– అమెరికా దాడులతో మొదటికొచ్చిన వ్యవహారం
వాషింగ్టన్,జూన్1: శాంతి ఒప్పందం ఓ కొలిక్కి వచ్చిందనుకొనేలోపే పశ్చిమాసియా పేలుళ్లతో మళ్లీ దద్దరిల్లింది. అమెరికా దళాలు ఇరాన్ లోని గురుక్ నగరం, ఖేష్మ్ ద్వీపంలోని సైనిక లక్ష్యాలపై దాడులు చేశాయి. ఆత్మరక్షణ కోసం ఈ దాడులు చేపట్టినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ ఎక్స్ వేదికగా పోస్టు చేసింది. అంతర్జాతీయ జలాలపై ప్రయాణిస్తున్న తమ ఎంక్యూ1 డ్రోన్‌ను కూల్చివేయడం, ఇతర దుందుడుకు చర్యలకు ప్రతిస్పందనగానే తాము ఈ దాడి చేసినట్లు వెల్లడించింది. తమ దాడిలో ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ, గ్రౌండ్ స్టేషన్, రెండు అటాక్ డ్రోన్లు ధ్వంసమైనట్లు పేర్కొంది. వీటి నుంచి తమ యుద్ధ నౌకలకు ముప్పు పొంచి ఉన్నట్లు తెలిపింది. సిరిక్ ద్వీపంలోని టెలికామ్ టవర్స్‌పై అమెరికా దాడి చేసిందని ఇరాన్ ఐఆర్‌జీసీ వెల్లడించింది. దీనికి ప్రతిగా అగ్రరాజ్యం దాడికి వాడిన ఎయిర్‌బేస్‌ను తాము లక్ష్యంగా చేసుకొన్నామని ప్రకటించింది. ఐఆర్‌జీసీ ఏరోస్పేస్‌టైగర్స్ ప్రతిదాడి చేశారని తెలిపింది. కానీ, ఏ బేస్‌పై దాడి చేశారో మాత్రం వెల్లడించలేదు. అయితే అంతకు కొన్ని గంటల ముందు కువైట్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ దాడులను గుర్తించి యాక్టివేట్ అయినట్లు వార్తలొచ్చాయి. హర్మూజ్‌ను నియంత్రించాలంటే ఇరాన్ ఖేష్మ్ మిసైల్ సిటీని కూడా ధ్వంసం చేయడం అమెరికాకు చాలా ముఖ్యం. ఇక్కడ అండర్‌గ్రౌండ్ సిటీలో యాంటీ షిప్ క్రూజ్ క్షిపణులు ఉన్నాయి. జలసంధిలోని నౌకలను లక్ష్యంగా చేసుకోవడం కోసం వీటిని వాడతారు. గడా 380, హెచ్‌వై-2 సిల్క్‌వార్మ్‌ను ఇరాన్ ఇక్కడ సిద్ధంగా ఉంచింది. ఇక బాలిస్టిక్ క్షిపణుల్లో 800 కిలోమీటర్ల రేంజ్ ఉన్న ఖియామ్-1, ఖైబర్ షెకన్, ఘద్ర, ఎమాద్ మిసైల్స్‌ను భద్రపర్చింది. వీటితోపాటు వేగంగా దాడి చేసే స్పీడ్‌బోట్స్, తీరప్రాంత క్షిపణి బ్యాటరీలు కూడా ఉన్నాయి.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




