“నారాయణరెడ్డి 1908, జూన్ 4న ఉమ్మడి నల్లగొండ జిల్లా బొల్లేపల్లిలో జన్మించారు. హైదరాబాద్‌లోని రెడ్డి హాస్టల్ మిడిల్ స్కూల్లో ఫస్ట్‌ఫారం చదువుకున్నారు. బండి యాదగిరి రాసిన నైజాము సర్కరోడా అనే పాటకు రావినారాయణ రెడ్డి, భీమ్ రెడ్డి నర్సింహారెడ్డి ప్రేరణ వారు. చదువరాని వారిని సైనికులగా పోరాటాన్ని నూరుపోసిన వారు నారాయణ రెడ్డి. చాదార్ ఘాట హైస్కూల్ లో, నిజాం కాలేజిలో ఇంటర్ చదువుకున్నారు. 1930 లో కాకినాడలో ఉప్పుసత్యాగ్రహంలో పాల్గొన్నారు. 1934న గాంధీని ఆహ్వానించి అంటరాని నివారణకు ప్రచారం చేసారు. నారాయణ రెడ్డి భార్య సీతాదేవి ఒంటిపై నగరాన్ని అమ్మి ఆ సొమ్ముతో స్వరాజ్య నిధికి ఇచ్చారు. 700 ఎకరాలలో 500 ఎకరాలను పేదలకు పంచారు. వారికి 1992లో పద్మవిభూషణ్ గా గుర్తింపు లభించింది. కాని అంతకుముందే చనిపోయారు. 1952లో పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ నుంచి గెలిచిన తొలి ఎంపీ ఆయన.”
24.జనధర్మో విజయతే
మార్క్సిజానికి భవిష్యత్తు ఉన్నదా? రావి నారాయణ రెడ్డి ప్రశ్న
కమ్యూనిజంపై నేడు తూర్పు యూరపు దేశాల్లో వస్తున్న వ్యతిరేకత గురించి జగన్నాథం అడిగారు. దానికి రావి నారాయణ రెడ్డి వివరణ ఇది మరో వివరణ: ‘‘గొర్బోచెవ్ ప్రవేశ పెట్టిన ‘పెరిస్ట్రోయికా‘ ‘గ్లాస్ నోస్త్‘ అవసరమైన చర్యలే. తూర్పు యూరప్ దేశాలు సోవియట్ యూనియన్ వలె కమ్యూనిజాన్ని పోరాడి సాధించుకోలేదు. హిట్లర్కు వ్యతిరేకంగా సోవియట్ దేశం ఆ దేశాల్ని ఆక్రమించి అక్కడ కమ్యూనిజాన్ని నెత్తిపై రుద్దింది. ఈ కమ్యూనిస్టులు అక్కడి మెజారిటీ ప్రజల మీద పెత్తనం సాగించినారు. ఎప్పుడైతే ఎన్నికలు జరిగినవో అప్పుడు ప్రజలు కమ్యూనిస్టులను ఓడించి ప్రజా ప్రభుత్వాలను స్థాపించుకున్నారు. కమ్యూనిజాన్ని ప్రజాస్వామిక పునాదుల పైన స్థాపించాలన్న దృక్పథం కలవాడు గొర్భోచెవ్. ప్రపంచంలో ‘ఆటం యుద్ధం‘ రాకుండా కాపాడగలుతున్నాడు. అందువల్ల అతన్ని ‘మహాత్మా గొర్బోచెవ్ ‘ అనవచ్చు. ఎందుకంటే ప్రపంచాన్ని రక్షిస్తున్నాడు’’.
మార్క్సిజానికి భవిష్యత్తు ఉన్నదా?
మరో ప్రశ్నలో మన దేశంలో మార్క్సిజానికి మంచి భవిష్యత్తు ఉన్నదని మీరు విశ్వ సిస్తున్నారా అని అడిగారు. నారాయణ రెడ్డిగారు ‘‘మన దేశంలోనే కాదు, ప్రపంచంలోనే మంచి భవిష్యత్తు ఉన్నది. ఫ్రాన్స్, ఇటలీ వంటి దేశాలు రేపు ప్రజాస్వామ్య పద్ధతిలో కమ్యూనిజాన్ని స్థాపించుకునే అవకాశం ఉన్నది. అట్లాగే ఇతర యూరప్ దేశాల్లోనూ జరుగవచ్చు.’’ అన్నారు.
నిజాం కాలంలో ఆర్యసమాజం ఎందుకు పుట్టవచ్చింది
పేర్వారం జగన్నాథం ‘‘నిజాం కాలంలో చాలా మంది ప్రజానాయకులు ఆర్యసమాజం నుండి పుట్టవచ్చినట్లు కనిపిస్తున్నది. ఐతే మీరు మాత్రం అందులో పనిచేసిన దాఖలా లేదు. ఎందుకు?’’ అని ప్రశ్నించారు. చాలా సందర్భంలో యం యస్ ఆచార్య గారు కూడా ఇదే ప్రశ్నవేసేవారు. ‘‘చాలామంది ఆర్యసమాజం నుండి వచ్చినా రనుకోవడం పొరపాటు అని రావి నారాయణ రెడ్డి వివరించారు. ప్రథమ దశలో ఆర్యసమాజం నిజాం వ్యతిరేక చైతన్యాన్ని ప్రజల్లో బాగానే కలిగించింది. కాని ఆర్యసమాజం మతసంస్థ. అది రాజకీయ సంస్థకాదు. అందువల్ల, నేను అందులో చేరవలసిన అవసరం కలుగలేదు. విద్యార్థిగా ఉన్నప్పుడు నేను ఆ సభలకు వెళ్లేవాణ్ణి తప్ప అందులో చేరలేదు’’ అన్నారు.

బి.జె.పి. సెక్యులర్ ఫోర్స్ కాదు: ప్రజారాజ్యం బతికేమిటి?
మన ప్రజాస్వామ్యం సంగతేమిటి ‘ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్‘ అని అంటే ‘‘మన దేశంలో ప్రజాస్వామ్యం ఆరోగ్యంగా నడుస్తున్నదని భావిస్తున్నారా? మన ఎన్నికల విధానంపై మీ కేలాంటి అభిప్రాయాలున్నాయి?’’ ఈ రోజుల్లో ప్రతివాడు దేశం నాకేమి చేస్తుందని ఆలోచిస్తున్నాడు. కానీ, అతడు దేశానికి చేసేదేమీ లేదు. అవినీతి లంచగొండితనం మతమౌఢ్యం వంటి జాడ్యాలతో నేటి మన ప్రజాస్వామ్యం ఆనారోగ్యంతో బాధపడుతున్నది. దేశంలో మతతత్త్వ, కులతత్త్వ ధోరణులు ప్రమాదకరంగా మారినాయి. దీన్ని ఎదిరించడం అవసరం.
దీన్ని ఎదిరించడానికి ‘సెక్యులర్ ఫోర్సెస్‘ ఏకం కావాలి. అవి ఇప్పుడు బలంగానే ఉన్నాయి. అన్నింటికన్న బలమైన సెక్యులర్ ఫోర్స్ నేడు కాంగ్రెస్. కనుక కాంగ్రెసుపార్టీ వామ పక్షాలను తనతో సంఘటితపరచుకొని ఈ దుస్థితిని తొలగించాలి. బి.జె.పి. సెక్యులర్ ఫోర్స్ కాదని నా అభిప్రాయం. అది మతతత్త్వంతో కూడిన పార్టీ. మన రాజ్యాంగంలో ఉన్న ఆదర్శసూత్రాలు, ఆదేశిక సూత్రాలుగా మారాలి. ఎన్నికల విధానం ఎంతో లోపభూయిష్టంగా ఉన్నది. ఎన్నికలలో పోటీచేయాలంటే లక్షలు ఖర్చు పెట్టాలి. సామాన్యునికి, ఎన్నికలు అందుబాటులో లేవు. ఎన్నికల పద్దతి మారాలి. ‘టెరిటోరియల్ రిప్రజెంటేషన్‘కు బదులు ‘ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్‘ రావాలని అన్నారు.
ఎల్లో జర్నలిజం, మేధావులు సరియైన పాత్ర ఎక్కడుంది?
జగన్నాథం ప్రశ్నకు ప్రజాస్వామ్య వ్యవస్థను బలపరచడంలో మన మేధావి వర్గంకానీ, వార్తాపత్రికలు కాని, ఎటువంటి పాత్రను నిర్వహిస్తున్నవో అనడిగితే ‘‘ చాలా మంది మేధావులు సరియైన పాత్రను నిర్వహించడం లేదు. దీనికి కొంత కల్మషమైన రాజకీయ వాతావరణం కూడ కారణం కావచ్చు. అందుకు వాళ్ల స్వార్థచింతన కూడ తోడవుతున్నది. దేశంలో ముఖ్యమైన పత్రికలు, ఎక్కువగా పెట్టుబడి దారి ఆధిపత్యం కింద ఉన్నాయి. ఎల్లో జర్నలిజం పెరిగింది’’ అన్నారు.
మనదేశ చరిత్రలో కమ్యూనిస్టుపార్టీ నిర్వహణ
మనదేశ చరిత్రలో కమ్యూనిస్టుపార్టీ నిర్వహణ సంగతి అడిగితే ‘‘భారత కమ్యూనిస్టు పార్టీ మనదేశ చరిత్రలో గొప్ప పాత్రనే నిర్వహించిందని వివరించారు. ‘‘అది బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడింది. మీరట్ వంటి కుట్రకేసుల్లో శిక్షింపబడి, అసువులు బాసిన అమర వీరులెందరో ఉన్నారు. కమ్యూనిస్టు పార్టీ మొదటి నుంచీ కష్టజీవుల పార్టీగా పని చేసింది. దేశంలో మొదటిసారిగా రైతుసంఘాలు, కార్మిక సంఘాలు, విద్యార్థి సంఘాలు, మహిళాసంఘాల్ని స్థాపించి ఈ పార్టీలో ఉన్నటువంటి ప్రజల్ని చైతన్యవంతం చేసింది. త్యాగధనులు, నీతిపరులు మరే పార్టీలోనూ లేరంటే అతిశయోక్తి కాదు. భూస్వాములకు జమీందారులకు వ్యతిరేకంగా పోరాడి, భూసమస్యను పరిష్కరించింది. ఫ్యూడల్ వ్యవస్థకు వ్యతిరేకంగా తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటాన్ని నడిపించిన ఘనత, కమ్యూనిస్టు పార్టీకే దక్కింది. బెంగాల్లో ‘తెబాగా‘ పోరాటాన్ని, కేరళలో ‘పున్నప్ప వాయిలర్‘ పోరాటాన్నీ కమ్యూనిస్టు పార్టీ నడిపింది అని రావి నారాయణ రెడ్డి గారు జగన్నాథం గారు వివరించారు.
కమ్యూనిస్టుపార్టీ ఘోరమైన తప్పులు
మరో ప్రశ్నకు జవాబిస్తూ రావి గారు: ‘‘బొంబాయిలో జరిగిన నావికుల తిరుగుబాటును బలపరిచిందనీ ఐతే ఇంత చేసినా కమ్యూనిస్టుపార్టీ కొన్ని ఘోరమైన పొరపాట్లను కూడ చేసిందని చెప్పక తప్పదు. అవేమంటే, దేశంలో 1930-34 ప్రాతంలో సాగిన ఉప్పు సత్యాగ్రహాన్ని వ్యతిరేకించడం, 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో జాతీయవాదులతో కలిసిపోరాడక పోవడం, అంతేకాక, అప్పటి రెండవ ప్రపంచ యుద్ధాన్ని ప్రజాయుద్ధంగా అభివర్ణించడం పెద్దతప్పు. అది ఇతర దేశాలకు ప్రజాయుద్ధం కావచ్చునేమో కాని మనకు మాత్రం కాదు. మహాత్మా గాంధీ మీరట్ జైలుకు వెళ్లి జాతీయ పోరాటంలో పాల్గొనవలసిందిగా ప్రార్థించినా కూడ కమ్యూనిస్టు నాయకులు మొండిగా నిరాకరించినారు. పాకి స్తాన్ నినాదాన్ని కమ్యూనిస్టు పార్టీ గుడ్డిగా బలపరిచింది.
1948 లో తెలంగాణా సాయుధ పోరాటాన్ని ఆపివేయక, అనాలోచితంగా కొనసాగించడం, స్వాతంత్ర్యానంతరం కూడ భూ సమస్యల మీద కానీ, దేశ ప్రగతి గురించి కానీ, సరియైన దృక్పథం లేకుండా కేవలం నెహ్రూ ప్రభుత్వాన్ని పడగొట్టాలన్నదే ధ్యేయంగా పెట్టుకోవడం వంటి పొరపాట్లనెన్నో కమ్యూనిస్టు పార్టీ చేసింది. దానికి 1936-42 వరకు మాత్రమే మంచి చరిత్ర ఉన్నది. ఆ సమయంలో కాంగ్రెస్తో కలిసి ఆ సామ్రాజ్యవాద వ్యతిరేక ఐక్య సంఘటనగా పని చేసింది. ఆ సమయంలోనే పార్టీ బలపడింది. ఆ సమయంలో తప్ప కమ్యూనిస్టు పార్టీ చరిత్ర అంతా ‘సెక్టేరియన్‘ పంథాలో నడిచింది.
ఇంకా చెప్పాలంటే ఎం.ఎన్.రాయ్ ఒక సెక్టేరియన్. స్టాలిన్ మరొక సెక్టేరియన్. స్వాతంత్య్రం వచ్చిన తరువాత ప్రజలు అభివృద్ధిని కోరినారు. ఈ అభివృద్ధి కార్యక్రమాల్లోనూ కమ్యూనిస్టు పార్టీకి ఏ విధమైన పాత్ర లేదు. పనిగట్టుకొని ఏమి జరుగడం లేదనే ప్రచారం చేసినారు. నిజంగా నెహ్రూ కాలంలో అభివృద్ధికి పునాదులు పడినాయి. ఈ కారణాల వల్ల దేశంలో కమ్యూనిస్టు పార్టీ క్రమంగా క్షయరోగి వలె క్షీణిస్తూ వచ్చింది. ఈ తప్పిదాలను నేను ఎప్పటికప్పుడు అగ్రనాయకుల దృష్టికి తీసుకవెళ్లినాను. ఇట్లా కమ్యూనిస్టుపార్టీ మొదటి నుంచీ జాతీయ జీవన స్రవంతిలో కలువనందున సత్ఫలితాలు దక్కలేదు’’ అన్నారు.
అవినీతిని నిర్మూలించండి
ఆంధ్రప్రభ దినపత్రిక 16-9-1990 నాడు రావినారాయణ రెడ్డి ఇంటర్వ్యూలో పేర్వారం జగన్నాథం చివరిగా ‘‘యువకులు సేవా తత్పరతను అలవరుచుకోవాలి. ఎక్కువ ఉత్పత్తిని సాధించాలి. సరియైన విధంగా దాన్ని పంపిణీ చేయాలి. అవకాశవా దాన్నీ, అవినీతిని విసర్జించాలి. నీతి నిజాయితీలను పెంచుకోవాలి. వ్యక్తిగతంగా ఎదిగి దేశానికి సేవ చేయాలి.
దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ్ అన్న గురజాడ మాటల్ని ఆచరించి చూపాలి’’ అని వివరించారు. ఆనాటి తెలంగాణ పరిస్థితి జగన్నాథం గారు మనకు తెలిపారు. ఇక ప్రస్తుతం అవినీతిని విసర్జించడం అంటే సాధ్యమా అని ఆచార్యగారు అంటూ ఉండేవారు. చివరకు వరంగల్ వాణి పత్రిక ఆ అవినీతి దెబ్బతో అమ్ముకోవలసింది. ప్రభుత్వ ప్రకటనలలో బిల్లుకు 60 శాతం తమకు ఇవ్వాలని ప్రభుత్వ అధికారులు అడుక్కోవడంతో ఏ పత్రిక ఏ విధంగా బతుకుతుంది అని ప్రశ్నంచారు ఆచార్య.





