– గత రెండేళ్లలో కార్మికుల బతుకులు ఆగం
– జీతాలివ్వాలంటే బ్యాంకుల్లో అప్పులు తేవాల్సిన దుస్థితి
– సైట్ విజిట్ సర్టిఫికెట్ పద్ధతి ఎక్కడా లేదు
– జైసల్మేర్ లో సోలార్ ప్లాంట్ పెట్టడం సింగరేణికి అవసరమా?
– సింగరేణి అవినీతి బాగోతాలను వివరించిన హరీష్‌రావు
భూపాలపల్లి, ప్రజాతంత్ర, జూన్ 12: ఎంతో చరిత్ర కలిగిన సింగరేణిని కాంగ్రెస్ ప్రభుత్వం కుంభకోణాల గనిగా మార్చిందని బీఆర్ఎస్ నేత హరీశ్ రావు విమర్శించారు. భూపాలపల్లి బీఆర్ఎస్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సింగరేణి కార్మికుల సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. ఫిక్స్ డ్ డిపాజిట్లతో కళకళలాడిన సింగరేణి నేడు అప్పులు ఊబిలో కూరుకుపోయిందన్నారు. రెండున్నరేండ్లలో కార్మికుల బతులకును ఆగం పట్టించిందని ఆరోపించారు. 10ఏళ్లు తెలంగాణను అభివృద్ది చేసిన బీఆర్ఎస్ పార్టీకి సింగరేణిని కాపాడాల్సిన బాధ్యత ఉంది. బిఆర్ఎస్ పదహారున్నర వేల మంది పిల్లలకు కారుణ్య నియామకాలు ఇస్తే వాటిపై విచారణ జరిపింది, ఉద్యోగాలు ఊడగొట్టే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ అని ఆరోపించారు. మెడికల్ అన్ ఫిట్ చేయకుండా కార్మికులు, వారి కుటుంబాలకు నరకం చూపిస్తున్నారన్నారు. మేం గోదావరిఖనిలో ప్రశ్నిస్తే భయపడి పెండింగ్ లో ఉన్న 400 ఉద్యోగాలు ఇస్తామని ఈరోజు భట్టి విక్రమార్క ప్రకటించారని, మన పోరాటం కొంత ఫలించిందని అన్నారు. ఒకటో తేదీ జీతాలు రావాలంటే బ్యాంకుల్లో అప్పులు తేవాల్సిన పరిస్థితి. సోలార్ పవర్ స్కాం, జైపూర్ పవర్ స్కాం, బొగ్గు మాయం, ఎక్స్ ప్లోజివ్‌ల స్కాం.. ఇలా అనేక స్కాంలు చేసారు. సైట్ విజిట్ సర్టిఫికేట్ పెట్టారు. టెండర్ వేయాలంటే బొగ్గు బాయి వెళ్లి చూసి వచ్చి వేయాలి. ఈ విధానం ద్వారా మొట్టమొదటి లబ్దిదారుడు రేవంత్ బామ్మర్ది సృజన్ రెడ్డి. ఈయనకే మొదటి టెండర్ లభించింది. సైట్ విజిట్ సర్టిఫికేట్ అనేది కోల్ ఇండియాలో లేదు, వెస్ట్రన్ కోల్ ఫీల్డ్ లో లేదు.. రేవంతు ప్రభుత్వం రాకముందు లేదు.. వెంకటేష్ ఖనిలో రేవంతు బామ్మర్ది శోధా కన్సస్ట్రక్షన్ కు ప్లస్ 13శాతంతో టెండర్ దక్కింది. ఒక్క శోధా టెండర్ లోనే దాదాపు 50 కోట్లు సింగరేణికి నష్టం. సైట్ విజిట్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత అన్ని టెండర్లు ఎక్సెస్ కు వెళ్లాయి. బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎప్పుడైనా సింగరేణిలో సైట్ విజిట్ సర్టిఫికేట్ ఉందా.. బిఆర్ఎస్ ఉన్నపుడు మైనస్ పోయిన ఓబీ టెండర్లు రేవంత్ రాగానే ఎక్సెస్ ఎందుకు పోయాయి. సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. కమీషన్లు కుదరడం లేదని శ్రీరాంపూర్ ఓసీ టెండర్ ను ఏడుసార్లు రేవంత్ బామ్మర్ది వాయిదా వేయించారు. మనం బయటపెట్టగానే 600 కోట్ల టెండర్ మైనస్ 12కు పోయింది. సింగరేణి సొమ్ము ఆదా అయ్యింది. కాంగ్రెస్ ప్రభుత్వం కమీషన్ల కోసం సోలార్ ప్లాంట్లు మొదలుపెట్టింది. సోలార్ పవర్ కొనము అని విద్యుత్ సంస్థల నుంచి సర్క్యులర్ ఉంది. అయినా 67, 107 మెగావాట్ల సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేస్తం అని టెండర్లు ఇచ్చారు. వేరే వాళ్లు టెండర్ లో పాల్గొనకుండా నిబంధనలు మార్చి టెండర్లు కట్టబెట్టారు. మూడు కోట్లకు మెగావాట్ తయారు అయితే ఏడు కోట్లకు ఇచ్చారు. 67 మెగావాట్ ప్లాంట్ విషయంలో దాదాపు 250 కోట్లు అదనంగా కాంట్రాక్టర్ కు కట్టబెట్టారు. 107 మెగావాట్ ప్లాంట్ విషయంలో మెగావాట్ 5.4 కోట్లకు కట్టబెట్టారు. అంటే 540 కోట్లు. 480 కోట్లతో 67మెగావాట్ల ప్లాంట్ కట్టి రెండేళ్లు అవుతున్నది. సింక్రనైజ్ చేయలేదు, పీపీఏ లేదు. నిరుపయోగంగా మారిపోయింది. అప్పులు తెచ్చి కమీషన్ల కోసం ప్లాంట్లు పెట్టారు. 107 మెగావాట్ల ప్లాంట్ ను 580 కోట్లతో టెండర్ పిలిచారు. దీనికి కూడా పీపీఏ లేదు, సింక్రనైజ్ లేదు. మూలన పడి ఉంది. జైపూర్ లో 800 మెగావాట్ల థర్మల్ ప్లాంట్ ఏర్పాటు చేసింది సింగరేణి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మరొక ప్లాంట్ ఏర్పాటు చేస్తం అని ప్రారంభించింది. ఎప్పుడైనా ప్లాంట్ పెడితే పీపీఏ చేసుకోవాలి. కానీ వీళ్లు 800 మెగావాట్ల ప్లాంటు జైపూర్ లో పెడితే రాష్ట్ర ప్రభుత్వంతో పీపీఏ లేదు, డీపీఆర్ ఆమోదం కాలేదు. కానీ టెండర్లు పిలిచారు. వాళ్ల అనుయాయులకు టెండర్లు కట్టబెట్టారు. ఇప్పటికే వెయ్యి కోట్లు ఖర్చు చేసారు. రాజస్థాన్ తో 76:24 నిష్పత్తితో ఒప్పందం చేసుకున్నరు. మా 24శాతం వాటా కింది పాకిస్థాన్ బార్డర్ జైసల్మేర్ లో సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు జాగా ఇస్తం అన్నరు. బొగ్గు ఉత్పత్తి చేసే సంస్థ జైసల్మేర్ లో సోలార్ ప్లాంట్ పెట్టడం ఎందుకు ? సింగరేణి అధికారులను తీసుకువెళ్లి జైపూర్ లో పెట్టారు. రాజస్థాన్ కొనది.. తెలంగాణ కొనది.. మరి ఎందుకు జైసల్మేర్ లో ప్లాంట్. ఇవన్నీ తెలిసి మేం మౌనంగా ఉండాలా.. జైపూర్ పవర్ ప్లాంట్ పై భట్టి సమాధానం చెప్పాలి. భూపాలపల్లి బొగ్గు బాయి మీద 3లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు లేదు. నేను 40లక్షల టన్నుల బొగ్గు మాయం అయ్యింది అంటే ఎవరూ సప్పుడు చేయడం లేదు. నేను ఇది బయట పెట్టగానే కవర్ చేసే ప్రయత్నం చేసారు. 2025 ఏప్రిల్, మే, జూన్ నెల రెండు నెలల 12 రోజుల్లో ఉత్పత్తి చేసిన బొగ్గు కోటి 20లక్షల టన్నుల ఈ ఏడాది అదే సమయానికి చేసిన ఉత్పత్తి 93లక్షల టన్నులు. అంటే 31లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గును కవర్ చేస్తూ వస్తున్నరు. స్టాక్ ఎత్తినట్లు చూపిస్తున్నరు. అడ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్టు ఉత్పత్తి బంద్ అయ్యి రెండేళ్లు అయ్యింది. అయినా అక్కడ లక్షా 81వేల టన్నుల స్టాక్ ఉన్నట్లు చూపిస్తున్నరు. రామగుండం, భూపాలపల్లి గనుల్లో లేని బొగ్గును తెచ్చి పోస్తున్నరు. మేం వేళ్లి చూస్తాం అంటే మైన్ సేఫ్టీ అంటూ అడ్డుకున్నరు.
