మీనాక్షి వ్య‌వ‌హారంలో కాంగ్రెస్ కుట్ర

– సీఎం హిట్ల‌ర్ గురించి మాట్లాడ‌టం దారుణం
– ఉన్న సిటీని వ‌దిలేసి ఫ్యూచ‌ర్ సిటీ అన‌డ‌మేంటి?
– ఎయిర్ పోర్ట్ మెట్రోను అన‌వ‌స‌రంగా ర‌ద్దు చేశారు
– డీలిమిటేష‌న్‌లో అన్యాయం జ‌రిగితే ఊరుకోం
– సింగ‌రేణిలో కేంద్రానికి కూడా వాటా వున్న‌ద‌ని కిష‌న్‌రెడ్డి గుర్తించాలి
– ఆర్టీసీ కార్మికుల‌కు ప్ర‌భుత్వం ద్రోహం
– బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 12:   మీనాక్షి నటరాజన్ అంటే పడని వారే ఈ పని చేశారు. మీనాక్షి నటరాజన్‌కి తెలంగాణ కాంగ్రెస్‌లో ఎవరు వ్యతిరేకులో ప్రజలందరికీ తెలుసు. ముమ్మాటికీ ఆయన చేసిన పనే ఇది. కాంగ్రెస్ పార్టీనే కుట్రలు చేసుకొని, అందులో ప్రతిపక్షాలను ఎందుకు లాగుతున్నారో తెలుసుకోవాలని బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. శుక్ర‌వారం మీడియా చిట్‌చాట్‌లో ఆయ‌న మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో పదవులు, డబ్బులకే వస్తున్నాయని షబ్బీర్ అలీ చెప్పినందుకు అభినందనలు. షబ్బీర్ అలీ ఇప్పటికైనా ఉన్న వాస్తవాన్ని ప్రజల ముందు గట్టిగా చెప్పారంటూ అభినందించారు. ముఖ్య‌మంత్రి ప్రతి నెలా డబ్బుల మూట పంపితేనే ఆయన పదవి ఉంటుంది. రేవంత్ రెడ్డి రెగ్యులర్ సీఎం కాదు, రెన్యూవల్ సీఎం అని అందరికీ తెలుసు. కాబట్టి, షబ్బీర్ అలీ చెప్పిన మాటలు ముమ్మాటికీ వాస్తవమ‌న్నారు. రేవంత్ రెడ్డి హిట్లర్ గురించి మాత్రమే మాట్లాడలేదు. హిట్లర్ హంతకముఠా నాకు ఆదర్శం అన్నారు. అంతకుమించి, ఇరాన్-ఇజ్రాయెల్ వార్‌లో గాజా మాదిరి విద్వంసం సృష్టించిన అన్నారు. యుద్ధంలో జరిగిన విద్వంసం గురించి గొప్పలు చెప్పుకునే వ్యక్తి ఎంత మానసిక రుగ్మత ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. శ్రీధర్ బాబు హిట్లర్ వ్యాఖ్యలను సమర్ధించడం పట్ల జాలి కలుగుతుంద‌న్నారు. రేవంత్ రెడ్డి హిట్లర్ వ్యాఖ్యలను శ్రీధర్ బాబు సమర్థించడం ఆయనకున్న ఇబ్బందులను గుర్తుచేస్తుంది. శ్రీధర్ బాబు చదువుకున్న వ్యక్తి. అలాంటి ఆయన హిట్లర్ వ్యాఖ్యలను సమర్థించడం దారుణం. శ్రీధర్ బాబు లాంటి నాయకుడు కూడా హిట్లర్ వ్యాఖ్యలను సమర్థించడం ఆయన విజ్ఞతకే వదిలివేస్తున్నాం.
రేవంత్ రెడ్డి మున్సిపల్ శాఖ మంత్రిగా పూర్తిగా విఫలమయ్యారు. వర్షాకాల సన్నద్ధత ప్రణాళిక పైన సమీక్ష కూడా నిర్వహించలేదు. మేము వేసిన ఫ్లైఓవర్లు, ఎసఎన్‌డీపీ నిర్వహణ కూడా చేయడం లేదు. ఉన్న సిటీని గాలికి వదిలేసి ఫ్యూచర్ సిటీ గురించి మాట్లాడుతున్నాడు.  ఇదే రేవంత్ రెడ్డి రోడ్ల కింద బావులు తవ్వి వర్షాలను, వరదలను ఆపుకున్నానని చెప్పాడు. హైదరాబాద్ నగరంలోని వర్షాలకు ప్రజల అవస్థ పాపం ముమ్మాటికీ రేవంత్ రెడ్డిదే. ఎయిర్‌పోర్ట్ మెట్రోను రద్దు చేయడం వల్లనే ఆ ప్రాంతంలో రద్దీ భారీగా పెరిగింది. ఎయిర్‌పోర్ట్ 18 నెలల్లో మెట్రో పూర్తి అయ్యేది; లక్షల మందికి లాభం జరిగేది, ట్రాఫిక్ జామ్‌లు త‌గ్గేవి. ల్యాండ్ అక్విజిషన్ (భూసేకరణ) లేకుండా సులభంగా పూర్తయ్యే మెట్రోను రేవంత్ రెడ్డి ఆపేశాడు. మెట్రో ఎల్ అండ్ టీ ను బెదిరించి మెట్రోను లాక్కున్నాడు. మేము గతంలో మెట్రోను పూర్తి చేసాం. కానీ ఈ రెండున్నర సంవత్సరాలలో రేవంత్ రెడ్డి చేసింది ఏమిటో చెప్పాలి. రేవంత్ రెడ్డి రెండు చెరువులు కట్టి ప్రచారం చేసుకుంటున్నాడు. మేము 100 చెరువులు బాగు చేసిన తర్వాత ఏనాడూ ఫోజులు కొట్టలేదు.హైడ్రా అనేది ఒక బ్లాక్‌మెయిల్ సంస్థగా మారింద‌ని ఆరోపించారు.
పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి. సభ్యత్వ నమోదు మొబైల్ అప్లికేషన్ సిద్ధంగా ఉన్నది. అప్లికేషన్ టెస్టింగ్ కొనసాగుతున్నది. ఆ తర్వాత నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లతో సభ్యత్వ నమోదు పైన శిక్షణ ఉంటుంద‌న్నారు.  60 నియోజకవర్గాల్లో  మెంబర్‌షిప్ పైన సమావేశాలు పూర్తి అయ్యాయి. సభ్యత్వ నమోదు ఈ నెలాఖరు వరకే స్టార్ట్ అయ్యే అవకాశం ఉన్నద‌న్నారు.
రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా బిఆర్‌ఎస్‌దే విజయం. భారీ మెజారిటీతో ఎన్నికలు గెలుస్తామ‌న్నారు. ఇప్పటికే పలు సర్వేలు ఇదే మాట చెప్తున్నాయ‌న్నారు.
జూలై నెల నుంచి డీలిమిటేషన్ జరిగే అవకాశం ఉన్నది అంటున్నారు. ఎవరు ఎక్కడ, ఏ నియోజకవర్గంలో పోటీ చేస్తారో ఎవరికీ తెలియదు.  ఇప్పుడు ఉన్న దక్షిణ భారతదేశ ప్రాతినిధ్యం తగ్గకుండా ఉంటే డీలిమిటేషన్ కి మద్దతు ఇస్తాం. దక్షిణ భారతదేశానికి ప్రాతినిధ్యం తగ్గితే ఊరుకోము. దక్షిణ భారతదేశానికి అన్యాయం జరిగితే ఖచ్చితంగా ప్రజలతో కలిసి గొంతు విప్పుతామ‌న్నారు. లక్షల మంది ఉపాధికి ప్రమాదంరేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ పూర్తిగా కుప్పకూలింద‌న్నారు.మా ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన ఇంటి నిర్మాణాలు పూర్తయి ఇప్పుడు రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయ‌న్నారు. సింగరేణి అంశంలో కాంగ్రెస్ పార్టీ అనేక కుంభకోణాలకు పాల్పడుతున్న‌ది. స్వయంగా ముఖ్యమంత్రి బావమరిది సింగరేణి వ్యవహారాలు నడిపిస్తున్నాడని ఆరోపించారు. సైట్ విజిటేషన్ మొదలుకొని నైనీ గనుల వరకు అనేక అక్రమాలు జరిగాయి.  ఇప్పుడు కిషన్ రెడ్డి సింగరేణి కార్మికుల కోసం మాట్లాడే ముందు అందులో కేంద్రానికి వాటా ఉన్నదన్న విషయాన్ని గుర్తుంచుకొని ఒక విధానపరమైన నిర్ణయాన్ని తీసుకురావాలి. కేవలం మాటలు చెప్తే సరిపోదు. సింగరేణి అక్రమాలపై ఇప్పటికే పలు లేఖలు రాసిన వాటిపైన సమాధానం చెప్పే ధైర్యం లేకనే మౌనం వహిస్తున్నాడు. రాష్ట్ర ప్రభుత్వంతో కిషన్ రెడ్డి కుమ్మకు అయ్యారు. ఆర్టీసీ కార్మికులకు కాంగ్రెస్ పార్టీ వారికి అడుగడుగున ద్రోహం చేస్తున్నది. ఆర్టీసీ కార్మికుల అపాయింటెడ్ డే ఇవ్వకుండా ఆలస్యం చేస్తున్నది. ఈ అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వంతో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించి సమాధానం చెప్పాలి. ఆర్టీసీ కార్మికుల పక్షాన మా పార్టీ నిలబడి కొట్లాడుతుంద‌ని స్ప‌ష్టం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *