– క్రమంగా పెరుగుతోన్న మృతుల సంఖ్య
– ఇంకా దొరకని 40వేల మంది ఆచూకీ
– భవన శిథిలాల కింద అనేక మంది!?
– వెనెజువెల వ్యాప్తంగా తీవ్ర విధ్వంసం
– సహాయం కోసం ముందుకొచ్చిన దేశాలు
కారకాస్, జూన్ 26: దక్షిణ అమెరికా దేశమైన వెనెజువెలాను భారీ భూకంపాలు వొణికించాయి. సెకన్ల వ్యవధిలో సంభవించిన రెండు శక్తిమంతమైన భూప్రకంపనలతో దేశవ్యాప్తంగా తీవ్ర విధ్వంసం చోటుచేసుకుంది. ఈ ప్రకృతి విపత్తులో మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటివరకు 235 మంది మృతి చెందినట్లు వెనెజువెలా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది. మరో 4,300 మంది గాయపడినట్లు తెలిపింది. అనేక మంది భవన శిథిలాల కింద చిక్కుకుపోవడంతో సహాయక బృందాలు వారిని వెలికితీసేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతున్నాయి. అధికారుల సమాచారం ప్రకారం, ఈ వరుస భూకంపాల అనంతరం దాదాపు 40 వేల మంది ఆచూకీ తెలియడం లేదు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. గల్లంతైన వారి కోసం సహాయక బృందాలు విస్తృతంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. రాజధాని కారకాస్‌తో పాటు దేశంలోని పలు ప్రధాన నగరాల్లో భూప్రకంపనలు సంభవించినప్పటికీ, తీర ప్రాంత నగరమైన లా గువేరాలో అత్యధిక నష్టం వాటిల్లింది. భూకంపం ధాటికి అక్కడి పరిస్థితి దయనీయంగా మారింది. ఐక్యరాజ్యసమితి ప్రతినిధుల వివరాల ప్రకారం, లా గువేరాలో 100కు పైగా భవనాలు పూర్తిగా కూలిపోయాయి. శిథిలాల కింద చిక్కుకున్నవారిని గుర్తించడం, వారిని సురక్షితంగా బయటకు తీసుకురావడం అత్యంత క్లిష్టంగా మారిందని వారు తెలిపారు. భారీ కాంక్రీట్ శిథిలాలను తొలగించేందుకు ప్రత్యేక యంత్రాలను వినియోగిస్తున్నట్లు వెల్లడించారు. దేశవ్యాప్తంగా సుమారు 250 బహుళ అంతస్తుల భవనాలు పూర్తిగా నేలమట్టమైనట్లు వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ తెలిపారు. సహాయక చర్యలను మరింత వేగవంతం చేసేందుకు ప్రభుత్వం అన్ని శాఖలను అప్రమత్తం చేసినట్లు ఆమె పేర్కొన్నారు. ఈ విపత్తు సమయంలో తమ దేశానికి అండగా నిలిచిన ప్రపంచ దేశాలకు డెల్సీ రోడ్రిగ్స్ కృతజ్ఞతలు తెలిపారు. మానవతా దృక్పథంతో సహాయక చర్యల్లో భాగస్వాములవుతున్న అన్ని దేశాలకు వెనెజువెలా ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేశారు. ఈ క్లిష్ట సమయంలో ప్రపంచ దేశాలు చూపుతున్న సంఘీభావం తమకు ఎంతో ధైర్యాన్ని ఇస్తోందని ఆమె అన్నారు.భూకంపం అనంతరం సమాచార మార్పిడిని వేగవంతం చేయాల్సిన అవసరాన్ని గుర్తించిన ఐక్యరాజ్యసమితి ప్రతినిధులు, సామాజిక మాధ్యమాలపై ఉన్న ఆంక్షలను తొలగించాలని వెనెజువెలా ప్రభుత్వాన్ని కోరారు. అత్యవసర సమాచారాన్ని ప్రజలకు త్వరగా చేరవేయడంలో సోషల్ మీడియా కీలక పాత్ర పోషిస్తుందని సూచించారు. దీనిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో వెనెజువెలాలో ‘ఎక్స్’ సామాజిక మాధ్యమ వేదికను మళ్లీ అందుబాటులోకి తీసుకొచ్చింది. 2024లో అప్పటి ప్రభుత్వం ఈ మైక్రోబ్లాగింగ్ వేదికపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా, వెనెజువెలాకు అంతర్జాతీయంగా భారీగా సహాయం అందుతోంది. అమెరికా 150 మిలియన్ డాలర్ల విలువైన సహాయక సామగ్రిని పంపనున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం రెండు యుద్ధ నౌకలు, రవాణా విమానాలు, హెలికాప్టర్లను సిద్ధం చేసినట్లు తెలిపింది. స్పెయిన్, జర్మనీ, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, నెదర్లాండ్, మెక్సికో, బ్రెజిల్ తదితర దేశాలు కూడా వైద్య బృందాలు, సహాయక సిబ్బంది, అత్యవసర సామగ్రిని పంపేందుకు ముందుకొచ్చాయి. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్నవారిని సజీవంగా రక్షించేందుకు సహాయక బృందాలు నిరంతరం శ్రమిస్తున్నాయి. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న ప్రభుత్వం, బాధితులకు అవసరమైన అన్ని విధాల సహాయాన్ని అందించేందుకు చర్యలు చేపడుతోంది.
అపరేషన్ అమిస్టాడ్ -వెనెజువెలాకు భారత్ ఆపన్నహస్తం
న్యూదిల్లీ, జూన్ 26: భూకంపాలతో అతలాకుతలమైన వెనుజువెలాకు భారత్ ఆపన్నహస్తం అందించింది. ఆపరేషన్ అమిస్టాడ్ పేరుతో ఆ దేశానికి భారీ సహాయక కార్యక్రమాన్ని చేపట్టింది. రెండు వాయుసేన విమానాల్లో సహాయక సామాగ్రి, వైద్యబృందాన్ని పంపింది. వెనుజువెలాకు సహాయం అందించాలనే లక్ష్యంతో చేపట్టిన ఈ మిషన్‌కు ‘ఆపరేషన్ అమిస్టాడ్’ అని నామకరణం చేసినట్లు విదేశాంగ మంత్రి జైశంకర్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.వెనుజువెలాకు అత్యవసర సాయాన్ని అందించేందుకు, భారత వైమానిక దళానికి చెందిన రెండు విమానాలు ఈ రోజు ఆ దేశానికి బయలుదేరాయి. ఈ సహాయక సామగ్రిలో భారత సైన్యానికి చెందిన ఫీల్డ్ హాస్పిటల్ , 35 టన్నులకు పైగా సహాయక సామాగ్రి, మందులు, వైద్య పరికరాలు ఉన్నాయి. ఈ క్లిష్ట సమయంలో వెనిజులా ప్రభుత్వానికి, ప్రజలకు అండగా నిలవడానికి భారతదేశం కట్టుబడి ఉంది’’ అని జైశంకర్ ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