ఎక్స్ ప్లోజివ్స్ స్కాం
బొగ్గు బావుల్లో వాడే జిలిటెన్ స్టిక్స్ కొనుగోళ్లలో కూడా స్కాం చేసింది. వెస్ట్రన్ కోల్ ఫీల్డ్ లో ఎంఎంటీ కాస్ట్ ధర 37వేలు ఉంటే, సింగరేణిలో 44వేలు పెట్టి కొన్నరు. ఒక్క ఆర్డర్ లోనే 300 కోట్ల తేడా. జీవీ రెడ్డి అనే డైరెక్టర్ నిరాకరిస్తే రాజీనామా చేయాలని ఒత్తిడి చేసారు. ఆయన వెళ్లిపోయాడు. మరొక డైరెక్టర్ వీకే శ్రీనివాస్ ను ఒప్పుకోనందుకు జీఎంగా డిమోషన్ చేసారు. సింగరేణిలో నిజాయితీగా ఉన్న ఈ ఇద్దరికి నా సెల్యూట్. ఇన్ని కుంభకోణాల వల్ల సింగరేణిలో ఉత్పత్తి తగ్గిపోయింది. 2023లో 70 మిలియన్ టన్నుల ఉత్పత్తి జరగగా, 2025–26 నాటికి 58 మిలియన్ టన్నులకు తగ్గింది. రాబోయే రోజుల్లో ఇంకా తగ్గుతుంది. దీంతో కార్మికులకు బోనస్ తగ్గుతుంది. సింగరేణిపై బకాయిల గుదిబండ పడింది. ఆర్టీఐ ద్వారా స్వయంగా సేకరించిన సమాచారం ప్రకారం పదేండ్ల బిఆర్ఎస్ పాలనలో సింగరేణికి జెన్కో పడ్డ బకాయి కేవలం 7వేల కోట్లు. కాంగ్రెస్ రెండున్నరేండ్లలో పడ్డ బకాయిలు 12,377 కోట్లు.
డీజిల్ స్కాం
గతంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వంటి ప్రభుత్వ సంస్థల నుంచి నేరుగా డీజిల్ కొనుగోలు జరిగేది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక దీన్ని కూడా ఓబీ కాంట్రాక్టర్ల చేతిలో పెట్టారు. ప్రైవేటు బంకుల నుంచి తేవడం వల్ల సింగరేణిపై అదనపు భారం పడుతున్నది. జీఎస్టీ ఇతర పన్నులు పడుతున్నయి. కాంట్రాక్టర్లకు లాభం చేకూరుతున్నది. కోట్లాది లీటర్లు కొనుగోలు చేస్తం కాబట్టి సింగరేణికి ప్రతి సంవత్సరం కొన్ని వందల కోట్ల నష్టం. భవిష్యత్తు ప్రణాళిక అంటూ లాభాల్లో చూపకుండా గతేడాది, ఈఏడాది 6వేల కోట్లు పక్కన పెట్టారు. ఈ డబ్బులు ఎక్కడ పోాయాయి, అదనపు పైసలు ఉంటే సింగరేణి ఎందుకు అప్పులు పడింది. ఒక నెలలో రాష్ట్రం తీసుకునే అప్పు పరిధి 3200 కోట్లు. సింగరేణి మాత్రం 4300 కోట్ల ఓడీ అంటే అప్పు చేసింది. సీఎస్ఆర్ పైసలు సింగరేణి ప్రాంతంలో అభివృద్ది కోసం వాడాలి. కానీ రేవంత్ రెడ్డి మాత్రం 100 కోట్లు తీసుకొని మెస్సీతో ఫుట్ బాల్ ఆడిండు. మేనిఫెస్టోలో కారుణ్య నియమకాలు సరళీకృతం చేస్తమన్నరు. ఇస్తం అన్నరు. కానీ మొత్తం బంద్ పెట్టారు. కేసీఆర్ వారం వారం మెడికల్ బోర్డు పెట్టి 16వేల కారుణ్య నియమకాలు ఇచ్చిండు. చంద్రబాబు లెక్క గోల్డెన్ షేక్ హ్యాండ్ పెడతం అన్నడు రేవంత్ రెడ్డి. మేం నిలదీస్తే ఈరోజు భట్టి కారుణ్య నియామకాలు ఇస్తం అంటున్నడు. కార్మికుల పిల్లలు డాక్టర్ కావాలని కేసీఆర్ సింగరేణి మెడికల్ కాలేజీ పెట్టారు. 5శాతం రిజర్వేషన్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి రాగానే ఆయన బామ్మర్ది వేలు పెట్టిండు. సింగరేణిలో ఇక్కడి ఎమ్మెల్యే మంచిర్యాల ఎమ్మెల్యేలు కూడా సింగరేణిలో వేలు పెట్టారు. రాజకీయ జోక్యం, అవినీతి, కుంభకోణాలతో సింగరేణిని ఖతం పట్టిస్తున్నరు. ప్రైవేటీకరణకు అడుగులు వేస్తున్నరు. మేనిఫెస్టో రాసిన శ్రీదర్ బాబు సింగరేణి కార్మికులకు సమాధానం చెప్పాలి. ఇక్కడ జరుగుతున్న అవినీతిపై బొగ్గు మంత్రి కిషన్ రెడ్డి, బిజేపీ మాట్లాడటం లేదు.. కాంగ్రెస్ బిజేపీ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయి అని హరీష్‌రావు విమర్శించారు. సింగరేణి అవినీతిపై వెంటనే సీబీఐ విచారణ, సెంట్రల్ విజిలెన్స్ ఎంక్వైరీ జరపాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




