– అదే ప్రధాని మోదీ సంకల్పం
– ఇందులో అందరం భాగస్వాములవుదాం
– కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి
– కన్హా శాంతివనంలో యోగా డే 50 రోజుల కౌంట్ డౌన్ షురూ
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 2 : యోగా భారత దేశ ప్రాచీన వారసత్వం మాత్రమే కాదు.. యావత్ ప్రపంచ మానవాళికి ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో భారత్ ఇచ్చిన ఒక అమూల్యమైన ఆరోగ్య కానుక అని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ఐక్యరాజ్య సమితి వేదికగా మన ప్రధానమంత్రి 12 ఏళ్ల క్రితం ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగాను ప్రతిపాదించి జూన్ 21న అంతర్జాతీయ యోగా డేగా గుర్తింపు తీసుకు రావడం అందరం గర్వపడాల్సిన విషయమని అన్నారు. యోగాకు 170 దేశాలకు పైగా సంపూర్ణమైన మద్దతు ప్రకటించడమే కాదు.. అన్ని దేశాలు ఆచరిస్తూ ఉన్నాయన్నారు. కన్హా శాంతి వనంలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని 50 రోజుల కౌంట్‌డౌన్ కార్యక్రమం శనివారం ప్రారంభమైన సందర్భంగా ఆయన యోగా ప్రాముఖ్యత గురించి మాట్లాడారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా భారత దేశాన్ని ప్రపంచానికి విశ్వ గురు స్థాయిలో తీసుకెళ్లడం మోదీ ప్రధానమైన లక్ష్యమని తెలిపారు. విశ్వ గురువుగా మనం కీలక పాత్ర పోషించేందుకు దేశ యువత చేయాల్సిన అత్యంత ప్రాధాన్యమైన కార్యక్రమం యోగా అని చెప్పారు. అభివృద్ధి చెందిన, వికసిత్ భారత్‌గా ఆవిర్భవించాలంటే, మన దేశం కూడా ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాల సరసన గర్వంగా తల ఎత్తుకొని నిలబడాలంటే 2047కు ఆరోగ్యవంతమైన, ఒక శాంతివంతమైన, ఒక ప్రశాంతమైన భారత దేశాన్ని నిర్మించాలని పిలుపునిచ్చారు. యువత శారీరకంగా బలంగా ఉండాలి అంటే యోగా చేయాలి.. ఏకాగ్రత మెరుగుపడాలంటే యోగా చేయాలి.. క్రమశిక్షణతో వృత్తులు, కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలన్నా, ఎమోషనల్ బ్యాలెన్స్ ఉండాలన్నా యోగా చేయాలి అని యోగా ప్రాముఖ్యతను ఆయన వివరించారు. అలాగే సెల్‌ఫోన్‌లో సోషల్ మీడియా నుంచి తట్టుకోవాలన్నా యోగాతోనే సాధ్యమని తేల్చిచెప్పారు. మనం పీల్చే గాలి కలుషితమైనది.. మనం తింటున్న ఆహారం ఎరువులు, రసాయనాలతో కూడినది.. తాగే నీరు, సౌండ్, పొల్యూషన్, అలాగే మనుషుల మనసుల పొల్యూషన్.. వీటి సమస్య పరిష్కారానికి ఏకైక, అద్భుతమైన, ఖర్చు లేని, ఆచరణ సాధ్యమైన మార్గం యోగా అని వివరించారు. యోగా, ఆయుర్వేదం, మిల్లెట్ మిషన్, భారతీయ సంస్కృతికి, భారతీయ ఆధ్యాత్మిక కేంద్రాలైన అయోధ్య రామ మందిర్ గాని, కాశీ విశ్వనాథ్ కారిడార్, కేదార్ నాథ్ మందిర్.. ఇవన్నీ మన ఆధునిక మూలాలను బలోపేతం చేస్తూ ఈరోజు ప్రపంచాన్ని మనం ఆకర్షిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ‘వికాస్ బి, విరాసత్ బి’ అనే నినాదంతో ఒకవైపు అభివృద్ధి, అన్ని రంగాలలో అభివృద్ధి, వేగవంతమైన అభివృద్ధి, సమాంతరమైన అభివృద్ధి, ప్రపంచంతో పోటీ పడే అభివృద్ధి.. దానితోపాటు మన సంస్కృతి పునరుజ్జీవానికి కూడా సమప్రాధాన్యత ఇచ్చే విధంగా మన ప్రధానమంత్రి మనల్ని నడిపిస్తున్నారని కిషన్‌రెడ్డి తెలిపారు. ఈ కన్హా శాంతివనం అడుగడుగునా భారతీయ జీవన తత్వాన్ని, భారతీయ జీవన విధానాన్ని ఏ రకంగా ప్రతిబంధిస్తున్నామో స్వయంగా మనం ఇక్కడ చూస్తున్నామన్నారు.
కన్హా శాంతివనం ఒక మెడిటేషన్ సెంటర్
కన్హా శాంతివనం అంటే ప్రకృతి, పర్యావరణ సమతుల్యతకు బాట చూపే ఒక అద్భుతమైన, ఆధ్యాత్మిక జాగృతికి బాటలు వేసే కేంద్రం. సుస్థిరమైన జీవన విధానానికి ఇదొక ఉదాహరణ అని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. హైదరాబాద్ అంతా కాంక్రీట్ జంగల్ అయింది.. అడవులు తగ్గిపోతున్నాయి.. వాతావరణ సమతుల్యత దెబ్బతింటున్నదని బాధపడుతుంటాం.. వాటన్నిటికీ పరిష్కారంచూపే కేంద్రం ఈ కన్హా శాంతివనం అనే విషయాన్ని మనవి చేస్తున్నానన్నారు. ప్రకృతిని, సంస్కృతిని తనలో నింపుకున్న ఈ పవిత్రమైన ప్రదేశంలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి 50 రోజుల కౌంట్ డౌన్ కార్యక్రమం నిర్వహించాలని మన ఆయుష్ మంత్రి శ్రీకారం చుట్టినందుకు ఆయనకు, మిగతా అధికారులకు హృదయ పూర్వక అభినందనలు తెలుపుతున్నాననన్నారు. ఈరోజు హైదరాబాద్‌లో ఐటి, ఇన్నోవేషన్, ఫార్మా, సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, హెల్త్, డిఫెన్స్ రీసెర్చ్ వంటి అనేకమైన గుర్తింపులు తెచ్చుకున్నామని, వాటితోపాటు భవిష్యత్తులో యోగా ఎక్కడ ఉందంటే హైదరాబాదులో అనే విషయాన్ని చాటి చెప్పేలా అందరం ప్రయత్నం చేయాలన్నారు. తెలంగాణలో ప్రతి స్కూలు, ప్రతి గ్రామం, ప్రతి కాలేజీ, ప్రతీ యూత్ ఆర్గనైజేషన్, ప్రతి పొదుపు సంఘం, ప్రతి ఎన్జీవో, ప్రతీ కార్యాలయం అన్నిట్లోనూ యోగాను ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. అంతేకాక ప్రతి ఇంట్లో యోగా, ప్రతి యువకుడిలో క్రమశిక్షణ రావాలి. ఈరోజు మనకు ఫస్ట్ డాక్టర్ ఎవరంటే మీకు మీరే. మెడిసిన్ ఏమిటంటే యోగా. యోగా ద్వారా మీరు మీ జీవితంలో, మీ శరీరంలో, మీరు చేసే పనిలో, మీరు చేసే వృత్తిలో మంచి ఫలితాలు, సానుకూల మార్పు తప్పకుండా వస్తుందన్నారు. అది అందరం చేద్దాం.. మన దేశ గౌరవాన్ని ముందుకు తీసుకెళ్దాం.. యోగాను మన ఇంటింటా రోజువారీ కార్యక్రమంలో భాగంగా ముందుకు తీసుకెళ్దాం అని మంత్రి కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





