- ఇదే స్ఫూర్తిని మరో ఐదేళ్లు కొనసాగిస్తాం..
- ప్రధాని మోదీ వంద రోజుల పాలనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 17 : ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తయ్యాయని, ఈ వంద రోజుల కోసం నిర్దేశించుకున్నటార్గెట్ ను విజయవంతంగా పూర్తి చేసుకున్నామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఇదే స్ఫూర్తితో.. వచ్చే ఐదేళ్లు పనిచేస్తామని తెలిపారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో సాధించలేని విజయాలను.. ప్రధానమంత్రి మోదీ చొరవతో ఈ పదేళ్లలో సాధించామని చెప్పారు. మోదీ 3.0 మొదటి వంద రోజుల్లో.. వ్యవసాయం, మౌలికవసతులు సహా వివిధ కీలక రంగాల్లో రూ.15 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టామని వివరించారు. పరేడ్ గ్రౌండ్ లో మంగళవారం తెలంగాణ విమోచన దినోత్సవాల సందర్భంగా కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
మూడోసారి అధికారంలోకి వచ్చాక ప్రధాని మోదీ తొలి నిర్ణయం పీఎం కిసాన్ నిధి 17వ విడత కింద 9.3 కోట్ల మంది రైతులకు రూ.20,000 కోట్లు విడుదల చేశారని, వ్యవసాయ రంగంలో టెక్నాలజీ పెంపొందించేందుకు గ్రామీణ పరిశ్రమలు, స్టార్టప్ కంపెనీలకు రూ.750 కోట్ల నిధితో ‘అగ్రిష్యూర్’ పథకాన్ని ప్రారంభించామని తెలిపారు. గోధుమలను నిల్వ ఉంచడానికి 3 లక్షల మెట్రిక్ టన్నుల సామర్ధ్యం కలిగిన ధాన్యాగారాలను ఏర్పాటు చేశాం. 2024-25 ఖరీఫ్ సీజన్‌కు కనీస మద్దతు ధరను పెంచాం. దీని ద్వారా రైతాంగానికి రూ.2లక్షల కోట్ల ప్రయోజనం కలగనుంది. వాతావరణ మార్పులను రైతులకు అందజేసేలా.. రూ.2వేల కోట్లతో ‘మిషన్ మౌసం’ ఏర్పాటు దిశగా చొరవతీసుకున్నాం. డిజిటల్ టెక్నాలజీ ద్వారా ఆధునిక వ్యవసాయ పద్ధతులను ఆవలంబించేందుకు ‘డిజిటల్ అగ్రికల్చర్ మిషన్’ ఏర్పాటు చేశాం. మత్స్యకార రంగానికి 5 ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్కులను ఏర్పాటుచేశామన్నారు. నీటిపారుదల రంగ సామర్థ్యాన్ని పెంచేందుకు పోలవరం ప్రాజెక్టునకు రూ.12,100 కోట్లు మంజూరు చేశామని కేంద్ర మంత్రి చెప్పారు.
భారతదేశాన్ని ప్రపంచ తయారీ కేంద్రంగా రూపుదిద్దేందుకు రూ.28,600 కోట్లతో దేశవ్యాప్తంగా 12 ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీస్ ఏర్పాటుచేస్తున్నామని కిషన్ రెడ్డి తెలిపారు. . ఇందులో ఒకటి తెలంగాణలోని.. జహీరాబాద్ ఇండస్ట్రియల్ జోన్ లో రాబోతోందని చెప్పారు. గత రుణాలను చెల్లించిన వ్యాపారసంస్థలకు ముద్రా రుణాల పరిమితి ని రూ.10 లక్షల నుంచి రూ.20లక్షలకు పెంచామని తెలిపారు. రైలు, ఓడరేవులు, వైమానికమార్గాల కనెక్టివిటీ కోసం రూ.3 లక్షల కోట్ల విలువైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను చేపడుతున్నామని తెలిపారు. వివిధ రాష్ట్రాలలో 900 కిలోమీటర్లమేరకు రైల్ నెట్ వర్క్ ను విస్తరించేలా రూ. 24,600 కోట్ల విలువైన 8 నూతన రైల్వే లైన్ ప్రాజెక్టులు ప్రారంభించామని, ఇందులో తెలంగాణ నుంచి కూడా ఓ రైల్వే లైను ఉందన్నారు. రూ. 4,109 కోట్ల అంచనా వ్యయంతో.. భద్రాచలం-మల్కాన్‌గిరి మధ్య 173 కి.మీ.ల ప్రాజెక్టుకు ఆమోదముద్ర పడిందన్నారు.
విద్యారంగంలో దేశానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన నలంద విశ్వవిద్యాలయానికి పునర్వైభవం తీసుకొచ్చేలా కొత్త క్యాంపస్ ప్రారంభించుకున్నామని తెలిపారు. 70 ఏళ్లు, ఆపై వయసున్న వారికి ఆయుష్మాన్ భారత్ పథకాన్ని విస్తరించి.. ఏటా రూ.5 లక్షల ఆరోగ్య బీమా కవరేజి ఇవ్వనున్నామని, దీంతో తెలంగాణ నుంచి మరో 10 లక్షల మంది లబ్ధి పొందనున్నారు. కొత్తగా 75,000 మెడికల్ సీట్లు తీసుకొచ్చాం. 12 ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీల ఏర్పాటు ద్వారా.. దాదాపు 10 లక్షల ఉద్యోగాలు, పరోక్షంగా దాదాపు 30 లక్షల ఉద్యోగాల కల్పన జరగనుందన్నారు. వక్ఫ్ఆస్తుల నిర్వహణలో ఉన్న తగాదాలను పరిష్కరించేందుకు ‘వక్ఫ్ (సవరణ) బిల్లు -2024’ ప్రవేశపెట్టామని తెలిపారు. యూనిఫైడ్ పెన్షన్ పథకం (UPS) ద్వారా 23 లక్షల మంది కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు తప్పని సరిగా 50% పింఛన్ లభించేలా భరోసా కల్పించామని కిషన్ రెడ్డి తెలిపారు. ‘పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన’ ద్వారా 3.5 లక్షల ఇళలో సోలార్ వ్యవస్థలు ఏర్పాటు చేస్తున్నామనితెలిపారు. వంద రోజుల్లో నిర్దేశించుకున్న టార్గెను పూర్తి చేసాం భవిష్యత్ లో మరింత వేగవంతంగా పనిచేస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు.