విద్యకు ‘యోగ్యత’ కలిసొచ్చేనా?

– విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి నియంతృత్వంపై సర్వత్రా విమర్శలు
– విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యా మండలిలపై సాచివేత
– వీసీ, పాలకమండలిల నిర్ణయాలకు బ్రేక్
– పాఠశాల, ఇంటర్ విద్యలోనూ గందరగోళమే
– విద్యా రంగంలో ఏకపక్ష విధానాలు  వ‌ద్దు
– విద్యార్థి సంఘాలు, మేధావుల డిమాండ్‌

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 16 :  రాష్ట్రంలో ఉన్నత విద్య వ్యవస్థ అస్తవ్యస్తంగా మారుతున్న‌ద‌న్న ఆందోళన స‌ర్వ‌త్రా వ్యక్తమవుతుతోంది. పాఠశాల విద్య నుంచి యూనివర్సిటీల వరకు కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన విద్యాశాఖ ముఖ్య  కార్యదర్శి వ్యవహారశైలిపై రోజు రోజు కు  తీవ్ర విమర్శలు పెరిగి పోతున్నాయి . ముఖ్యమంత్రే విద్యాశాఖ మంత్రిగా వ్యవహరిస్తున్న ప్రస్తుత తరుణంలో, కార్యదర్శి తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలు కాంగ్రెస్  ప్రభుత్వాన్ని  అభాసుపాలు చేస్తున్నాయని మేధావులు, సామాజిక కార్యకర్తలు, విద్యార్థి-అధ్యాపక సంఘాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. సిఎం రేవంత్ రెడ్డి కి తప్పుడు సమాచారం ఇస్తూ ఆమె తీసుకుంటున్న అనేక నిర్ణయాలు విజ‌య‌వంత‌మైన‌ట్టు ఫైల్స్ లో చూపిస్తున్నారు. గ్రౌండ్ లెవెల్ లో సరైన ఫలితాలు రావడం లేదు. ముఖ్య కార్యదర్శి  హడావిడి, ఏకపక్ష చర్యల వల్ల  పాఠశాలస్థాయి నుండీ ఉన్నత విద్యా రంగంలోని బోధన, బోధనేతర సిబ్బంది, పేరెంట్స్, విద్యార్థులు  ఆగ్రహంతో ఉన్నారు. విశ్వవిద్యాలయాల ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (ఈసీ) సమావేశాలకు ఆయా యూనివర్సిటీల ఉపకులపతులు (వీసీలు) చైర్మన్‌లుగా వ్యవహరిస్తారు. నిబంధనల ప్రకారం ఎక్స్-అఫీషియో సభ్యులతోపాటు ప్రభుత్వం నామినేట్ చేసిన సభ్యులు ఉంటారు. విద్యాశాఖ కార్యదర్శి కూడా ఆ ఈసీలో ఒక ఎక్స్-అఫీషియో సభ్యురాలు మాత్రమే. అయితే తాను చెప్పిందే వేదం.. తాను నిర్ణయం తీసుకున్నదే ఫైనల్ అంటూ ఆమె మిగతా ఈసీ సభ్యులను, వీసీల అధికారాలను అగౌరవపరుస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఉన్నత విద్యా మండలి తీసుకున్న పలు నిర్ణయాలు కూడా అమలు కాకుండా ఆమె బ్రేక్ వేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ మండలితో కూడా ఆమెకు తరచు వివాదం  జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
కార్యదర్శి విదేశీ పర్యటనల నిమిత్తం ముందే నిర్ణయించిన ఎంజీ యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీల ఈసీ మీటింగ్‌లను సైతం వాయిదా వేయాల్సి వచ్చిందనే విమర్శలు వస్తున్నాయి. తాను అందుబాటులో లేకపోతే ఈసీ స‌మావేశాలు నిర్వ‌హించొద్దు.. తాను అనుమ‌తించిన తేదీల్లోనే మీటింగులు పెట్టుకోవాలంటూ ఆమె ఆదేశాలు జ‌రీచేస్తుండ‌డంపై యూనివర్సిటీ వర్గాలు మండిపడుతున్నాయి.  మెజారిటీ సభ్యులు అందుబాటులో ఉన్నప్పటికీ.. కార్యదర్శి లేరనే కారణంతో సమావేశాలు వాయిదా పడటం, అన్ని యూనివర్సిటీల ఈసీ మీటింగ్‌లను హైదరాబాద్‌లోనే నిర్వహించాలని ఆదేశించడం వల్ల ప్రజాధనం అన‌వ‌స‌రంగా ఖర్చవుతోందని వాపోతున్నారు.
పాఠశాల నుంచి ఉన్నత విద్య, విశ్వవిద్యాలయాల వరకు వివిధ ప్రాంతాల నుంచి ఎన్నో వ్యయప్రయాసలతో తమ సమస్యల పరిష్కారం కోసం విద్యాశాఖ కార్యదర్శిని కలవడానికి వచ్చే విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆమె అందుబాటులో లేకపోవడం, ఈమెయిల్స్, వాట్సాప్ ఫిర్యాదులకు స్పందించకపోవడం వల్ల జవాబుదారితనం కొరవడిందని ఆరోపిస్తున్నారు. మరోవైపు జర్మనీ, స్విట్జర్లాండ్, కెనడా, జపాన్ వంటి దేశాల విద్యా విధానాలను అధ్య‌య‌నం చేయ‌డానికి  బృందాలుగా  విదేశీ పర్యటనలు చేస్తుండడం వల్ల ప్రభుత్వానికి భారీగా ఖర్చు మిగులుతుంద‌ని విశ్లేషకులు చెబుతున్నారు.

హైర్టు తీర్పులను కొన్ని అమలుపరచకపోవడం వల్ల విద్యాశాఖ కార్యదర్శి అనేక కోర్టు ధిక్కరణ కేసులను ఎదుర్కొంటున్నట్లు సమాచారం. డివిజన్ బెంచ్‌ల పేరిట అడ్వకేట్ జనరల్స్‌తో సవాలు చేయిస్తూ ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారనే విమర్శలున్నాయి. గత రెండేళ్లుగా స్థానభ్రంశం లేని ఏకైక ఐఏఎస్ అధికారి తానేనన్న ధీమాతోనే ఈ ఒంటెద్దు పోకడలకు పోతున్నారనే చర్చ నడుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన పలు అవినీతి అక్రమాలపై విజిలెన్స్ విచారణలకు ప్రభుత్వం ఆదేశించినా వాటిపై తగిన చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తున్నారనే విమర్శలున్నాయి. రాజ్యాంగబద్ధ సంస్థలైన బీసీ, ఎస్సీ/ఎస్టీ, విద్యా కమిషన్లను సైతం లెక్కచేయని రీతిలో వ్యవహరిస్తున్న తీరు ఆక్షేపణీయం. రేపటి భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన విద్యాశాఖ ఇలా నిర్లక్ష్యానికి గురైతే వ్యవస్థ మరింత దిగజారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. తక్షణమే సీఎంవో కార్యాలయం స్పందించి ముఖ్యమంత్రి దృష్టికి ఈ అంశాలను తీసుకెళ్లి విద్యాశాఖలో ప్రక్షాళన జరిగేలా చర్యలు తీసుకోవాలని సర్వత్రా డిమాండ్ వినిపిస్తోంది. ముఖ్య కార్యదర్శి ఏకపక్ష విధానాలు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, యూనివర్సిటీ, ఉన్నత విద్యా మండలిలను అవమానించే చర్యలకు అడ్డు వేయకపోతే ప్రభుత్వం అభాసుపాలు అవుతుందని సామాజిక విశేషకులు హెచ్చరిస్తున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *