“ముస్లిములకు చెందిన వక్ఫ్ బోర్డులో మతేతరులు ఉండవచ్చు. హిందూ మతానికి చెందిన ఆలయాల్లో మతేతరులు ఉండ కూడదు. కొన్ని రాష్ట్రాల్లో లౌకికవాదులుగా ముద్ర వేసి ఏకంగా కొందరు హత్య చేయబడ్డారు.లౌకిక వాదం అంటరాని తనమైంది. ఇందుకు చాల సంఘటనలున్నాయి. కర్ణాటకలో గౌరి లంకేష్ ను తన ఇంటి వద్దనే కాల్చి చంపారు . ఈ జాబితాలో కల్ బుర్గీ(కర్నాటక) పన్సారే(మహారాష్ట్ర) ఇంకా చాలామంది ఉన్నారు. ఇక అర్బన్ నక్సలైట్లు సరేసరి. తుదకు రాహుల్ గాంధీని కూడా అర్బన్ నక్సలైట్ అనడమే..”
తొలి ప్రపంచ యుద్ధం తరువాత జర్మనీలో ఏర్పడిన అస్తవ్యస్త పరిస్థితులను ఆలంబన చేసుకొని నియంత హిట్లర్ నాజీ మూకల ద్వారా సాగించిన హింసాకాండ చరిత్ర పుటల్లో రక్తాక్షరాలతో లిఖించబడింది. ఈ తరహా విధ్వంస కాండ ఇప్పటికీ వివిధ దేశాల్లో వివిధ రూపాలతో భిన్న స్వభావాలతో తలెత్తుతోంది. భారత దేశంలో కూడా ఈ నయా నాజీయిజం వేళ్లూనిందని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ అధ్యక్షులు జస్టిస్ మార్కెండేయ కజ్టూ నాలుగేళ్ల క్రితమే చెప్పారు. ఆనాడు జర్మనీలో ఏర్పడిన దుస్థితికి యూదులు కారణమని హిట్లర్ జర్మనీ లను నమ్మించారు. ఈ తరహాలో భారత దేశంలో కూడా ప్రజాస్వామ్య లౌకిక వాదం పై మనువాదులు దాడులు చేస్తూ సనాతన ధర్మం పేరుతో మత మౌఢ్యం విస్తరిస్తున్నారు. ఈ క్రమంలోనే మొన్న సుప్రీంకోర్టు లో చీఫ్ జస్టిస్ గవాయ్ పై జరిగిన దాడిగా భావించాలి.
ఈ దుర్మార్గం ఇది మొదటిదీ కాదు. ఆఖరుదీ కాబోదు. ఈ దుర్మార్గులు ఎంచుకొన్న సందర్భం కూడా మాత్రం ప్రత్యేకమైనది. దేశ రాజ్యాంగ వ్యవస్థలో అత్యున్నత స్థానంలో ఉన్న వారినే లక్ష్యం చేసుకొంటే దేశంలో ఇక తమకు ఎదురు ఉండదనే భావనతో ఈ దాడి జరిగింది. అంతెందుకు.. జాతి పితగా ప్రపంచం మొత్తం శ్లాఘించిన మహాత్మా గాంధీ పుట్టిన రోజు ఏమైనది? గాంధీ ప్రాభవం తగ్గించేందుకు పోటీగా పెట్టిన ఆరెస్సెస్ సంస్థ ప్రచారం కూడా ఇందుకు కొనసాగింపుగానే భావించాలి. తదుపరి ఈ తుంటరి శక్తులు మహాత్మా గాంధీని తూల నాడుతూ సామాజిక మీడియాలో పెట్టిన పోస్టులు అతి హేయంగా ఉన్నాయి. వెను వెంటనే ఈ దాడి జరిగింది, ఇవన్నీ పూసల్లో దారంలాగా ఒకదాని కొకటి అనుబంధం కలిగి ఉన్నాయి.
2014 తర్వాత భారత దేశంలో మైనార్టీలు టార్గెట్ చేయ బడుతున్నారు. ఆవు ను పూజించడం పేరుతో పైశాచిక కాండకు శ్రీ కారం చుట్టారు. ఈ వెర్రి ఎంత వరకు వెళ్లిందంటే ఆవు ను పూజించడంతో మొదలై విజ్ఞాన శాస్త్రాన్ని తుంగలో తొక్కి దాని మూత్రం సర్వరోగ నివారిణిగా అధికారిక బాధ్యతాయుత స్థానాల్లో ఉన్న వారు ప్రచారం ప్రారంభించారు. లౌకికవాదం గురించి మాట్లాడే వారిని దేశ ద్రోహులుగా చిత్రించబడుతున్నారు. ముస్లిములకు చెందిన వక్ఫ్ బోర్డులో మతేతరులు ఉండవచ్చు. హిందూ మతానికి చెందిన ఆలయాల్లో మతేతరులు ఉండ కూడదు. కొన్ని రాష్ట్రాల్లో లౌకికవాదులుగా ముద్ర వేసి ఏకంగా కొందరు హత్య చేయబడ్డారు.లౌకిక వాదం అంటరాని తనమైంది. ఇందుకు చాల సంఘటనలున్నాయి. కర్ణాటకలో గౌరి లంకేష్ ను తన ఇంటి వద్దనే కాల్చి చంపారు . ఈ జాబితాలో కల్ బుర్గీ(కర్నాటక) పన్సారే(మహారాష్ట్ర) ఇంకా చాలామంది ఉన్నారు. ఇక అర్బన్ నక్సలైట్లు సరేసరి. తుదకు రాహుల్ గాంధీని కూడా అర్బన్ నక్సలైట్ అనడమే.
నక్సలైట్ లను ఎలాగూ పిట్టలను కాల్చినట్లు కాల్చి మట్టుబెడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాకు చెందినా ఎక్కువ కాలంగా ఉత్తరాది రాష్ట్రాల్లో ఉండి పోయిన స్వామి అగ్నివేశ్ ను ఈ మనువాదులు నడిరోడ్డుపై బట్టలు చించి వేసిన సందర్భముంది. పైగా స్వామి అగ్నివేశ్ ఎప్పుడూ కాషాయ వస్త్రాలు ధరించుతారు. ఆయన చేసినదల్లా లౌకికవాదంతో ఉండటం ఆర్య సమాజ భావజాలంతో ఉండటమే. తాజాగా పట్ట పగలు నిండు న్యాయ స్థానంలో జరిగిన దాడి తర్వాత లౌకికవాదులే కాకుండా ప్రజాస్వామ్య భావజాలం గల అందరూ జాగ్రత్త పడవలసిన సమయం ఆసన్నమైంది.
తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లు ప్రజాస్వామ్య పదం ఉచ్చరించే వారిపై దాడులు జరగవనే గ్యారంటీ ఏమిటి? నాజీ జర్మనీ లో కూడా తొలుత యూదులపై జరిగిన దాడులు చివరకు కమ్యూనిస్టులపై మొదలై చివరకు ఎక్కడికి దారి తీసింది చరిత్ర పుటలు తిరగేస్తే కఠోర వాస్తవాలు కళ్లకు కడతాయి . జర్మనీలో నాజీ పాలన అనుభవాల గురించి మార్టిన్ నీమోల్లర్ (1892-1984) అనే మత గురువు చెప్పిన మాటలు ఉదాసీనంగా ఉంటే భారతదేశంలో పునరావృతం కావనే గ్యారంటీ ఏమిటి? వాళ్లు తొలుత కమ్యూనిస్టుల కోసం వచ్చారు. నేను కమ్యూనిస్టు కాదు కాబట్టి మాట్లాడలేదు. తర్వాత వాళ్ళు యూదుల కోసం వచ్చారు. నేను యూదును కాదు కాబట్టి ఎదురు మాట్లాడలేదు. తర్వాత వాళ్ళు కార్మిక నాయకుల కోసం వచ్చారు. నేను కార్మిక నాయకుణ్ణి కాదు మాట్లాడలేదు. తర్వాత వాళ్ళు కాథలిక్కుల కోసం వచ్చారు. నేను ప్రొటెస్టెంట్ ను. మాట్లాడలేదు. చివరకు వాళ్లు నా కోసం వచ్చారు. అప్పటికి నా కోసం మాట్లాడేందుకు ఎవరూ మిగిలి లేరు. తస్మాత్ జాగ్రత్త. ఈ పరిస్థితి భారత దేశంలో రాకూడదు. సనాతన ధర్మం పేరుతో మత మౌఢ్యం వికటాట్టహాసం చేస్తోంది. విష కోరలు చాస్తోంది.
-వి. శంకరయ్య
విశ్రాంత పాత్రికేయులు





