ 11 వరకు నిబద్ధతతో ప్రజల మధ్యలో పని చేయాలి.. మన అభ్యర్థి దీపక్‌ ప్రజల మధ్యలో ఉన్న నాయకుడు.. ప్రజా సమస్యల పరిష్కారంలో చురుకుగా పనిచేశారు.. ఆయన కోసం కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా పనిచేయాలి.. నేను కూడా పూర్తి సమయాన్ని కేటాయిస్తాను.. తెలంగాణ, జూబ్లీహిల్స్‌ ప్రజల కోసం బీజేపీ ఇక్కడ గెలవాలి. మజ్లిస్‌ పార్టీ కబంధ హస్తాల నుండి హైదరాబాద్‌ను రక్షించుకోవాలి. ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా ఇక్కడ న్యాయం గెలవాలి.. ప్రజలే గెలవాలని ఆకాంక్షించారు. ప్రధానమంత్రి మోదీ దేశానికి ప్రపంచవ్యాప్తంగా పేరు తీసుకొచ్చారని, పేదల కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని వివరించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page