రైతులకు ఏ ఇబ్బంది లేకుండా చూస్తున్నాం

– బీసీ సంక్షేమం, రవాణా శాఖ మంత్రి పొన్నం
– హుస్నాబాద్‌లో పత్తి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

హుస్నాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 22 : రైతులకు ఏ ఇబ్బంది లేకుండా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్ని చర్యలు తీసుకుంటున్నారని బీసీ సంక్షేమం, రవాణా శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. వరి, మొక్కజొన్న కేంద్రాలు ప్రారంభించి రైతులకు ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం జిల్లా కలెక్టర్లను ఆదేశించిందని, కొనుగోలు కేంద్రాలన్నీ రైతులకు వినియోగంలోకి వస్తాయని చెప్పారు. మూడు జిల్లాల పరిధిలో ఉన్న హుస్నాబాద్‌ నియోజ‌క‌వ‌ర్గం కొండాపూర్ స‌మీపంలోని గోమాత జిన్నింగ్‌ మిల్లులో పత్తి కొనుగోలు కేంద్రాన్ని మంత్రి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 12 రాష్ట్రాల్లో కపాస్‌ కిసాన్‌ మొబైల్‌ యాప్‌ కింద ఆన్లైన్‌ ద్వారా జిన్నింగ్‌ మిల్లు ఎక్కడ ఉంటే అక్కడ పత్తి కొనుగోలు కేంద్రాన్ని సూచిస్తుందని, మనకు తేది స్లాట్‌ ఇస్తారని తెలిపారు. తెలంగాణలో మొదటి పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఈరోజు ప్రారంభించుకున్నామని, పత్తికి రూ.8100 మద్దతు ధర ఉందని, ఈసారి భారీ వర్షాలు పడడం వల్ల కొంత తక్కువగా ఉందని అన్నారు. కపాస్‌ కిసాన్‌తో రాజ మార్గం ద్వారా పత్తిని అమ్ముకోవచ్చునన్నారు. సన్న వడ్లకు రూ.500 బోనస్‌ ఇస్తున్నామని, వడ్లు కొనుగోలు చేసిన 48 గంటల్లో రైతులకు డబ్బులు జమ అవుతున్నాయని, నిన్ననే అక్కన్నపేటలో సన్‌ఫ్లవర్‌ విత్తనాలు పంపిణీ చేశామని చెప్పారు. నర్మెటలో పావమ్‌ఆయిల్‌ ఫ్యాక్టరీ ప్రారంభానికి సిద్ధంగా ఉందని, ఇప్పటికే ట్రయల్‌ రన్‌ ప్రారంభమైందని ఆయన తెలిపారు. ఆయిల్‌పామ్‌, హార్టికల్చర్‌, సెరికల్చర్‌పై అవగాహన కల్పించేందుకు రైతులకు ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. రైతులు ప్రభుత్వం ఇస్తున్న అన్ని పథకాలు పొందాలన్నారు. త్వరలోనే గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేసి పొలాలకు నీళ్లు అందిస్తామని తెలిపారు. కాగా, హుస్నాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ కార్యాలయంలో విశాల సహకార పరపతి సంఘంచే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని మంత్రి పొన్నం ప్రారంభించారు. మొక్క జొన్న రూ.2400 కనీస మద్దతు ధరతో కొనుగోలు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ హైమవతి, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ లింగమూర్తి, హుస్నాబాద్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ తిరుపతిరెడ్డి, వైస్‌ చైర్మన్‌ బంక చందు, డైరెక్టర్లు, ఇతర ముఖ్య నేతలు, అధికారులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page