భారత్ కు ప్రపంచస్థాయి నాయకత్వ లక్షణం

– అన్ని రంగాల్లో దూసుకు పోయే తత్వం
– సత్తా చాటగల నైపుణ్యాలు మన సొంతం
– యువత ఓ గంట సమయం కేటాయిస్తే చాలు
– జనగణనలో ఖచ్చితమైన సమాచారం ఇవ్వండి
– దానితోనే దేశ అభివృద్ధి ప్రణాళికలు రచించగలం
– ఎర్రకోట నుంచి ప్రధాని మోదీ పిలుపు
– వేడుకలకు దూరంగా రాహుల్, ఖర్గే

న్యూదిల్లీ, ఆగస్ట్ 15: భారత్ కు ప్రపంచస్థాయి నాయకత్వ లక్షణాలు ఉన్నాయని, అన్నిరంగాల్లో దూసుకుపోయే సమర్థత ఉందని ప్రధాని మోదీ అన్నారు. సవాళ్లు స్వీకరించి ముందుకు సాగడం ద్వారా మనమేంటో సత్తా చూసగలమన్నారు. ఎర్రకోట వేదికగా ప్రధాని మోదీ యువత లక్ష్యంగా పలు కార్యక్రమాలను ప్రకటించారు. కోటిమంది యువతకు ఏఐ నైపుణ్యాలలో శిక్షణ ఇస్తామని, పోటీ పరీక్షలకు ఉచిత ఆన్లైన్ కోచింగ్ అందిస్తామన్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాలపై ఉన్న ఆర్థిక భారాన్ని తగ్గించడమే ఉచిత కోచింగ్ కార్యక్రమ లక్ష్యమని చెప్పారు. అలాగే ప్రస్తుతం దేశంలో జరుగుతోన్న జనగణన గురించి ప్రస్తావించారు. దానిలో యువత చురుగ్గా పాల్గొనాలని మోదీ పిలుపునిచ్చారు. ‘నేను అందరినీ ఒక ఫేవర్ చేయాలని అడుగుతున్నాను. ఒక గంటా, రెండు గంటల సమయం కేటాయించండి. అది దేశానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఆ మాత్రం సమయం దేశాన్ని ఎలా బలోపేతం చేస్తుందా అని యువత ఆలోచిస్తూ ఉండొచ్చు. వారి భాగస్వామ్యంతో ప్రతి ఇంట్లో జనాభా గణనకు ఒక అనుకూల వాతావరణం ఏర్పడేందుకు అవకాశం ఉంటుంది. గణన అంటే లెక్కలన్నీ ఒక దగ్గర రాసుకోవడం కాదు. జనాభా లెక్కల సమయంలో ప్రజలు ఇచ్చే వివరాల ఆధారంగానే జాతీయ విధానాలు, పథకాలు రూపుదిద్దుకుంటాయి. దేశ ప్రగతికి ఆ లెక్కలు సూచీగా ఉంటాయి. అందుకే కచ్చితమైన, స్పష్టమైన సమాచారం ఇవ్వడం అత్యంత కీలకం అని మోదీ పేర్కొన్నారు. అలాగే ‘దిమాగీ నక్సల్స్’ గురించి మాట్లాడుతూ.. వారిని దేశానికి కొత్త శత్రువులుగా అభివర్ణించారు. ‘సంవత్సరాలుగా మావోయిస్టు భావజాలం ఉన్న వ్యక్తులు దేశంలో బలంగా పాతుకుపోయారు. అడవుల్లోని సాయుధ నక్సల్స్ ను నిర్మూలించి, ఆ సంక్షోభం నుంచి దేశాన్ని విముక్తి చేయడంలో ప్రభుత్వం విజయం సాధించింది. సాయుధ నక్సల్స్ కనుమరుగైనా ‘దిమాగీ నక్సల్స్’ మిగిలి ఉన్నారు. వారు ఒక అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. మనం వారిని గుర్తించి ఏకాకిని చేయాలి అని సూచించారు. తయారీ, వ్యవసాయం, సాంకేతికత, మౌలిక సదుపాయాలు, రక్షణ రంగం, గ్రీన్ అండ్ బ్లూ ఎకానమీ, ఇండియాస్ సాప్ట్ పవర్ కోసం ‘సప్తధార’ రోడ్మ్యప్ను మోదీ ప్రకటించారు. మహిళా కోటా బిల్లుపై ప్రతిష్టంభన నెలకొన్న నేపథ్యంలో.. తన ప్రసంగంలో దాని ప్రస్తావన తీసుకువచ్చారు. ప్రతిపక్షాలు విభేదాలను పక్కనపెట్టి పార్లమెంట్, శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు సహకరించాలని కోరారు. క్రెడిట్ వారే తీసుకున్నా ఫర్వాలేదని, కానీ బిల్లు పాసయి మహిళలకు గౌరవం దక్కాలన్నదే తన ఆకాంక్ష అన్నారు. భారత్ ఇకపై చిన్న కలలతో ముందుకు వెళ్లలేదని, ఆలోచనా పరిధి విస్తృతం చేసుకునేందుకు ఉన్నత లక్ష్యాలు అవసరమని మోదీ పిలుపునిచ్చారు. భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారినప్పుడు ప్రపంచం మన వైపు చూసే తీరే మారుతుందని పేర్కొన్నారు. ఇతర దేశాలపై ఆధారడి జీవించలేమని, స్వయం సమృద్ధి సాధించాలన్నారు. టెక్ ప్రపంచంలో చిప్ల విలువను భారతదేశం అర్థం చేసుకుంటోందని, అందుకే మూడు సెకండక్టర్ ప్లాంట్లను ఏర్పాటు చేసిందని తెలిపారు. సప భవిష్యత్తులో మరిన్ని సెకండక్టర్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఇప్పుడు ప్రతి భారతీయుడు స్థానిక ఉత్పత్తులకు మద్దతు ఇవ్వడంపై సంతోషం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వ హయాంలో 25 కోట్లమంది పేదరికం నుంచి బయటపడారని తెలిపారు. అభివృద్ధి దిశగా దృఢ సంకల్పంతో పయనిస్తోన్న 140 కోట్ల మంది భారతీయులను ఆపడం అసాధ్యం అని అన్నారు. దేశంలోని పలు ప్రాంతాల్లో ఇటీవల సంభవించిన విపత్తుల గురించి ప్రస్తావించారు. బాధిత కుటుంబాలకు దేశం మొత్తం అండగా ఉంటుందని సంఘీభావం తెలిపారు. దేశంలో 70 నగరాల్లో పైడ్లైన్ ద్వారా గ్యాస్ అందిస్తున్నాం. 1.75 కోట్ల ఇళ్లకు పైప్ ద్వారా వంట గ్యాస్ సరఫరా చేస్తున్నాం. ఇంధన భద్రత సాధించడం దేశ తక్షణ అవసరం. వంద గిగావాట్ల అణు ఇంధనం సాధించడం మన లక్ష్యం అన్నారు.  ఇటవలే హైడ్రోజన్ రైలును విజయంతంగా నడిపిం చాం. 90 ఏళ్లలో 30 శాతం మాత్రమే రైళ్ల ఎలక్ట్రిఫికేషన్ జరిగింది. 10 ఏళ్లలో 70 శాతం రైళ్ల ఎలక్ట్రిఫికేషన్ పూర్తి చేశాం. ఇటీవలే హైడ్రోజన్ రైలును విజయవం తంగా నడిపించామని అన్నారు. 50 లక్షల ఇళ్లకు సౌరశక్తి విద్యుత్ అందిస్తున్నాం. దేశంలో ఐదు న్యూక్లియర్ రియాక్టర్లు ఏర్పాటు చేస్తున్నామని మోదీ తెలిపారు.

