– సంఖ్య తేలితే జర్నలిస్టులకు మరిన్ని సౌకర్యాల కల్పన
– 10లోగా దరఖాస్తు చేసుకున్న వారందరికీ అక్రిడిటేషన్లు
– 1న అన్ని జిల్లాల్లో అక్రిడిటేషన్ల పంపిణీకి కలెక్లర్లకు ఆదేశం
– 15వరకు అందరికీ బస్సు పాస్‌ల పొడిగింపు
– సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 30 : రాష్ట్రంలో అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడిటేషన్లు మంజూరు చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని సమాచార, పౌరసంబంధాలు, రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన మేరకు పాత్రికేయులకు ఆరోగ్యంతోపాటు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు. సమాచార శాఖ ఆధ్వర్యాన జర్నలిస్టులకు కొత్త అక్రిడిటేషన్ కార్డులను మంత్రి గురువారం అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం ఇచ్చిన అక్రిడిటేషన్ కార్డులను ఇంతవరకు పొడిగించామని, దేశంలో, ఇతర రాష్ట్రాలలో అమలు చేస్తున్న ఉత్తమ విధానాలను ఇక్కడ అనుసరించాలన్న ఆలోచన మేరకు పరిశీలన సాగిందని, అందువల్లే ఈ కార్డుల జారీలో ఆలస్యం చోటుచేసుకుందని చెప్పారు. గత ప్రభుత్వం 32,500 మందికి అక్రిడిటేషన్లు ఇచ్చే అవకాశం ఉన్నా 23,352కే పరిమితం చేసిందన్నారు. తమ ప్రభుత్వం ఇప్పుడు 46 వేల మందికిపైగా అక్రిడిటేషన్లు ఇచ్చేలా మార్పులు చేసిందని, ఇప్పటికే సుమారు 2,800 వరకు కార్డులను ఆమోదించామని వివరించారు. జర్నలిస్టుల సూచనల మేరకు జీవోలలో మార్పులుచేర్పులు చేశామని, అర్హులైన జర్నలిస్టులకు కార్డుల మంజూరులో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని అన్నారు. మే 1న అన్ని జిల్లాల్లో అక్రిడిటేషన్ కార్డులు పంపిణీ చేయాలంటూ కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేస్తామని మంత్రి పొంగులేటి ప్రకటించారు. ఈ ప్రక్రియలో మే 10ని ఒక కటాఫ్ డేట్‌గా పెట్టుకుని దరఖాస్తులు చేసుకోవాలని, ఆ తేదీలోగా వచ్చే దరఖాస్తులను ఆమోదిస్తామని తెలిపారు. రాష్ట్రంలో అక్రిడిటేషను సంఖ్య తేలితే జర్నలిస్టులకు ఆరోగ్యం, ఇతర సౌకర్యాలు కల్పించేందుకు ఒక ప్రణాళిక రూపొందించుకోవచ్చునన్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ దిశగా పలు సూచనలు చేశారని వెల్లడించారు. అంతేగాక జర్నలిస్టులు వివిధ సంస్దలలో ఉద్యోగాలు మారినప్పటికీ అక్రిడిటేషన్ల మంజూరు ఓ నిరంతర ప్రక్రియగా సాగుతుందని, ఈ విషయంలో ఎలాంటి సందేహాలు వద్దని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తామని, త్వరలో పాత్రికేయ సంఘాలతో భేటీ అవుతామని తెలిపారు. ఏప్రిల్ 30తో కొంతమంది జర్నలిస్టుల బస్సు పాస్‌ల గడువు ముగుస్తున్నందున మరో 15 రోజులపాటు పొడిగించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి పొంగులేటి ప్రకటించారు. ఈ సందర్భంగా పలువురు పాత్రికేయులకు అక్రిడిటేషన్ కార్డులను అందజేసి అభినందించారు. కార్యక్రమంలో మీడియా అకాడమీ చైౖర్మన్ కె.శ్రీనివాసరెడ్డి, సమాచార శాఖ స్పెషల్ కమిషనర్ ముకుందరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




