– తెలంగాణలో ఎవరైనా రాజకీయం చేసుకోవచ్చు
– కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పక్కా తెలంగాణ ద్రోహి
– తెలంగాణ కోసం ఏ ఒక్క మంచి పని చేయలేదు
– కెటిఆర్ చెప్పినట్లల్లా దిల్లీలో డ్రామాలు ఆడుతున్నాడు
– హిట్లర్ ఆదర్శమని ఎవరైనా చెబుతారా
– మీనాక్షి సీట్ చోరీకి బిజెపి కుట్ర రాజకీయాలు
– మీడియాతో చిట్‌చాట్‌లో సిఎం రేవంత్
- దిల్లీలో కాంగ్రెస్ నేత రాహుల్‌తోనూ భేటీ
న్యూదిల్లీ, జూన్ 12: తెలంగాణకు వచ్చేందుకు.. వెళ్లేందుకు.. పోటీ చేసేందుకు.. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌కు పూర్తి స్వేచ్ఛ ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎవరు ఎక్కడైనా రావచ్చు..పోవచ్చన్నారు. ఇందుకు పవన్ కళ్యాణ్ అతీతుడు కాదన్నారు.
దిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. తెలంగాణకు వచ్చివెళ్లేందుకు, పోటీ చేసేందుకు పవన్‌కల్యాణ్‌కు పూర్తి స్వేచ్ఛ ఉందన్నారు. ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడినందునే పవన్ విషయంలో మా మంత్రులు స్పందించారు.. శాంతిభద్రతల కారణంతోనే ఆయన సభకు అనుమతి ఇవ్వలేదు.. ఏపీలో చాలాసార్లు జగన్ సభలకు అనుమతి ఇవ్వలేదు.. ఎందుకు అనుమతి ఇవ్వలేదో పవన్‌కల్యాణ్ చెప్పాలన్నారు. తనకు హిట్లర్ ఆదర్శం అని తానెప్పుడూ చెప్పలేదని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో ఉన్నవారు ఎవరైనా హిట్లర్ తమకు ఆదర్శం అని చెబుతారా అని ప్రశ్నించారు. పార్టీ అధిష్ఠానంతో జరిగిన సమావేశంలో మంత్రివర్గ విస్తరణపై చర్చ జరగలేదని చెప్పారు. ప్రధాని మోదీతో జరిగిన భేటీలో తనను ఆయనే కౌగిలించుకున్నారని సీఎం రేవంత్ వెల్లడించారు. తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతోందని ఆరోపించారు. బీఆర్‌ఎస్ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆదేశాలను దిల్లీలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పాటిస్తున్నారని విమర్శించారు. పలు ప్రాజెక్టులకు నిధులు విడుదల కాకపోవడానికి కిషన్‌రెడ్డే కారణమని మరోమారు కుండబద్దలు కొట్టారు. రీజినల్ రింగ్ రోడ్డుకు కూడా అడ్డుపడ్డారని గుర్తు చేశారు. తుమ్మిడిహెట్టి కోసం మహారాష్ట్ర సీఎంతో కిషన్‌రెడ్డి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. తెలంగాణ కోసం ప్రధానితో ఒక్కసారైనా మాట్లాడారా అని కిషన్ రెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి నిలదీశారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఎక్కడైనా తెలంగాణకు అనుకూలంగా మాట్లాడినట్లు నిరూపించాలన్నారు. ఎవరి వద్ద వ్యతిరేకంగా మాట్లాడారో వాళ్లే నాకు చెప్పారు. పోలవరం కోసం 5 మండలాలను ఏపీలో కలిపారు.. అదేరీతిలో తెలంగాణ కోసం మహారాష్ట్ర నుంచి 1500 ఎకరాలు సాధించలేరా అని నిలదీశారు. మహారాష్ట్రను ఒప్పించే వరకు కేబినెట్ సమావేశానికి రానని కిషన్‌రెడ్డి, రాజీనామా చేస్తామని ఎనిమిద మంది బీజేపీ ఎంపీలు చెప్పలేరా? ఆ పార్టీ ఎంపీలు గట్టిగా అడిగితే రాష్ట్రానికి నిధులు వస్తాయి కదా.. రీజినల్ రింగ్ రోడ్డును కూడా కిషన్‌రెడ్డి అడ్డుకుంటున్నారు. కేటీఆర్ చెప్పినట్లు కిషన్‌రెడ్డి డ్రామా ఆడుతున్నారని మండిపడ్డారు. గాడ్సేనే కాదు.. కిమ్‌ను కూడా బీజేపీ ఆదర్శంగా తీసుకుందని రేవంత్ రెడ్డి వ్యంగ్యంగా అన్నారు. బీజేపీకి తెలిసింది ఓట్ చోరీ.. లేకపోతే సీట్ చోరీ అని ఎద్దేవా చేశారు. మధ్యప్రదేశ్‌లో సంఖ్యాబలం లేకపోయినా మూడో అభ్యర్థిని నిలబెట్టినప్పుడే బీజేపీ దుర్బుద్ధి బయటపడిందన్నారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నామినేషన్ తిరస్కరణ అప్రజాస్వామిక చర్య అని అభివర్ణించారు. రిటర్నింగ్ అధికారి (ఆర్వో) బీజేపీ కార్యకర్తలా వ్యవహరించారని విమర్శించారు. మీనాక్షి నటరాజన్‌పై అసలు కేసే లేదని స్పష్టం చేశారు. మహిళా వ్యతిరేకి బీజేపీ అని సీఎం రేవంత్ విమర్శించారు. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌ను భాజపా ఆదర్శంగా తీసుకుందని.. ఆ పార్టీ నేతలు ఆయనలా ప్రవర్తిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇదిలావుంటే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌తో సిఎం రేవంత్ భేటీ అయ్యారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