హాజరుకాని రాహుల్, ఖర్గే 

అయితే స్వాతంత్య వేడుకల్లో ఈసారి కూడా లోక్సభ, రాజ్యసభల్లో విపక్ష నేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే హాజరు కాలేదు. సీటింగ్, ఇతర ప్రొటోకాల్స్ వారి పదవులకు అనుగుణంగా ఉండటం లేదని కాంగ్రెస్ గతంలో ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వారు వరుసగా రెండోసారి గైర్హాజరయ్యారు.

వరుసగా 13వసారి జెండా ఆవిష్కరణ   
తొలిసారిగా పూర్తిస్థాయి వందేమాతర గీతాలాపన 

ఢిల్లీలోని ఎర్రకోటపై మోదీ వరుసగా 13వ సారి జాతీయ జెండా ఎగురవేశారు. దేశ చరిత్రలో తొలిసారిగా వందేమాతరం గేయాన్ని పూర్తిగా ఈ వేడుకల్లో ఆలపించారు. అనంతరం జాతీయ గీతం ‘జనగణమన’ను ఆలపించారు. ఆ సమయంలో వాయుసేన పూలవర్షం కురిపించింది. ఒక హెలికాప్టర్ జాతీయు పతాకాన్ని.. మరొకటి ‘వందేమాతరం’ అని రాసి ఉన్న జెండాను మోసుకెళ్లాయి. వందేమాతరం గేయానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గతేడాది నవంబర్ 7 నుంచి ఏడాదిపాటు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే జాతీయ గీతం జన గణ మనతోపాటు వందేమాతరానికి ప్రభుత్వం -సమాన హోదా కల్పిస్తూ చట్టం చేసింది. స్వాతంత్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రముఖ సెర్చ్ ఇంజిన్ సంస్థ గూగుల్ ప్రత్యేక డూడుల్ ను రూపొందించింది. ఇది భారతీయ వస్త్ర కళలు, సంస్కృతీ సంప్రదాయాలు, వైవిధ్యాన్ని చాటిచెబుతోంది. 22 విభిన్న ప్రాంతీయ వస్త్ర సంప్రదాయాలను తెలియజేసే డిజైన్లు అందులో కనిపిస్తున్నాయి. చేతితో నేసిన ఈ వస్త్రాల డూడుల్ దేశవ్యాప్తంగా ఉన్న నేత కార్మికులు. రైతులు, బ్లాక్ – ప్రింటర్ల సామూహిక శ్రమను ప్రతిబింబిస్తోంది. జెండా ఎగురవేయడానికి ముందు ప్రధాని మోదీ రాజఘాట్ వద్ద మహాత్ముడికి నివాళులర్పించారు. అనంతరం ఎర్రకోట వద్ద గౌరవ వందనం స్వీకరించి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ వేడుకలు ప్రారంభమైన సమయంలో వాయుసేన పూలవర్షం కురిపించింది. స్వాతంత్య్ర దినోత్సవం రోజున మోదీ జెండా ఎగురవేయడం ఇది 13వసారి కావడం విశే షం. జెండా ఎగురవేసిన అనంతరం ఆయన దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *