– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 21 : దశాబ్దాల కాలంగా మహిళా రిజర్వేషన్ల అంశాన్ని అటకెక్కించి నారీ శక్తి ఎదుగుదలను అడ్డుకున్న కాంగ్రెస్, దాని మిత్రపక్షాల అసలు రంగును ఎండగట్టాల్సిన సమయం వచ్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎంతో సాహసోపేతంగా ‘నారీ శక్తి వందన్ అధినియమ’ను తీసుకొచ్చి మహిళలకు చట్టసభల్లో సముచిత స్థానం కల్పిస్తుంటే దానిని రాజకీయం చేస్తూ అడ్డుకున్న కాంగ్రెస్, ఇండి కూటమి పార్టీలు వ్యవహరించిన తీరు దురదృష్టకరమన్నారు. ఈ కపట బుద్ధికి వ్యతిరేకంగా మహిళలకు మద్దతుగా నిలుస్తూ రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ప్రకటించారు. ముఖ్యంగా ఈనెల 23న హైదరాబాద్‌లో జన్ ఆక్రోష్ పాదయాత్రను అత్యంత భారీ స్థాయిలో నిర్వహిస్తున్నామన్నారు. జీహెచఎంసీ కార్యాలయం నుంచి ప్రారంభమై దోమల్‌గూడ, ఇందిరా పార్కు వరకు కొనసాగే ఈ యాత్రలో మహిళలు పెద్దఎత్తున పాల్గొని కాంగ్రెస్ మహిళా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. యాత్ర ముగింపులో కాంగ్రెస్ వైఖరిని నిరసిస్తూ నరేంద్ర మోదీ ప్రభుత్వం మహిళా సంక్షేమం కోసం చేసిన చరిత్రాత్మక కృషిపై ప్రసంగాలు ఉంటాయన్నారు.ఆడబిడ్డల ఆత్మగౌరవం కోసం, వారి రాజకీయ హక్కుల కోసం జరిగే ఈ పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.
తెలంగాణకు పదేళ్లలో కేంద్రం రూ.12 లక్షల కోట్లు
రాష్ట్ర అభివృద్దికి అవసరమైన మేరకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం భారీగా నిధులు ఇచ్చి చేయూతనిస్తోందని రామచందర్ రావు స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో మంగళవారం ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో పదేళ్లలో కేంద్రం రూ.12 లక్షల కోట్లు ఇవ్వగా గత రెండేళ్లలో రూ.లక్షా 50 వేల కోట్లు ఇచ్చిందని వివరించారు. దీనిపై మీరు చర్చకు సిద్ధమా అంటూ కేసీఆర్, రేవంత్ రెడ్డిలకు సవాల్ విసిరారు. ఈ అంశంపై మీరు ఎక్కడికి వచ్చినా తాను చర్చకు సిద్ధమన్నారు. ఈ సవాల్‌ను స్వీకరిస్తే తాను అన్ని వివరాలతో కుండబద్ధలు కొడతానన్నారు. దేశ రాజధాని దిల్లీకి వచ్చి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత హరీశ్ రావు తమ వద్ద రాయబారాలు నడపడం లేదని ఆయన తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి దిల్లీ వెళ్లి ఆ పార్టీ నేతల వద్ద మోకరిల్లుతున్నారని వ్యంగ్యంగా అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తాన్ని సీబీఐకి ఇవ్వమంటే నాణ్యత లేని బ్యారేజీల అంశాన్ని మాత్రమే అప్పగించారంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. దీనిని కాళేశ్వరం మొత్తం మీద సీబీఐ విచారణ అంటే ఎలా అంటూ ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పదేళ్లలో బీఆర్ఎస్, రెండేళ్లలో కాంగ్రెస్ అక్రమ మీటర్లు వేసి రూ.లక్షల కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ఎదుగుదలను అడ్డుకునేందుకే రేవంత్ రెడ్డి, కేసీఆర్‌లు నిన్న బహిరంగ సభలు పెట్టినట్లుగా ఉందని రామచందర్ రావు వ్యాఖ్యానించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




రైతు బంధు ఏనాడు సమయానికి ఇచ్చారు