ఇం‌దిరమ్మ ఇండ్ల ప్రక్రియను వేగవంతం చేయండి..

•అనర్హులని తేలితే ఎప్పుడైనా రద్దు చేస్తాం..
•అనర్హులకు మంజూరు చేశామన్న మాట రావొద్దు..
•రెవెన్యూ, హౌసింగ్‌, ‌సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి  

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 9  :  రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల పథకంలో దరఖాస్తుల పరిశీలన, లబ్ధిదారుల ఎంపిక  ప్రక్రియను వేగవంతం చేయాలని రెవెన్యూ, హౌసింగ్‌, ‌సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. జనవరి మూడో వారంలో నిర్వహించిన గ్రామసభల్లో ఇందిరమ్మ ఇండ్ల కోసం వొచ్చిన దరఖాస్తులను వెంటనే పరిశీలించి లబ్దిదారుల ఎంపిక ప్రక్రియను చేపట్టాలని మంత్రి పొంగులేటి ఆదేశించారు. సోమవారం సచివాలయంలో ఇందిరమ్మ ఇండ్లపై మంత్రి అధికారులతో సమీక్ష నిర్వహి ంచారు.

ఈ సమావేశంలో హౌసింగ్‌ ‌స్పెషల్‌ ‌సెక్రటరీ జ్యోతి బుద్ద ప్రకాష్‌, ‌హౌసింగ్‌ ‌కార్పొరేషన్‌ ఎం‌డీ వీపి గౌతమ్‌ ‌పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జనవరి 26న మోడల్‌ ఇం‌దిరమ్మ ఇండ్ల లబ్దిదారులను ఎంపిక చేసిన 562 గ్రామాల్లో ఎదురైన పరిస్ధితులు, మంచి చెడులను పరిగణనలోకి తీసుకొని ఇప్పటివరకు ఎదురైన సమస్యలను అంచనా వేసి లబ్దిదారుల ఎంపిక ప్రక్రియను చేపట్టాలని సూచించారు. అర్హత గల లబ్దిదారులను గుర్తించడంలో పకడ్బందీగా వ్యవహరించాలి.

వీలైనంత మేరకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని అర్హులకే ఇందిరమ్మ ఇండ్లు లభించేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ఏ దశలో ఉన్నాకూడా అనర్హులని తేలితే వాటిని రద్దు చేస్తామని మంత్రి పొంగులేటి ప్రకటించారు. ఇండ్ల కోసం దరఖాస్తు చేసిన సమయంలోనే వారి అర్హతలను నిర్ధారించగలగాలన్నారు. దీనివల్ల అర్హులకు న్యాయం జరుగుతుంది. అర్హతలేని వారు లబ్దిదారుల జాబితాలో చేరకుండా ప్రాథమిక స్థాయిలోనే గుర్తించాలి.

అర్హులైన ప్రతిఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వడమే ఈ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. అర్హులైన వారు ఇండ్లు పొందలేదని ఫిర్యాదులు ఉంటే క్షేత్ర స్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకోవాలి. ఇండ్ల మంజూరులో నిరుపేదలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల విషయంలో నిరుపేదలు ఎదురు చూస్తున్నారు. వారి ఆశలకు అనుగుణంగా అధికారులు పనిచేసి అత్యంత నిరుపేదలను ఎంపిక చేసి పారదర్శకంగా జాబితాను తయారు చేయాలన్నారు. ఏదశలోనూ అనర్హులకు మంజూరు చేశామన్న మాటే రావొద్దని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *