– గతంలో లీక్ అయితే కాంగ్రెస్ నేతలు రాజీనామా చేశారా
– టెన్త్ లీకేజీలో రేవంత్ రెడ్డి ఎందుకు రాజీనామా చేయలేదు
– కేంద్ర మంత్రి మంత్రి కిషన్ రెడ్డి మండిపాటు
న్యూదిల్లీ, జూలై 23: జంతర్ మంతర్‌లో జరుగుతున్న విద్యార్థుల ఆందోళనలు పట్టుకుని కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీల నేతలు రాజకీయాలు చేస్తున్నారని కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నుకున్న ప్రభుత్వాలను కూల్చాలని చూస్తున్నారంటూ ప్రతిపక్ష పార్టీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో పేపర్లు లీక్ అయినప్పుడు కాంగ్రెస్‌లోని నేతలు ఏ రోజైన రాజీనామా చేశారా? అని ఆ పార్టీ నేతలను నిలదీశారు. యూపీఏ హయాంలో ప్రశ్న పత్రాలు లీక్ అయ్యాయనే విషయాన్ని గుర్తు ఉంచుకోవాలనికేంద్ర మంత్రి సూచించారు. న్యూదిల్లీలోని జంతర్ మంతర్‌తోపాటు రాష్ట్రాల్లో జరుగుతున్న సంఘటనలు దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఈ సంఘటనలు రాజకీయ ప్రేరేపితమైనవని అభివర్ణించారు. గురువారం న్యూదిల్లీలో ఆయన మాట్లాడుతూ.. గతంలో షాహిన్‌బాగ్‌లో ఆందోళనలు చేసిన నిరసనకారులు దీని వెనుక ఉన్నట్లు అనిపిస్తున్నదని అన్నారు. నీట్ పేపర్ లీక్ చేసిన వారిని కేంద్ర ప్రభుత్వం అరెస్ట్ చేసిదని తెలిపారు. విద్యార్థులకు నష్టం జరగవద్దని మరోసారి పరీక్షను నిర్వహించామని వివరించారు. పేపర్ లీక్‌పై 2024 చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కేంద్రాన్ని ప్రశ్నించే హక్కు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి లకు ఉందా అని ప్రశ్నించారు. ఏ ముఖం పెట్టుకొని ప్రధాని ఇంటి ముందు ధర్నా చేస్తున్నారంటూ కాంగ్రెస్ నేతలను సూటిగా ప్రశ్నించారు. ఫాస్ట్ ట్రాక్ ద్వారా చట్టాన్ని మరింత కఠినం చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పదో తరగతి పేపర్ లీక్ అయిందని అన్నారు. మరి ముఖ్యమంత్రి పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా ఎందుకు చేయలేదని నిలదీశారు. చలో రాజ్ భవన్ కార్యక్రమం నిర్వహించే సత్తా ఎక్కడిదంటూ అధికార పార్టీ నేతల తీరును ఆయన ఎండగట్టారు. విద్యార్థులపై ప్రేమ లేదంటూ కాంగ్రెస్ నేతలపై కిషన్ రెడ్డి నిప్పులు చెరిగారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





