రాష్ట్రంలో ఉద్యోగుల పరిస్థితి దుర్భరం

– కోర్టు జోక్యంతో రిటైర్డు ఉద్యోగుల బకాయిలపై కదలిక
– రైతుల పరిస్థితీ దైన్యమే
– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు

రామాయంపేట, ప్రజాతంత్ర, మే 2 : రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి దుర్భరంగా మారిందని, నెల మొదటి తేదీకి జీతాలు అందకపోవడం, టీచర్లకు వేతనాలు ఆలస్యమవడం వంటి సమస్యలు కొనసాగుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు విమర్శించారు. మెదక్‌జిల్లా రామాయంపేటలో విలేకరుల సమావేశంలో శనివారం ఆయన మాట్లాడారు. 2015 తర్వాత పీఆర్‌సీ బకాయిలు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయన్నారు. రిటైర్డ్ ఉద్యోగులకు ఇవ్వాల్సిన ప్రయోజనాలు కూడా ఆలస్యంగా అందుతున్నాయని, నాలుగు వారాల్లోగా ఇవ్వాల్సిందేనని హైకోర్టు మొట్టికాయలు వేస్తే గాని ప్రభుత్వంలో చలనం రాలేదని అన్నారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాన్ని స్పష్టంగా చూపిస్తోందన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని, ఉద్యోగులను కార్పొరేషన్ సిబ్బందిగా కాక ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చలేదు.. ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే మార్గంలో నడవకూడదు అని హితవు పలికారు. అలాగే ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలు విషయంలో ప్రభుత్వం ఇంకా స్పష్టత ఇవ్వలేదన్నారు. ప్రజలు ఇప్పటికీ వాటి అమలుకు ఎదురు చూస్తున్నారన్నారు. ఇక రైతుల పరిస్థితి అత్యంత క్లిష్టంగా ఉందని, తాను స్వయంగా పలు వరి కొనుగోలు కేంద్రాలను సందర్శించానని, అక్కడ ధాన్యం కుప్పలుగా పేరుకుపోయి ఉండటం, వర్షాల వల్ల పంట నష్టపోవడం వంటి దృశ్యాలు కనిపించాయని చెప్పారు. సరైన సమయంలో లారీలు, ట్రక్కులు అందుబాటులో లేకపోవడం వల్ల ధాన్యం ఎత్తడం ఆలస్యమవుతోందన్నారు. కొన్నిచోట్ల రైస్ మిల్లర్లు, మధ్యవర్తులు, కొందరు అధికారులు కలిసి రైతులను నష్టపరుస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర కంటే తక్కువ ధరకు రైతులు తమ పంటను అమ్ముకునే పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని రైతుల సమస్యలను పరిష్కరించాలన్నారు. మొక్కజొన్న రైతులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. వారి పంటలను కూడా ప్రభుత్వం ఎంఎస్‌పీ ప్రకారం కొనుగోలు చేయాలన్నారు. రైతులకు న్యాయం చేయడం ప్రభుత్వ బాధ్యత. కాబట్టి రైతుల సమస్యలపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.

10న ప్రధాని రాష్ట్ర పర్యటన

మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నరేంద్ర మోదీ తొలిసారిగా ఈనెల 10న రాష్ట్రానికి వస్తున్నారని, ఈ పర్యటన సందర్భంగా సుమారు రూ.7,823 కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారని రామచందర్‌రావు తెలిపారు. జహీరాబాద్‌లో ఇండస్ట్రియల్ సిటీ, వరంగల్‌లో టెక్స్‌టైల్ పార్క్, పీఎం మిత్ర హ్యాండ్లూమ్ పార్క్ వంటి కీలక ప్రాజెక్టులను ప్రారంభించనున్నారన్నారు. అదేవిధంగా హఫీజ్‌పేట్, జోగులాంబ ప్రాంతాల్లో రైల్వే స్టేషన్లు, జాతీయ రహదారుల అభివృద్ధి వంటి కార్యక్రమాలు కూడా చేపట్టనున్నట్లు, భవిష్యత్తులో వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ, ఎయిర్‌పోర్టు వంటి మరిన్ని ప్రాజెక్టులను కూడా అమలులోకి తీసుకువస్తారని చెప్పారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *