– మోదీ నాయకత్వంలో నక్సలిజాన్ని తుడిచిపెట్టేశాం
– వ్యాక్సిన్ ఉంది.. బ్రహ్మోస్ ఉంది
– దేశ ప్రజల ఆశీస్సులు బీజేపీకే
– మేధావుల సమ్మేళనంలో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 12 : ప్రధాని నరేంద్ర మోదీ సుపరిపాలనలో భారత దేశం అంతర్జాతీయ వేదికలపై తిరుగులేని గౌరవాన్ని, శక్తివంతమైన గుర్తింపును సాధించిందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. 12 ఏళ్ల సుపరిపాలన-అభివృద్ధి-ప్రజా సంక్షేమం అనే అంశంపై సికింద్రాబాద్‌లో శుక్రవారం నిర్వహించిన మేధావుల సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. దేశంలో, అంతర్జాతీయంగా దేశం సాధించిన అపూర్వ ప్రగతిని వివరించారు. ప్రారంభంలో రాజ్‌నాథ్ సింగ్ ఉక్కు మనిషి సర్దార్ వల్లభభాయ్ పటేల్‌కు ఘన నివాళులర్పించారు. హైదరాబాద్‌ను దేశంలో అంతర్భాగంగా మార్చి దేశ ఐక్యతను, సమగ్రతను కాపాడటంలో పటేల్ అసాధారణమైన కృషిని స్మరించుకున్నారు. హైదరాబాద్‌కు రావడం ఎల్లప్పుడూ సంతోషాన్నిస్తుందని, ఇక్కడి భారీ జనసందోహం చూస్తుంటే దేశ ప్రజల ఆశీస్సులు బీజేపీకే ఉన్నాయని స్పష్టమవుతోందని అన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా, ప్రజలచే ఎన్నికై అత్యంత సుదీర్ఘకాలం దేశానికి సేవ చేసిన ప్రధానమంత్రిగా మోదీ రికార్డు సృష్టించారని, ఇది సామాన్యమైన విజయం కాదని, ప్రజల అచంచల విశ్వాసానికి ప్రతీక అని అన్నారు. అంతర్జాతీయంగా అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడిగా మోదీ గుర్తింపు పొందారంటూ, ఆయన నేతృత్వంలోని గత పన్నెండేళ్ల కాలం దేశ ప్రగతిలో, సంస్కరణలపరంగా చరిత్రాత్మకమైనదని అన్నారు. ఒక నమ్మకమైన నాయకుడికి ఉండాల్సిన నాలుగు గుణాలు పారదర్శకత (ఇంటిగ్రిటీ), నిజాయతీ, పని చేసే సామర్థ్యం, ఇచ్చిన హామీలను ఫలితాలుగా మార్చే నైపుణ్యం.. ప్రధాని మోదీలో సంపూర్ణంగా ఉన్నాయని చెప్పారు. మోదీ ప్రధాని కాగానే ‘నా ఖాంగీ, నా కిసీకో ఖానే దూంగా’ అని స్పష్టం చేశారని, మంత్రి అయినా, సామాన్యుడైనా అవినీతిని సహించేది లేదని నిరూపించారని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో 2జీ స్కామ్, కామన్వెల్త్ స్కామ్, ఆగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ స్కామ్ వంటి లక్షల కోట్ల అవినీతి వల్ల దేశ ప్రతిష్ఠ మసకబారిందని, సైనికుల భద్రతను కూడా పణంగా పెట్టారని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చాక రక్షణ బడ్జెట్‌ను రూ.2.5 లక్షల కోట్ల నుండి దాదాపు రూ.8 లక్షల కోట్లకు పెంచామని, రక్షణ రంగానికి కేటాయించే ప్రతి పైసా అత్యంత పారదర్శకంగా, దేశ భద్రత కోసమే ఖర్చవుతోందని రక్షణ మంత్రిగా హామీ ఇచ్చారు. బీజేపీ ఎన్నికల కోసం కాక రాబోయే తరం భవిష్యత్తు కోసం ఆలోచిస్తుందని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. తాము ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకున్నామని పేర్కొంటూ దేశంలోకి వచ్చే అక్రమ చొరబాటుదారులను సరిహద్దుల వెలుపలికి పంపుతామని చెప్పామని, బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఆ ప్రక్రియ వేగంగా జరుగుతోందని, పశ్చిమ బెంగాల్‌లో కూడా చొరబాటుదారులను బయటకు పంపే పని వేగవంతమైందని తెలిపారు. ముస్లిం మహిళల జీవితాల్లో శాపంగా మారిన తీన్ తలాక్ సామాజిక దురాచారాన్ని చట్టబద్ధంగా రద్దు చేశామని, వక్ఫ్ చట్టాల్లో అవసరమైన సంస్కరణలను విజయవంతంగా తీసుకొచ్చామని చెప్పారు. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించే చరిత్రాత్మక బిల్లును తీసుకొచ్చామని, మహిళలకు పూర్తి భాగస్వామ్యం, హక్కులు దక్కే వరకు తాము విశ్రమించబోమని, ఇది మోదీ ప్రభుత్వ గ్యారెంటీ అని స్పష్టం చేశారు. దేశంలో సమయం, వృధా ఖర్చులను తగ్గించడానికి లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలన్నదే (వన్ నేషన్ – వన్ ఎలక్షన్) మా ఆలోచన అని, అందరినీ విశ్వాసంలోకి తీసుకుని ఈ పనిని ఖచ్చితంగా చేసి తీరుతామని స్పష్టం చేశారు. గతంలో ఉగ్రవాద దాడులు జరిగినప్పుడు సర్జికల్ స్ట్రైక్స్ ద్వారా బుద్ధి చెప్పామని, అలాగే ‘ఆపరేషన్ సిందూర’ ద్వారా శత్రువులకు గట్టి సందేశం ఇచ్చామంటూ మానవత్వానికి శత్రువులైన వారికి సింధు నది నీటిని ఇచ్చే ప్రసక్తే లేదని, పాకిస్తాన్ వైఖరి మారనంత వరకు కఠినంగానే ఉంటామని స్పష్టం చేశారు. గత 12 ఏళ్లలో భారత దేశం ప్రపంచానికి ఒక ఆపద్బాంధవుడిగా, విశ్వబంధువుగా నిలిచిందన్నారు. ‘వసుదైక కుటుంబం’ అనే సందేశాన్ని మాటల్లో కాకుండా చేతల్లో చూపిన దేశం భారత్ అని చెప్పారు. మన దగ్గర ప్రపంచాన్ని రక్షించే వ్యాక్సిన్ ఎంత ఉందో శత్రువులను తుత్తునియలు చేసే ‘బ్రహ్మోస్’ మిసైల్ కూడా అంతకంటే శక్తివంతమైనది ఉందని హెచ్చరించారు. దశాబ్దాలుగా మన భద్రతా దళాలతో, సామాన్య ప్రజలతో రక్తపాతాన్ని సృష్టించిన నక్సలిజాన్ని మోదీ నాయకత్వంలో దాదాపు తుడిచిపెట్టేశామని రక్షణ మంత్రి సగర్వంగా ప్రకటించారు. గతంలో తుపాకీ శబ్దాలు మోగిన ప్రాంతాల్లో ఈరోజు స్కూల్ బెల్స్ మోగుతున్నాయని, రోడ్లు, అభివృద్ధి వేగంగా చేరుతున్నాయని చెప్పారు. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తూ ‘వన్ నేషన్, వన్ మార్కెట్, వన్ టాక్స’ విధానంతో జీఎస్టీని విజయవంతంగా అమలు చేశామని, దీనివల్ల ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పెరిగిందని అన్నారు. శ్రామికుల సామాజిక భద్రత, ఆదాయం పెంచేందుకు నాలుగు లేబర్ కోడ్‌లను తెచ్చామని, అలాగే వలస రాజ్యాల కాలం నాటి పాత చట్టాల స్థానంలో దేశ పౌరుల హక్కులను వేగంగా కాపాడేలా కొత్త న్యాయ చట్టాలను తీసుకొచ్చామని రాజ్‌నాథ్ తెలిపారు. జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్ 370ని ఎవరూ తొలగించలేరన్న కాంగ్రెస్ మాటలను పటాపంచలు చేస్తూ తమ ప్రభుత్వం దానిని చిటికెలో రద్దు చేసిందని, ఒకే దేశంలో రెండు రాజ్యాంగాలు, ఇద్దరు ప్రధానులు, రెండు జెండాలు చెల్లవు అన్న పండిత్ శ్యామాప్రసాద్ ముఖర్జీ కలని నిజం చేశామని చెప్పారు. గతంలో ఉగ్రవాదంతో వార్తల్లో నిలిచిన కాశ్మీర్ ఈరోజు పర్యాటకం, పెట్టుబడులు, ఉపాధితో కళకళలాడుతోందని, లాల్ చౌక్‌లో త్రివర్ణ పతాకం ఎగురుతోందని, అక్కడ జన్మాష్టమి వేడుకలతోపాటు మొహర్రం ఊరేగింపులు కూడా శాంతియుతంగా జరుగుతున్నాయని వివరించారు. 2014కు ముందు దేశంలో నిరాశ నిండి ఉండేదని, విదేశీ పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ ముందుకు రాలేదన్నారు. గత 12 ఏళ్లలో 38 దేశాలు భారత్‌తో కొత్త వాణిజ్య ఒప్పందాలు చేసుకున్నాయని పేర్కొంటూ ‘మేక్ ఇన్ ఇండియా’ విజయాలను వివరించారు. తమ అంత్యోదయ విధానం వల్ల గత 12 ఏళ్లలో 25 కోట్ల మంది దేశ ప్రజలను పేదరిక రేఖకు ఎగువకు తీసుకొచ్చామని, అంతర్జాతీయ సంస్థల నివేదికలే దీనిని స్పష్టం చేస్తున్నాయని చెప్పారు.
అభివృద్ధి విషయంలో వివక్ష చూపలేదు
రాష్ట్రాల్లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా తమ ప్రభుత్వం అభివృద్ధి విషయంలో ఎన్నడూ వివక్ష చూపలేదని, దేశ ప్రయోజనాలే తమకు ప్రథమ ప్రాధాన్యమని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. తెలంగాణకు మోదీ ప్రభుత్వం చేసిన కేటాయింపులను గణాంకాలతో వివరిస్తూ గతంలో ఉమ్మడి రాష్ట్రంలో రైల్వే బడ్జెట్ రూ.1000 కోట్ల కంటే తక్కువగా ఉండేదని, కానీ ఈరోజు కేవలం తెలంగాణ రైల్వే బడ్జెట్ కోసమే రూ.5,000 నుండి రూ.5,500 కోట్లు కేటాయించామని చెప్పారు. తెలంగాణలో రూ.32,000 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు నడుస్తున్నాయని, ప్రస్తుతం 5 వందే భారత్ రైళ్లు, 6 అమృత్ భారత్ రైళ్లు విజయవంతంగా నడుస్తున్నాయని తెలిపారు. గత నెలలోనే ప్రధాని మోదీ తెలంగాణలో రూ.1700 కోట్లతో పీఎం మిత్రా టెక్స్ టైల్ పార్కును ప్రారంభించారని, ఇది తెలంగాణలో భారీగా ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మల్కాజ్‌గిరిలో ఇండియన్ ఆయిల్ కొత్త టెర్మినల్ ప్రారంభం ద్వారా తెలంగాణ ఇంధన అవసరాలు తీరనున్నాయని చెప్పారు. దేశాన్ని మరింత శక్తివంతంగా మార్చేందుకు, వికసిత భారత్ నిర్మాణంలో మోదీ నాయకత్వానికి, బీజేపీకి తెలంగాణ ప్రజల, మేధావుల సంపూర్ణ ఆశీస్సులు, మద్దతు ఉండాలని కోరారు.
పెండింగ్ సమస్యలు పరిష్కారం : కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి మాట్లాడుతూ నరేంద్ర మోదీ ప్రభుత్వంలో గత 12 ఏళ్ల పాలనలో దేశంలో చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న అనేక కీలక సమస్యలను పరిష్కరించారని చెప్పారు. దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పలు చట్టపరమైన, పరిపాలనా సంస్కరణలను అమలు చేశారన్నారు. ఆర్టికల్ 370 రద్దు, అయోధ్యలో రామాలయ నిర్మాణం, ట్రిపుల్ తలాక్ రద్దు, ఉగ్రవాద నిర్మూలనకు కఠిన చర్యలు వంటి ఎన్నో చరిత్రాత్మక నిర్ణయాలను అమలు చేశామన్నారు. దేశ గౌరవం, దేశ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం మోదీ నిరంతరం అంకితభావంతో పనిచేస్తున్నారన్నారు. నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు తాను ‘ప్రధానమంత్రి కాదు.. ప్రధాన సేవకుడిని’ అని చెప్పారన్నారు. నీతి, నిజాయతీ, పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తూ పరిపాలన అందిస్తున్న నాయకుడు మోదీ అని కిషన్‌రెడ్డి చెప్పారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




