కౌలుదార్ల గుర్తింపును త‌క్ష‌ణ‌మే ప్రారంభించాలి

– ఈ ఖ‌రీఫ్‌లో సాగుదారు కార్డులు అంద‌జేయాలి
– ఎంఎస్‌పీకి పంట ఉత్పత్తులు అమ్ముకోక‌పోతే సాగు రైతులకు న‌ష్టం
– త‌క్ష‌ణం వీరి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాలి
– ఎస్‌కేఎం, కౌలు రైతుల గుర్తింపు సాధ‌న క‌మిటీ డిమాండ్‌

హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 11: రాష్ట్రంలో కౌలు సాగుదారుల గుర్తింపు ప్రక్రియను ప్రభుత్వం తక్షణమే ప్రారంభించాలని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కేఎం), తెలంగాణ కౌలు రైతుల గుర్తింపు సాధన కమిటీ డిమాండ్ చేశాయి. ఈ ఖరీఫ్ సీజన్ నుంచే కౌలు రైతులను గుర్తించి వారికి సాగుదారు కార్డులు జారీ చేయడంతో పాటు, వారు తమ పంటలను కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)కు విక్రయించుకునేలా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశాయి. సంయుక్త కిసాన్ మోర్చా, తెలంగాణ కౌలు రైతుల గుర్తింపు సాధన కమిటీలు శుక్రవారం బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో సంయుక్త విలేకరుల సమావేశం నిర్వహించాయి. కౌలు రైతుల గుర్తింపు కోసం 2011 భూ అధీకృత సాగుదారుల చట్టాన్ని వెంటనే అమలు చేయాలని, ఈ ఖరీఫ్ నుంచే కౌలు రైతులకు సాగుదారు కార్డులు ఇవ్వాలని తాము గత కొన్ని నెలలుగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని నాయకులు తెలిపారు. అయితే ప్రభుత్వం ఈ ప్రక్రియను ప్రారంభించకుండా ఆలస్యం చేయడం వల్ల కౌలు రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. సంయుక్త కిసాన్ మోర్చా రైతు సంఘాల నాయకులు మాట్లాడుతూ కౌలు సాగుదారుల గుర్తింపు ప్రక్రియను సెప్టెంబర్ నెల నుంచే ప్రారంభించాలి. తక్కువ వర్షపాతం, ఎల్‌నినో ప్రభావం కారణంగా ఈ ఏడాది పంట ఉత్పత్తి తగ్గే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కౌలు సాగుదారులు తమ పంటలను ఎంఎస్‌పీకు విక్రయించుకోలేకపోతే వారి ఇబ్బందులు తీవ్ర స్థాయికి చేరతాయి. రైతుల్లో అసంతృప్తి మరింత పెరుగుతుంది. ప్రభుత్వం ఇంకా జాప్యం చేస్తే కౌలు రైతులు రాష్ట్రవ్యాప్తంగా, హైదరాబాద్‌లో కూడా ఆందోళనలకు సిద్ధమవుతారు” అని హెచ్చరించారు. కౌలు సాగుదారుల గుర్తింపుపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్‌కమిటీ ఈ అంశాన్ని త్వరితగతిన, సానుకూలంగా పరిష్కరించాలని వారు కోరారు. సబ్‌కమిటీ మరింత జాప్యానికి కారణంగా మారకుండా, కౌలు రైతుల గుర్తింపు ప్రక్రియకు స్పష్టమైన పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. కౌలు రైతుల గుర్తింపు సాధన కమిటీ నాయకులు మాట్లాడుతూ, 2011 చట్టం ప్రకారం కౌలు సాగుదారుల వద్ద దరఖాస్తులు తీసుకొని గ్రామస్థాయిలో ప్రజా విచారణ నిర్వహించి గుర్తించే ప్రక్రియ స్పష్టంగా ఉందని, కొత్తగా సంక్లిష్టమైన విధానాలను రూపొందించాల్సిన అవసరం లేదని తెలిపారు.కౌలు రైతుల గుర్తింపు అంశంపై సెప్టెంబర్ 2న నిర్వహించిన అఖిలపక్ష రౌండ్‌టేబుల్ సమావేశంలో 9 రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొని, కౌలు సాగుదారుల గుర్తింపుకు, 2011 చట్టం అమలుకు మద్దతుగా సంయుక్త ప్రకటన విడుదల చేశారని సాధన కమిటీ తెలిపింది. కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, టీజేఎస్, బీజేపీ, సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ, సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్, తెలంగాణ రక్షణ సేన, ధర్మ సమాజ్ పార్టీ పార్టీల ప్రతినిధులు ఈ ప్రకటనను విడుదల చేశారని పేర్కొన్నారు. ఈ అంశంపై ప్రముఖ పౌరులు ఈనెల‌ 5న బహిరంగ లేఖ విడుదల చేశారని తెలిపారు. స‌మావేశంలో సంయుక్త కిసాన్ మోర్చా రాష్ట్ర కమిటీ తరఫున, పశ్య పద్మ (రాష్ట్ర రైతు సంఘం), టి.సాగర్ (తెలంగాణ రైతు సంఘం), బి.కొండల్ (రైతు స్వరాజ్య వేదిక), ఏనుగు చంద్రారెడ్డి , జక్కుల వెంకటయ్య (తెలంగాణ రైతాంగ సమితి), భాస్కర్, కౌలు రైతుల గుర్తింపు సాధన కమిటీ తరఫున, విస్సా కిరణ్‌కుమార్, కన్నెగంటి రవి (రైతు స్వరాజ్య వేదిక), పి.శంకర్, రౌతు రమేష్ (దళిత బహుజన్ ఫ్రంట్‌) పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *